Svaiping machines
-
ఎదురుచూపులు
స్వైపింగ్ మిషన్లు లేక ఆందోళనలోచిరు వ్యాపారులు రోజువారీ నివేదికలతో అవస్థల్లో అధికారులు మేడ్చల్ జిల్లా: నగదురహిత లావాదేవీలపై దృష్టి సారిస్తున్న జిల్లా యంత్రాంగం చిరువ్యాపారులు, దుకాణా యాజమానులకు స్వైపింగ్ యంత్రాలు ఇప్పించలేకపోతోంది. వీటి కోసం బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలు ముఖ్యంగా పెట్రోల్ బంకులు, ఆస్పత్రులు, మెడికల్ షాపులు, వివిధ మాల్స్, పరిశ్రమల యాజమాన్యాలు, చిన్న, పెద్ద వ్యాపారులంతా నగదురహిత లావాదేవీలు జరపాలని సంబంధిత శాఖల నుంచి నోటీసులు అందాయి. స్వైపింగ్ మిషన్ల కోసం బ్యాంకుల్లో దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం స్వైపింగ్ మిషన్ల కోసం 2000 నుంచి 3000 మంది వరకు వివిధ బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు, సంబంధిత మిషన్ ఖరీదు కోసం డబ్బులు చెల్లించి దాదాపు 30 రోజులు కావస్తున్నా.. ఇప్పటి వరకు మిషన్లు సరఫరా చేయలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగదురహితంపై సర్కారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లోనే చాలావరకు నగదు రహిత లావాదేవీలు జరగటం లేదు. పన్నుల వసూలు మొదలుకొని, ఆర్టీసీ, రిజిస్ట్రేషన్ తదితర కార్యాలయాల్లో కూడా ఇంకా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. రోజువారీగా నివేదికలు.. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల నుంచి తమ పరిధిలో నగదు రహిత లావాదేవీలు.. నగదు లావాదేవీలు ఎంత మేరకు జరుగుతున్నాయనే విషయంపై ప్రతి రోజు నివేదిక అందజేయాలని యంత్రాంగం కోరటంతో ఆయా శాఖలకు చెందిన ఉద్యోగులు ఇబ్బందుల పాలవుతున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ఆదేశించటంతో జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారుల నుంచి నివేదికలు తీసుకొని రాష్ట్ర ఉన్నతాధికారులకు నగదు రహితంపై సమాచారం అందిస్తున్నారు. ప్రతిరోజు తమ శాఖ పరిధిలోకి వచ్చే సంస్థల నుంచి నగదు రహిత, నగదు లావాదేవీలపై జిల్లా యంత్రాంగానికి నివేదిక సమర్పించటం కోసం నానాపాట్లు పడుతున్నారు. సాయంత్రం వరకు ఏదో ఒక నివేదిక అందజేయాలి కాబట్టి... తమకు తోచిన విధంగా సమాచారాన్ని పంపిస్తున్నట్లు సమాచారం. -
2 లక్షల మంది మొబైల్ బ్యాంకు ఖాతా
- 80 వేల మంది ఈ–వాలెట్ వాడుతున్నారు - నగదు రహితం వైపు అన్నదాత అడుగులు - కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వెల్లడి - రాష్ట్రంలోనూ ప్రోత్సహించాలని విన్నపం సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దుతో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు అన్నదాత అడుగులు వేస్తున్నాడని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది. తెలంగాణలోనూ అటువైపుగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులను కోరింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా ఇబ్బంది కలుగకుండా రైతులు తమకు అవసరమైన వ్యవసాయ ఇన్‌పుట్స్‌ను సమకూర్చుకోగలరని వివరించింది. రైతుల కోసం ఈ–బ్యాంకింగ్‌కు మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నవించింది. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరింది. కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా పట్టణ సహకార బ్యాంకుల్లో 2 లక్షల మంది రైతులు మొబైల్ బ్యాంకు ఖాతాలు తెరిచారు. మొబైల్ ఫోన్లలో సంబంధిత సహకార బ్యాంక్ యాప్ ద్వారానే ఈ రైతులంతా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. 80 వేల మంది రైతులు ఈ–వాలెట్ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. తద్వారా తమకవసరమైన సరుకులు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేస్తున్నారు. ఈ రైతులంతా తమ గ్రామాలకు సమీపంలోని పట్టణాల్లో ఉంటూ నగదు రహితం వైపు మరలుతున్నారు. వ్యవసాయ అనుబంధ కంపెనీల భాగస్వామ్యం రైతులను నగదు రహిత లావాదేవీలవైపు నడిపించేందుకు వివిధ ఎరువులు, పురుగుమందుల కంపెనీలు, సహకార బ్యాంకులు కృషి చేస్తున్నాయని కేంద్ర వ్యవసాయశాఖ పేర్కొంది. 15 వేల మంది రైతులకు నగదు రహిత లావాదేవీలపై 23 శిబిరాల్లో ఇఫ్కో శిక్షణ ఇచ్చింది. దీంతో 13 వేల మంది రైతులు కొత్తగా మొబైల్ బ్యాంక్ ఖాతాలు తెరిచారని వెల్లడించింది. ఆ కంపెనీ ద్వారా 65 మంది వ్యవసాయ అనుబంధ వ్యాపారం చేసేవారికి స్వైపింగ్ మిషన్లను అందజేశారు. ఇక క్రిబ్కో కంపెనీ దేశవ్యాప్తంగా 6 రైతు శిబిరాలు నిర్వహించింది. 2,750 మంది రైతులకు శిక్షణ ఇవ్వగా.. అందులో 1,020 మంది మొబైల్ బ్యాంక్‌లో ఖాతా తెరిచారు. మదర్ డెయిరీ 777 స్వైపింగ్ మిషన్లను అందజేసింది. అమూల్, నాఫెడ్, ఐకార్, నాబార్డులు రైతులను నగదు రహితం వైపు మళ్లించడానికి కార్యక్రమాలు చేపట్టనున్నాయని కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. రాష్ట్రంలోనూ నగదు రహిత లావాదేవీలవైపు రైతులను మరలించేం దుకు వ్యవసాయశాఖ కృషి ప్రారంభించింది. ఎరువులు, పురుగు మందు డీలర్లు స్వైపింగ్ మిషన్లను కొనుగోలు చేయాలని ఆ శాఖ కమిషనర్ జగన్ మోహన్ ఆదేశించారు. పది రోజుల కిందటే జిల్లా వ్యవసాయాధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. అప్పటికే 15 రోజుల్లోగా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. దీనిపై జిల్లాల్లోనూ కదలిక వస్తోందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. -
ఒక్క ఆలోచన!
