ఈ గోస తీరేదెన్నడు? | When this problem will shut down | Sakshi
Sakshi News home page

ఈ గోస తీరేదెన్నడు?

Published Sat, Dec 17 2016 4:12 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

ఈ గోస తీరేదెన్నడు? - Sakshi

ఈ గోస తీరేదెన్నడు?

నగదు కోసం జనం అవస్థలు

సాక్షి నెట్‌వర్క్‌: నగదు కష్టాలు సామాన్య జనానికి చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. రైతులు, మహిళలు, చిరువ్యాపారులే కాదు.. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు కూడా బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. చాలా చోట్ల బ్యాంకుల వద్ద అర్ధరాత్రి నుంచే జనం బారులు తీరుతున్నారు. ఉదయం బ్యాంకుల గేట్లు తెరవడంతోనే తోపులాటలు, తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వృద్ధులు, పలువురు ఖాతాదారులు గాయాలపాలవుతున్నారు. గంటలు గంటలు క్యూలో నిలబడలేక స్పృహతప్పి పడిపోతున్నారు.

‘గ్రేటర్‌’ కష్టాలు..: రాష్ట్ర రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరెన్సీ కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. శుక్రవారం కూడా జనం బ్యాంకులు, ఎక్కడో ఓ చోట తెరచుకున్న ఏటీఎంల వద్ద కిలోమీటర్ల మేర బారు లు తీరారు. వారిలో కొందరికే నగదు లభ్యంకాగా పెద్ద సంఖ్యలో నిరాశతో వెనుదిరిగారు. పలు బ్యాంకుల్లో ‘నో క్యాష్‌’ బోర్డులు పెట్టడంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అడ్డగుట్టలోని ఓబీసీ బ్యాంకు వద్ద క్యూలైన్‌లో నిల్చున్న ఖాతాదారుల మధ్య తోపులాట జరిగి.. బ్యాంకు అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు ఖాతాదారులతోపాటు సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వెంటనే బ్యాంకు వద్దకు చేరుకుని, బందోబస్తు ఏర్పాటు చేశారు.

ధర్నాలు.. రాస్తారోకోలు..
నోట్ల రద్దుతో నల్లధనం బయటపడడం ఏమోగానీ, తాము మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామంటూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఎస్‌బీహెచ్‌ ఎదుట ఖాతాదారులు రాస్తారోకో చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం నిజాంపేట్‌లోని ఎస్‌బీఐకి ఉదయమే పెద్ద సంఖ్యలో ఖాతాదారులు చేరుకున్నారు. కానీ బ్యాంకులో నగదు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇక్కడి నాందేడ్‌– అకోలా రహదారిపై రాస్తారోకో చేశారు. ఇక రోజూ లైన్లో నిలబడుతున్నా డబ్బులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం జన్నెపల్లిలోని సిండికేట్‌ బ్యాంకు ఎదుట ప్రధాన రహదారిపై రైతులు, మహిళలు రాస్తారోకో చేశారు. మిషన్‌ భగీరథ పథకం పైపులను రోడ్డుపై అడ్డంగా పెట్టి ఆందోళన చేయడంతో.. గంటకుపైగా ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌ స్టాఫ్‌కాలనీలోని స్టేట్‌బ్యాంక్‌ వద్ద గంటల తరబడి క్యూలో నిలబడ్డ కన్నాల గ్రామానికి చెందిన వృద్ధుడు కాల్వ కొంరయ్య సొమ్మసిల్లి పడిపోయాడు.

బ్రష్‌ పట్టుకొని లైన్‌లోకి..
నగదు విత్‌డ్రా కోసం బ్యాంకుల వద్దే పడిగాపులు కాస్తున్న ఖాతాదారులు.. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని ఎస్‌బీహెచ్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే ప్రజలు బారులు దీరారు. అందులో కొందరు క్యూలో నిలబడే పళ్లు తోముకుని, టీ తెప్పించుకుని తాగారు.

