ఏలూరు : రబీ పంటను గట్టెక్కించేందుకు కచ్చితమైన చర్యలు చేపడుతున్నామని.. ఈ విషయంలో రైతులెవరూ భయపడాల్సిన పనిలేదని కలెక్టర్ కె.భాస్కర్ హామీ ఇచ్చారు. పంటల్ని కాపాడేందుకు రెండు రోజుల్లో సీలేరు నుంచి అదనపు నీటిని తీసుకువస్తున్నట్టు చెప్పారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని 48 మండలాల తహసిల్దార్లు, వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. జిల్లాలో 4.60 లక్షల ఎకరాల్లో వరి వేసేందుకు అనుతించామని ఆయన పేర్కొన్నారు. వంతులవారీ విధానంలో చేలకు నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. మెరక ప్రాంతంలోని 30 వేల ఎకరాల్లో పంటకు నీరు పూర్తి స్థాయిలో అందటం లేదని, సీలేరు నుంచి అదనపు జలాలను తీసుకువచ్చి రబీ పంటను కాపాడతామని అన్నారు. ఈ విషయంలో రైతులకు భరోసా కల్పించాలని అధికారులను ఆదేశించారు.
గత ఖరీఫ్ సీజన్‌లో 34 శాతం వర్షపాతం తగ్గినా, గోదావరిలో నీటి లభ్యత తగ్గుముఖం పట్టినా పంటలకు నీటిని సక్రమంగా అందించామని గుర్తు చేశారు. రైతులు కూడా కష్టపడి అధిక దిగుబడులు సాధించారన్నారు. రానున్న 15రోజులపాటు మరింత కష్టపడి వంతులవారీ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయగలిగితే రబీలో పంట దిగుబడి పెరుగుతుందన్నారు. ఇందుకోసం అధికారులు కంకణబద్ధులై పనిచేయాలని కోరారు.
డ్రెయిన్లలో ఎక్కడికక్కడ మోటార్లను ఏర్పాటు చేసి నీటిని పంట కాలువల్లోకి మళ్లించాలని, అక్కడి నుంచి చేలకు అందించాలని ఆదేశించారు. తహసిల్దార్లు, వ్యవసాయ, నీటిపారుదల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మోటార్లకు అయ్యే డీజిల్ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. చేపల చెరువులకు నీటిని మళ్లించకుండా చూడాలన్నారు. శివారు భూములకు సమృద్ధిగా నీరు అందేలా కాలువలలో నీటి మట్టాలు ఉండేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్‌ఈ బి.శ్రీనివాసయాదవ్, ఈఈ కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.