ఒక్క ఆలోచన!
►జీవితాన్ని మార్చదుగానీ.. చిల్లర ఇబ్బందులు తీర్చే మార్గం
►చిల్లర కష్టాలు గట్టెకించే ప్రయత్నాలు ముమ్మరం
► జిల్లా కలెక్టర్ చొరవతో రంగంలోకి దిగిన ఎస్‌బీఐ
► బిజినెస్ కరస్పాండెంట్లకు స్వైపింగ్ యంత్రాలు
►రద్దీ చోట్ల డెబిట్ కార్డుతో స్వైపింగ్‌కు అవకాశం
►ఒకరికి ఇచ్చేది గరిష్టంగా రూ.300లు
ఇప్పటి పరిస్థితుల్లో ఒక్క ఐడియూ.. జీవితాన్ని మర్చడం లేదుగానీ చిల్లర కష్టాలు తీర్చేందుకు కొద్దిగా ఉపయోగపడుతోంది. ముఖ్య రద్దీ ప్రాంతాల్లో చిల్లరపాట్లు తప్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఐడియూతో ముందుకొచ్చింది. అది డెబిట్ కార్డుదారులకు మాత్రమే. - ఒంగోలు
ప్రజల చిల్లర కష్టాలు తొలగించేందుకు కలెక్టర్ సుజాతశర్మ ప్రత్యామ్నాయ మార్గలపై దృష్టి సారించారు. గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లారు. అక్కడ ప్రయాణికులతో స్వయంగా మాట్లాడి చిల్లర బాధలు తెలుసుకున్నారు. పలువురు ప్రయాణికులు కలెక్టర్‌తో నేరుగా మాట్లాడారు. చిల్లర కొరత కారణంగా ప్రయాణం చేయాలన్నా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ బస్సుల వద్దకు వెళ్లి కండక్టర్లతో మాట్లాడారు. చిల్లర ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ చిల్లర సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్‌కు సూచించారు.
స్పందించిన బ్యాంకు అధికారులు
కలెక్టర్ సూచనకు బ్యాంకు అధికారులు తక్షణమే స్పందించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ఒక బిజినెస్ కరస్పాండెంట్‌ను నియమించారు. మద్దిపాడుకు చెందిన బిజినెస్ కరస్పాండెంట్ ద్వారా ఆర్టీసీ బస్టాండ్‌లోని విచారణ కేంద్రం లో స్వైపింగ్ మెషీన్‌ను సాయంత్రానికి ఏర్పా టు చే శారు. డెబిట్ కార్డు ఉన్న వ్యక్తి బిజినెస్ కరస్పాండెంట్ వద్దకు వెళ్తే రూ.300లు అకౌం ట్ నుంచి మినహాయించి ఆ మొత్తాన్ని వంద రూపాయల నోట్ల రూపంలో ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని డెబిట్ కార్డు ఉన్న వారు ఉపయోగించుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టౌన్ బ్రాంచి మేనేజర్ ఎ.సతీష్‌బాబు తెలిపారు. స్వైపింగ్ మెషీన్లను అనేక రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో భాగంగా తొలి ఈ ప్రయత్నం చేపట్టామని చెప్పారు. రూ.300లు తీసుకున్న వ్యక్తి రిజర్వు బ్యాంకు అనుమతించిన మిగిలిన మొత్తాన్ని ఏటీఎంల ద్వారా డ్రా చేసుకోవచ్చని, దానిపై ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు.
రోజుకు రూ.50 వేల చిల్లర పంపిణీ
రోజుకు ఒక బిజినెస్ కరస్పాండెంట్ రూ.50 వేలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అంత మొత్తం డెబిట్ కార్డుదారులకు ఇచ్చే వరకూ అతడు బస్టాండ్‌లోనే ఉంటాడు. తొలిగా ఈ అవకాశాన్ని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కె.ఆదంసాహెబ్ వినియోగించుకున్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం ఆదం సాహెబ్ మాట్లాడుతూ స్వైపింగ్ మెషీన్ రాకతో చాలా వరకూ చిల్లర సమస్య ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఒంగోలు, కందుకూరు బస్టాండ్లలో ఈ స్వైపింగ్ మెషీన్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. చీరాలకు సంబంధించి ఆ ప్రాంతం తెనాలి స్టేట్ బ్యాంక్ రీజియన్ పరిధిలో ఉందని, అందువల్ల అక్కడి అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ సిబ్బంది పీబీ చంద్రశేఖర్, వి.నరేంద్రకుమార్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.