నగదు కోసం రోడ్డెక్కిన రైతన్న
ధాన్యం అమ్మినా.. ఆ డబ్బులు చేతికందక రైతులు ఆగ్రహంతో రోడ్డెక్కారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో రాజీవ్‌ రహదారిపై రైతులు, మహిళలు రాస్తారోకో చేశారు. ఇక్కడి కేడీసీసీబీ బ్రాంచీ వద్ద నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఉదయం నుండే రైతులు, మహిళలు బారులు తీరారు. అయితే బ్యాంకులో మధ్యాహ్నం ఒంటి గంటకే నగదు అయిపోయింది. దీంతో అప్పటికే గంటల తరబడి క్యూలైన్‌లో ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాస్తారోకో చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, బ్యాంకర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బిడ్డ పెళ్లికి డబ్బులివ్వండి
‘ఉపాధి కోసం కొన్నేళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నా.. నాకు ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తెకు ఈ నెల 28న వివాహం జరుగనుంది. సెలవుపై దుబాయ్‌ నుంచి వచ్చా.. ఇక్కడ పెద్ద నోట్లు రద్దు చేశారు. ఇప్పుడు బిడ్డ పెళ్లి ఎలా చేయాలి..?’ జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన నేరెళ్ల నడ్పి నర్సయ్య ఆవేదన ఇది. శుక్రవారం కోరుట్ల ఎస్‌బీఐ మేనేజర్‌ను కలసి, పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు విత్‌డ్రా చేసుకుంటామని కోరారు. పెళ్లి ఖర్చుల చెల్లింపులు స్వీకరించేవారి ఖాతా నంబర్లు ఇస్తే నేరుగా వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని మేనేజర్‌ చెప్పారు. కానీ పెళ్లి పనులు చేసే వారు ఖాతాల్లో డబ్బు వేస్తామంటే ఒప్పుకోవడం లేదని నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

పింఛను సొమ్ము అందక బ్యాంకు వద్దే కన్నుమూత
కర్నూలు జిల్లా డోన్‌లో వృద్ధురాలు మృతి
డోన్‌ టౌన్‌: పింఛను సొమ్ము అందక ఓ పండుటాకు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లా డోన్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. డోన్‌ మండలం మల్యాలకు చెందిన బాణాల సుంకులమ్మ (75) వితంతు పింఛనుపైనే ఆధారపడి జీవనం సాగిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీల పాట పాడుతున్న ప్రభుత్వం అంద రు పింఛనుదారులకులాగానే సుంకులమ్మ పిం ఛన్ను కూడా డోన్‌ ఆంధ్రాబ్యాంక్‌లో ఎప్పుడో తెరిచిన ఆమె పొదుపు ఖాతాలో జమ చేసింది. కొంతకాలంగా లావాదేవీలు లేకపోవడంతో ఆ ఖాతా రద్దయ్యింది. వారం పాటు బ్యాంకు చుట్టూ తిరిగి ఖాతాను పునరుద్ధరించుకుంది. శుక్రవారం డబ్బులు తీసుకుందామని వెళ్లిన సుంకులమ్మకు బ్యాంకు సిబ్బంది ఖాతాలో కనీస మొత్తం ఉంచనందుకు చార్జీల కింద రూ.688 మినహాయించుకున్నామని, అవి పోగా రూ.312 మాత్రమే ఖాతాలో ఉన్నాయని చెప్పారు. అవి ఇప్పుడు ఇచ్చేందుకు వీల్లేదని చెప్పడంతో షాక్‌తో బ్యాంకులోనే కుప్పకూలి ప్రాణాలు విడిచింది.

ఇదో రకం ‘చిల్లర’ కష్టం..
బ్యాంకుల్లో నగదు లేదు.. ఖాతాదారులేమో అత్యవసరం, డబ్బు కావాలి అంటున్నారు.. దీంతో పలు చోట్ల బ్యాంకుల సిబ్బంది రూ.10, రూ.5 చిల్లర నాణాలను ఖాతాదారులకు ఇస్తున్నారు. ఇలా శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్‌ ఎస్‌బీహెచ్‌లో నలుగురు మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు రూ.20 వేల విలువైన పది రూపాయల నాణాలు ఇచ్చారు. వారు దాదాపు గంట పాటు బ్యాంకు ఆవరణలో కూర్చుని.. ఆ నాణాలను లెక్కబెట్టి పంచుకున్నారు. ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనగుర్తికి చెందిన బోరెడ్డి జీవన్‌రెడ్డికి కూడా బ్యాంకు సిబ్బంది రూ.20 వేల విలువైన పది రూపాయల నాణాలు ఇచ్చారు. ఆయన వాటిని ఓ సంచీలో నింపుకొని వెళ్లారు. వాటి బరువుతో ఇబ్బంది పడాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement