ఎదురుచూపులు
స్వైపింగ్ మిషన్లు లేక ఆందోళనలోచిరు వ్యాపారులు
రోజువారీ నివేదికలతో అవస్థల్లో అధికారులు
మేడ్చల్ జిల్లా: నగదురహిత లావాదేవీలపై దృష్టి సారిస్తున్న జిల్లా యంత్రాంగం చిరువ్యాపారులు, దుకాణా యాజమానులకు స్వైపింగ్ యంత్రాలు ఇప్పించలేకపోతోంది. వీటి కోసం బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలు ముఖ్యంగా పెట్రోల్ బంకులు, ఆస్పత్రులు, మెడికల్ షాపులు, వివిధ మాల్స్, పరిశ్రమల యాజమాన్యాలు, చిన్న, పెద్ద వ్యాపారులంతా నగదురహిత లావాదేవీలు జరపాలని సంబంధిత శాఖల నుంచి నోటీసులు అందాయి. స్వైపింగ్ మిషన్ల కోసం బ్యాంకుల్లో దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం స్వైపింగ్ మిషన్ల కోసం 2000 నుంచి 3000 మంది వరకు వివిధ బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు, సంబంధిత మిషన్ ఖరీదు కోసం డబ్బులు చెల్లించి దాదాపు 30 రోజులు కావస్తున్నా.. ఇప్పటి వరకు మిషన్లు సరఫరా చేయలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగదురహితంపై సర్కారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లోనే చాలావరకు నగదు రహిత లావాదేవీలు జరగటం లేదు. పన్నుల వసూలు మొదలుకొని, ఆర్టీసీ, రిజిస్ట్రేషన్ తదితర కార్యాలయాల్లో కూడా ఇంకా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి నెలకొంది.
రోజువారీగా నివేదికలు..
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల నుంచి తమ పరిధిలో నగదు రహిత లావాదేవీలు.. నగదు లావాదేవీలు ఎంత మేరకు జరుగుతున్నాయనే విషయంపై ప్రతి రోజు నివేదిక అందజేయాలని యంత్రాంగం కోరటంతో ఆయా శాఖలకు చెందిన ఉద్యోగులు ఇబ్బందుల పాలవుతున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ఆదేశించటంతో జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారుల నుంచి నివేదికలు తీసుకొని రాష్ట్ర ఉన్నతాధికారులకు నగదు రహితంపై సమాచారం అందిస్తున్నారు. ప్రతిరోజు తమ శాఖ పరిధిలోకి వచ్చే సంస్థల నుంచి నగదు రహిత, నగదు లావాదేవీలపై జిల్లా యంత్రాంగానికి నివేదిక సమర్పించటం కోసం నానాపాట్లు పడుతున్నారు. సాయంత్రం వరకు ఏదో ఒక నివేదిక అందజేయాలి కాబట్టి... తమకు తోచిన విధంగా సమాచారాన్ని పంపిస్తున్నట్లు సమాచారం.