►జీవితాన్ని మార్చదుగానీ.. చిల్లర ఇబ్బందులు తీర్చే మార్గం ►చిల్లర కష్టాలు గట్టెకించే ప్రయత్నాలు ముమ్మరం ► జిల్లా కలెక్టర్ చొరవతో రంగంలోకి దిగిన ఎస్బీఐ ► బిజినెస్ కరస్పాండెంట్లకు స్వైపింగ్ యంత్రాలు ►రద్దీ చోట్ల డెబిట్ కార్డుతో స్వైపింగ్‌కు అవకాశం ►ఒకరికి ఇచ్చేది గరిష్టంగా రూ.300లు ఇప్పటి పరిస్థితుల్లో ఒక్క ఐడియూ.. జీవితాన్ని మర్చడం లేదుగానీ చిల్లర కష్టాలు తీర్చేందుకు కొద్దిగా ఉపయోగపడుతోంది. ముఖ్య రద్దీ ప్రాంతాల్లో చిల్లరపాట్లు తప్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఐడియూతో ముందుకొచ్చింది. అది డెబిట్ కార్డుదారులకు మాత్రమే. - ఒంగోలు ప్రజల చిల్లర కష్టాలు తొలగించేందుకు కలెక్టర్ సుజాతశర్మ ప్రత్యామ్నాయ మార్గలపై దృష్టి సారించారు. గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లారు. అక్కడ ప్రయాణికులతో స్వయంగా మాట్లాడి చిల్లర బాధలు తెలుసుకున్నారు. పలువురు ప్రయాణికులు కలెక్టర్‌తో నేరుగా మాట్లాడారు. చిల్లర కొరత కారణంగా ప్రయాణం చేయాలన్నా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ బస్సుల వద్దకు వెళ్లి కండక్టర్లతో మాట్లాడారు. చిల్లర ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ చిల్లర సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్‌కు సూచించారు. స్పందించిన బ్యాంకు అధికారులు కలెక్టర్ సూచనకు బ్యాంకు అధికారులు తక్షణమే స్పందించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ఒక బిజినెస్ కరస్పాండెంట్‌ను నియమించారు. మద్దిపాడుకు చెందిన బిజినెస్ కరస్పాండెంట్ ద్వారా ఆర్టీసీ బస్టాండ్‌లోని విచారణ కేంద్రం లో స్వైపింగ్ మెషీన్‌ను సాయంత్రానికి ఏర్పా టు చే శారు. డెబిట్ కార్డు ఉన్న వ్యక్తి బిజినెస్ కరస్పాండెంట్ వద్దకు వెళ్తే రూ.300లు అకౌం ట్ నుంచి మినహాయించి ఆ మొత్తాన్ని వంద రూపాయల నోట్ల రూపంలో ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని డెబిట్ కార్డు ఉన్న వారు ఉపయోగించుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టౌన్ బ్రాంచి మేనేజర్ ఎ.సతీష్‌బాబు తెలిపారు. స్వైపింగ్ మెషీన్లను అనేక రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో భాగంగా తొలి ఈ ప్రయత్నం చేపట్టామని చెప్పారు. రూ.300లు తీసుకున్న వ్యక్తి రిజర్వు బ్యాంకు అనుమతించిన మిగిలిన మొత్తాన్ని ఏటీఎంల ద్వారా డ్రా చేసుకోవచ్చని, దానిపై ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. రోజుకు రూ.50 వేల చిల్లర పంపిణీ రోజుకు ఒక బిజినెస్ కరస్పాండెంట్ రూ.50 వేలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అంత మొత్తం డెబిట్ కార్డుదారులకు ఇచ్చే వరకూ అతడు బస్టాండ్‌లోనే ఉంటాడు. తొలిగా ఈ అవకాశాన్ని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కె.ఆదంసాహెబ్ వినియోగించుకున్నారు. ఆర్టీసీ ఆర్ఎం ఆదం సాహెబ్ మాట్లాడుతూ స్వైపింగ్ మెషీన్ రాకతో చాలా వరకూ చిల్లర సమస్య ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఒంగోలు, కందుకూరు బస్టాండ్లలో ఈ స్వైపింగ్ మెషీన్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. చీరాలకు సంబంధించి ఆ ప్రాంతం తెనాలి స్టేట్ బ్యాంక్ రీజియన్ పరిధిలో ఉందని, అందువల్ల అక్కడి అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీఐ సిబ్బంది పీబీ చంద్రశేఖర్, వి.నరేంద్రకుమార్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.