కష్టం చూడాలి.. నష్టం ఆపాలి | Job chart of village agriculture assistants was ready | Sakshi

కష్టం చూడాలి.. నష్టం ఆపాలి

Jan 7 2020 4:57 AM | Updated on Jan 7 2020 4:57 AM

Job chart of village agriculture assistants was ready - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏలు)గా పని చేస్తున్న సిబ్బందిని రైతు మిత్రులుగా వ్యవహరించేలా వ్యవసాయ శాఖ శిక్షణ ఇస్తోంది. కర్షకుల సమస్యలు, ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. సలహాదారులుగా మెలిగేలా సంసిద్ధం చేస్తోంది. వ్యవసాయ శాఖకు జవాబుదారీగా ఉంటూ.. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరవేస్తూ నష్టాలను నివారించి.. ప్రతి రైతు లాభాల బాట పట్టేలా వీఏఏలను కార్యోన్ముఖుల్ని చేస్తోంది. ఇందుకు సంబంధించి వీఏఏల విధులను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. వీరి ప్రధాన బాధ్యతలను ఆరు విభాగాలుగా వర్గీకరిస్తూ మాన్యువల్‌ను ఖరారు చేసింది. వీటిలో సాధారణ విధులు, డేటా సేకరణ, విస్తరణ విధులు, నాణ్యమైన ఉత్పాదకాల పంపిణీ, పంట నష్టం లెక్కింపు, పంటల బీమాపై అవగాహన వంటి విధులు ఉన్నాయి.

విధులివీ
- వీఏఏలు గ్రామ పంచాయతీ ప్రధాన కార్యాలయాల్లోనే ఉండి వ్యవసాయ శాఖ అప్పగించే పనులకు జవాబుదారీగా వ్యవహరించాలి. ఉదయం వేళ క్షేత్ర సందర్శన చేయాలి. వ్యవసాయ శాఖ, గ్రామ సచివాలయ సమావేశాలకు హాజరుకావాలి. శాఖాపరమైన రికార్డులను కచ్చితత్వంతో నిర్వహించాలి.
- రైతుల సామాజిక, ఆర్థిక సర్వే, భూ వినియోగం, నీటి వనరులు, పంటల విస్తీర్ణం, దిగుబడి వంటి వివరాలను సేకరించాలి. వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి సమీకృత గ్రామ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలి. అన్నిరకాల పంటలను ఎలక్ట్రానిక్‌ బుకింగ్‌ చేయాలి. డిమాండ్‌కు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల లభ్యతను పర్యవేక్షించాలి.
- మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్షలతో పాటు చేలల్లో వేసే పంట, వాతావరణ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలి. ఆదాయ పెంపు సహా వ్యవసాయ శాఖ పథకాలను అమలు చేయాలి. కిసాన్‌ మేళాలకు రైతులు ఎక్కువగా హాజరయ్యేలా చూడాలి. పంట ఉత్పాదకత పెంపు, ఆహార ఉత్పత్తుల శుద్ధి, అదనపు విలువ జోడింపు వంటి మార్కెటింగ్‌ మెళకువలపై నమూనా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. గ్రామాల్లోని బ్లాక్‌ బోర్డులపై ఎప్పటికప్పుడు తాజా వ్యవసాయ సమాచారాన్ని రాస్తుండాలి. అర్హులైన రైతులకు శాఖాపరమైన సహాయం అందుతుందో లేదో పర్యవేక్షించాలి. అవసరమైతే సిఫార్సు చేయాలి. చీడ పీడలపై ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేయడం, వ్యవసాయ పనిముట్లు, పరికరాలు, యంత్రాలను కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల (సీహెచ్‌ఎల్‌) ద్వారా కర్షకులకు లభ్యమయ్యేలా చూడాలి.
- రైతులకు సబ్సిడీపై ఇచ్చే అన్నిరకాల ఉత్పాదకాలు, విపత్కర పరిస్థితుల్లో తక్షణ విత్తన పంపిణీ జరిగేలా చూడాలి. డాక్టర్‌ వైఎస్సార్‌ సమగ్ర వ్యవసాయ పరీక్షా ప్రయోగశాలల్లోని సేవలను ప్రతి రైతు వినియోగించుకునేలా చైతన్యపరచాలి. నాణ్యతలేని ఉత్పత్తులు చలామణి అవుతుంటే వెంటనే మండల వ్యవసాయాధికారికి నివేదించాలి.
- వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని రైతులకు ఫోన్ల ద్వారా అందించి అప్రమత్తం చేయాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాన్ని సకాలంలో అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదించాలి. యుద్ధప్రాతిపదికన ప్రకృతి విపత్తుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి. 
- వివిధ పథకాల అమలులో వ్యవసాయ అధికారులకు సహకరించాలి. పంటల బీమా, సంస్థాగత రుణాలు, ఇతర సేవలపై కౌలు రైతులు, రుణాలు పొందని రైతులకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడంలో సహకరించాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement