Cash-free transaction
-
ఎదురుచూపులు
స్వైపింగ్ మిషన్లు లేక ఆందోళనలోచిరు వ్యాపారులు రోజువారీ నివేదికలతో అవస్థల్లో అధికారులు మేడ్చల్ జిల్లా: నగదురహిత లావాదేవీలపై దృష్టి సారిస్తున్న జిల్లా యంత్రాంగం చిరువ్యాపారులు, దుకాణా యాజమానులకు స్వైపింగ్ యంత్రాలు ఇప్పించలేకపోతోంది. వీటి కోసం బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలు ముఖ్యంగా పెట్రోల్ బంకులు, ఆస్పత్రులు, మెడికల్ షాపులు, వివిధ మాల్స్, పరిశ్రమల యాజమాన్యాలు, చిన్న, పెద్ద వ్యాపారులంతా నగదురహిత లావాదేవీలు జరపాలని సంబంధిత శాఖల నుంచి నోటీసులు అందాయి. స్వైపింగ్ మిషన్ల కోసం బ్యాంకుల్లో దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం స్వైపింగ్ మిషన్ల కోసం 2000 నుంచి 3000 మంది వరకు వివిధ బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు, సంబంధిత మిషన్ ఖరీదు కోసం డబ్బులు చెల్లించి దాదాపు 30 రోజులు కావస్తున్నా.. ఇప్పటి వరకు మిషన్లు సరఫరా చేయలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగదురహితంపై సర్కారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లోనే చాలావరకు నగదు రహిత లావాదేవీలు జరగటం లేదు. పన్నుల వసూలు మొదలుకొని, ఆర్టీసీ, రిజిస్ట్రేషన్ తదితర కార్యాలయాల్లో కూడా ఇంకా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. రోజువారీగా నివేదికలు.. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల నుంచి తమ పరిధిలో నగదు రహిత లావాదేవీలు.. నగదు లావాదేవీలు ఎంత మేరకు జరుగుతున్నాయనే విషయంపై ప్రతి రోజు నివేదిక అందజేయాలని యంత్రాంగం కోరటంతో ఆయా శాఖలకు చెందిన ఉద్యోగులు ఇబ్బందుల పాలవుతున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ఆదేశించటంతో జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారుల నుంచి నివేదికలు తీసుకొని రాష్ట్ర ఉన్నతాధికారులకు నగదు రహితంపై సమాచారం అందిస్తున్నారు. ప్రతిరోజు తమ శాఖ పరిధిలోకి వచ్చే సంస్థల నుంచి నగదు రహిత, నగదు లావాదేవీలపై జిల్లా యంత్రాంగానికి నివేదిక సమర్పించటం కోసం నానాపాట్లు పడుతున్నారు. సాయంత్రం వరకు ఏదో ఒక నివేదిక అందజేయాలి కాబట్టి... తమకు తోచిన విధంగా సమాచారాన్ని పంపిస్తున్నట్లు సమాచారం. -
అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలి
నల్లగొండ : నగదు రహిత లావాదేవీలపై అన్ని శాఖలు సమన్వయంతో ముందుకుపోవాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. నగదు రహిత కార్యక్రమాలపై మండల ప్రత్యేకాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ముందుగా గుర్తించిన 11 గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెడుతూనే మిగతా గ్రామాల్లో ఆచరణయోగ్యంగా నగదు రహిత అవగాహన కార్యక్రమాలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఎంపిక చేసిన 11 గ్రామా లు ఏడు మండలాల్లో ఉన్నాయని, మిగతా 24 మండలాలల్లోనూ ఒక్కొక్క గ్రామాన్ని నగదు రహిత గ్రామంగా చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. శుక్రవారం నుంచి గ్రామ కమిటీల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. సర్వే నివేదిక ప్రకారంగా అకౌంటు లేని వారికి ఓపెన్ చేస్తామన్నారు. పూర్తి నగదు రహితంగా ఎంపి క చేసిన గ్రామాల్లో చౌకధరల దుకాణం, చిన్న చిన్న వ్యాపారులకు పాస్మిషన్లు, పేటీఎంలు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ 48 గ్రామాలను ఎంపిక చేశామని, మండల ప్రత్యేకాధికారులు, శాఖ సంయుక్తంగా అవగాహన, సర్వే పనులు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఒక్కొక్కగ్రామానికి ఎస్ఐ, సీఐను కేటాయించడంతో పాటుగా నగదు రహిత లావాదేవీలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించని వారిపై జరిమానా చెల్లింపు కోసం మూడు సబ్ డివిజన్లకు మూడు పాస్ మిషన్లు పంపిణీ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు అధికారి సూర్యం, డీఆర్ఓ కీమ్యానాయక్, డీఆర్డీఓ అంజయ్య, పాల్గొన్నారు. -
నగదు రహిత లావాదేవీలపై నేడు అవగాహన
నల్లగొండ : నగదు రహిత లావాదేవీలపై వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలకు అవగాహన కలిగించేందుకు బుధవారం నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సదస్సు నిర్వహించనున్నారు. నగదు రహిత లావాదేవీల వ్యవహారాలను పరిశీలించేందుకు నోడల్ అధికారులుగా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసీ నారాయణరెడ్డిలను నియమించారు. పెద్దనోట్ల రద్దుతో వాణిజ్య రంగాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారిం చేందుకు డిజిటల్ చెల్లింపులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం జిల్లాలో నగదు రహిత లావాదేవీలను పర్యవేక్షించేందుకు కలెక్టర్, జేసీలను నోడల్ అధికారులుగా నియమించడంతో పాటు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ శాఖలకు చెందిన అనుబంధ రంగాలకు డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించాలని సర్కారు సూచించింది. ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు ఒక్కో గ్రామాన్ని నగదు రహిత గ్రామంగా తీర్చిదిద్దాలను కలెక్టర్ బ్యాంకర్లకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. దీనిలో భాగంగానే బుధవారం ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాక్ హోల్డర్లకు అవగాహన కల్పించనున్నారు. ఈ సదస్సు సుమారు 600 మందిని ఆహ్వానించారు. డిజిటల్ చెల్లింపులపై తొలిసారిగా జరుగుతున్న సదస్సుకు జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. సదస్సుకు హాజరుకావాల్సిన వారు... రేషన్ డీలర్లు, పెట్రోల్ బంక్‌ల యజమానులు, గ్యాస్ ఏజెన్సీలు, ఫర్టిలైజర్స్, ఫస్టిసైడ్స యజమానులు, స్వయం సహాయక సంఘాలు, బుక్ కీపర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మీసేవ ఆపరేటర్లు, ట్రేడర్స్, మార్కెటింగ్ కార్యదర్శులు, పంచాయతీ కార్యదర్శులు, బ్యాంకర్లు, బిల్ కలెక్టర్లు, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు, జనరల్ స్టోర్స్, బట్టల దుకాణాల యజమానులు, ప్రభుత్వ ఫించనర్లు, హోటల్ యజమానులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, ఆటో డ్రైవర్లు, అంగన్వాడీ టీచర్లు, మద్యం దుకాణాల యజమానులు, బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు హాజరుకావాలని అధికారులు పేర్కౌన్నారు.