రబీ పంటల బీమాపై పల్లెల్లో ప్రచారం | Propagation in Rabi Crop Insurance in rural areas | Sakshi
Sakshi News home page

రబీ పంటల బీమాపై పల్లెల్లో ప్రచారం

Published Thu, Jan 2 2020 4:53 AM | Last Updated on Thu, Jan 2 2020 4:53 AM

Propagation in Rabi Crop Insurance in rural areas - Sakshi

సాక్షి, అమరావతి: రైతులపై ఆర్ధిక భారాన్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పంటల బీమా పథకంపై విస్తృత అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. పంటల బీమా కింద గుర్తించిన సాగు భూమినంతటినీ పథకం పరిధిలోకి తెచ్చేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను వినియోగించుకోవాలని నిర్ణయించారు. పల్లెల్లో వ్యవసాయ సంబంధిత సేవలు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ), గ్రామ ఉద్యాన సహాయకులు, గ్రామ సెరికల్చర్‌ సహాయకులను నియమించింది. వీరి ద్వారా పంటల బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని సంకల్పించింది. ఇందుకు సహకరించాలని కోరుతూ వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ కలెక్టర్లకు లేఖలు రాశారు. క్షేత్రస్థాయిలో ఆయా విభాగాలు పంట కోత ప్రయోగాలు నిర్వహించే పనులను వ్యవసాయ శాఖ సమన్వయం చేస్తూ అర్హులైన రైతుల క్లెయిమ్‌లను పరిష్కరిస్తుంది. 

శనగకు 31 వరకు గడువు..
రబీలో అత్యధికంగా పండించే పంటల్లో ప్రధానమైన శనగ (బెంగాల్‌ గ్రామ్‌)ను సాగు చేసే రైతులు ఈనెల 31వతేదీ వరకు ఇ–కర్షక్‌ ద్వారా బీమా చేయించుకోవచ్చు. మిగతా రబీ పంటలకు ఫిబ్రవరి 15లోగా బీమా చేయించుకోవచ్చు. వాస్తవ సాగుదారులైనా, కౌల్దారులైనా ఇ–కర్షక్‌ ఆధారంగానే గుర్తిస్తారు. ఆమేరకు అందులో వివరాలు కచ్చితంగా ఉండాలి. గ్రామ స్థాయిలో సేకరించిన సమాచారానికి పూర్తి బాధ్యత ఆయా గ్రామాల్లోని వీఏఏలు, వీహెచ్‌ఏలు, వీఆర్‌వోలదే. 

బ్యాంకులు మినహాయించుకుంటే తిరిగివ్వాలి...
రుణం తీసుకున్నా, తీసుకోకపోయినా ఆయా రైతుల వివరాలను ఇ–కర్షక్‌లోనే నమోదు చేయాలి. రైతుల వివరాలను నమోదు చేయాల్సిన బాధ్యత బ్యాంకులకు ఉండదు. ఒకవేళ ఏదైనా బ్యాంకు గత ఏడాది అక్టోబర్‌ 1వతేదీ తర్వాత రుణాలు తీసుకున్న రైతుల నుంచి పంటల బీమా కోసం డబ్బులు మినహాయించుకుని ఉంటే ఆ మొత్తాన్ని తిరిగి అన్నదాతలకు చెల్లించాలి. ఇప్పటికే ఏదైనా బ్యాంకు పంటల బీమా కోసం మినహాయించుకున్న సొమ్మును ఆన్‌లైన్‌ ద్వారా బీమా సంస్థకు చెల్లించి ఉంటే ఆ మొత్తాన్ని తిరిగి వెనక్కు పంపాలని కోరతాయి. 

పంట కోత ప్రయోగాలపై యాప్‌
పంట కోత ప్రయోగాల నిర్వహణకు ఆర్థిక, గణాంకాల డైరెక్టర్‌ నిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను అభివృద్ధి చేస్తారు. సీజన్‌ చివరిలో ఏ పంటలకు కోత అనంతరం ప్రయోగాలు నిర్వహించారు? దిగుబడి ఎంత? తదితర వివరాలను వ్యవసాయ శాఖకు పంపాలి. వీటి ఆధారంగా వ్యవసాయ శాఖ క్లెయిమ్‌లను లెక్కకడుతుంది. ఉల్లి వంటి వాటి పంట కోత ప్రయోగాలను ఉద్యాన శాఖ నిర్వహిస్తుంది. పంట నష్టం, క్లెయిమ్‌ల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న పీఎంఎఫ్‌బీవై, ఆర్‌డబ్య్లుబీసీఐఎస్‌ విధానాలనే కొనసాగిస్తారు. అర్హమైన క్లెయిమ్‌లను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా పరిష్కరించి ఆధార్‌ అనుసంధానిత లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేస్తుంది. 

బీమా ఇలా...
- బీమా వర్తించే పంటలు, సాగుదారుల వివరాలను ఇ–కర్షక్‌ ద్వారా మాత్రమే సేకరిస్తారు.
- బీమా చేయించుకునే ప్రతి రైతుకు ఆధార్‌ కార్డు తప్పనిసరి. ఆధార్‌ బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉండాలి. 
ప్రధాని పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై) ద్వారా పునర్‌ వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పధకం (ఆర్‌డబ్య్లుబీసీఐఎస్‌) కింద గుర్తించిన పంటలై ఉండాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement