పట్టిసీమ.. ‘వట్టి’ సీమ | 'Drop Pattiseema, give priority to Polavaram project' | Sakshi
Sakshi News home page

పట్టిసీమ.. ‘వట్టి’ సీమ

Published Thu, Apr 16 2015 12:39 AM | Last Updated on Mon, Oct 1 2018 5:09 PM

పట్టిసీమ.. ‘వట్టి’ సీమ - Sakshi

పట్టిసీమ.. ‘వట్టి’ సీమ

నీళ్లు- నిజాలు : 4
గోదావరి నీటిని మళ్లించడం ద్వారా కృష్ణాడెల్టాలో మిగిలే నీటిని సీమకిస్తుందట
* పట్టిసీమ పేరుతో మభ్యపెడుతున్న ప్రభుత్వం
* సీమపై చిత్తశుద్ధి ఉంటే.. పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా సామర్థ్యానికి అనుగుణంగా కాలువలను సిద్ధం చేయాలి: రైతు సంఘాలు

సాక్షి, హైదరాబాద్: ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానంటే ఇదేనేమో! కృష్ణమ్మ పోటెత్తి ప్రవహించినప్పుడు రాయలసీమకు నీరు తీసుకెళ్లడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం..

గోదావరి నీటిని మళ్లించడం ద్వారా కృష్ణా డెల్టాలో మిగిలే నీటిని సీమ లో వినియోగించుకుంటామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇం దుకోసమే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నట్టు ప్రజ లను మభ్యపెడుతోంది. నిజానికి గోదావరి, కృష్ణా నదులు రెం డింటికీ దాదాపు ఒకే సమయంలో వరదలొస్తాయి. కృష్ణాలో వరదలున్నప్పుడు గోదావరి నీటిని లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే కృష్ణా డెల్టాకు నీటి అవసరం ఉన్నప్పుడు, గోదావరిలో వరద లేకపోతే లిఫ్ట్ చేయడానికి అవకాశమూ ఉండదు. అంటే కృష్ణా డెల్టాకే గోదావరి నీటి తరలింపుపై ‘గ్యారంటీ’ లేదు. కానీ గోదావరి నీటిని కృష్ణా డెల్టా అవసరాలకు వాడి, అక్కడ మిగిలే కృష్ణా నికర జలాలను శ్రీశైలం నుంచి రాయలసీమకు మళ్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

కృష్ణా నది నుంచీ సీమకు నీళ్లు తీసుకెళ్లడంలో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి చర్యలు తీసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం.. కొత్తగా నికర జలాలను తరలిస్తామని చెప్పడంలో ఎంత డొల్లతనం ఉందో అర్థమవుతోంది.
 
సీమకు నీళ్లెలా ఇస్తారు?

కృష్ణానది నీటిని రాయలసీమకు తీసుకెళ్లడానికి రెండే మార్గాలు ఉన్నాయి. 1. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, 2. హంద్రీ-నీవా సుజల స్రవంతి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని రాయలసీమకు తీసుకెళ్లడానికి అవకాశముంది. విద్యుత్ ఉత్పత్తికోసం వినియోగించే మరో 4,500 క్యూసెక్కుల నీరు దీనికి అదనం. కృష్ణాలో ఏడాదికి సగటున 30 రోజులపాటు వరద ఉంటుందని అంచనా.

గతేడాది దాదాపు 100 రోజులపాటు కృష్ణానది పోటెత్తింది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గరిష్ట సామర్థ్యం మేరకు నీటిని తీసుకెళితే.. 30 రోజుల్లో 120 టీఎంసీలకు మించి నీటిని తీసుకెళ్లవచ్చు. కానీ తీసుకెళ్లింది 45-50 టీఎంసీలే.పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తెసుకెళ్లే కాలువల్లో అవరోధాలు  ఉండటంతో 7-8 వేల క్యూసెక్కులకు మించి నీటిని తీసుకెళ్లడానికి వీల్లేకుండా పోయింది. నామమాత్రపు నిధులతో పనులు పూర్తి చేయడానికి అవకాశమున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. ‘హంద్రీ-నీవా సుజల స్రవంతి’ పరిస్థితీ అంతే. పనుల పెండింగ్ వల్ల  కాల్వల గరిష్ట సామర్థ్యం మేరకు నీరు ప్రవహించట్లేదు. 12 మోటార్లద్వారా నీటిని లిఫ్ట్‌కు వీలున్నా.. 3 మోటార్లకు మించి నడిపితే..  నీరు సాఫీగా వెళ్లలేదు. నామమాత్రపు నిధులతో ఈ ఇబ్బందుల (బాటిల్‌నెక్స్)ను తొలగించడానికి అవకాశమున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదు.

కృష్ణానదిలో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోలేని సర్కారు.. గోదావరి నీటిని తీసుకొచ్చి వాడుకుంటామని చెప్పడం పై అధికారవర్గాల్లోనే అనుమానాలున్నాయి. రాయలసీమ పట్ల చిత్తశుద్ధి ఉంటే పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా నుంచి గరిష్ట సామర్థ్యంతో నీటిని తీసుకెళ్లడానికి చర్యలు తీసుకోవాలని రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
 
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచిన వైఎస్
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని దిగువప్రాంతాలకు తరలించవచ్చుననే నిబంధనలున్నాయి. 1982లో పోతిరెడ్డిపాడు వద్ద 4 గేట్లతో 15 వేల క్యూసెక్కుల నీటివిడుదల సామర్థ్యంతో హెడ్‌రెగ్యులేటర్‌ను నిర్మించారు. కృష్ణా నుంచి వరద జలాలను అధికంగా తీసుకెళితే, రాయలసీమ ప్రాజెక్టులను నింపడానికి అవకాశం ఉంటుందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు.

2005 డిసెంబర్‌లో రూ. 201.347 కోట్ల వ్యయంతో 44 వేల క్యూసెక్కుల నీటివిడుదలకు అనుకూలంగా పదిగేట్లతో కొత్త హెడ్‌రెగ్యులేటర్ నిర్మాణ పనులు చేపట్టారు. వైఎస్ మరణానంతరం బాధ్యతలు చేపట్టిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు దీనిని పూర్తిచేయటంలో శ్రద్ధచూపలేదు. దీంతో రూ.186 కోట్లను వెచ్చించి 85 శాతం మేరకే హెడ్‌రెగ్యులేటర్ పనులను పూర్తిచేశారు. మిగిలిన 15 శాతం పనులను ఐదేళ్లుగా పూర్తిచేయటంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి.

15 శాతం పనుల్లో 0 నుంచి 9 కిలోమీటర్ల వరకు స్టాండర్డుబ్యాంకు, శ్రీశైలం కుడి కాల్వ(ఎస్‌ఆర్‌ఎంసీ) వెంట(3, 4, 8, 12 కిలోమీటర్ల వద్ద) నాలుగు ప్రాంతాల్లో వంతెనలు నిర్మించాల్సి ఉంది. అలాగే ఎర్రగూడూరు గ్రామం వద్ద 15వ కిలోమీటరు వద్ద ఎస్‌ఆర్‌ఎంసీ కాల్వను కిలోమీటరు మేర విస్తరించాల్సిన పనులు నిలిచిపోయాయి.

కాల్వలను విస్తరించి మిగిలిన 15 శాతం పనులు పూర్తిచేయటంతోపాటు బానకచర్ల వద్ద హెడ్‌రెగ్యులేటరును పూర్తిచేసి పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయటంతోపాటు దిగువనున్న రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచితే ఏటా వృథా అవుతున్న వందల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశముంది. కానీ ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి చూపకపోవడంతో ఈ ఏడాది కృష్ణానది పోటెత్తినా సీమకు తగినన్ని నీళ్లు తీసుకెళ్లడంలో విఫలమైంది.
 
ఇదీ వైఎస్ ఘనత..
హంద్రీ-నీవాకు టీడీపీ  హయాంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మరోసారి హంద్రీ-నీవాకు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు హయాం లో ప్రాజెక్టుకోసం కేవలం రూ.13.77 కోట్లు మాత్రమే ఖర్చు చేశా రు. ఆ నిధులు సిబ్బంది జీతభత్యాలకే సరిపోయాయి. తర్వాత వైఎస్ సీఎం అయ్యాక రూ.6,850 కోట్లతో ప్రాజెక్టుకు టెండర్లు పిలిచారు. వైఎస్ హయాంలో (5ఏళ్లలో) రూ. 4,340.36 కోట్లు కేటాయించారు. ఆపై రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో రూ. 2,143.44 కోట్లు ఇచ్చారు.
 
ఇదీ బాబు నిర్వాకం..
* కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్ వరకూ మూడేళ్లుగా నీటిని ఎత్తిపోస్తున్నారు. మల్యాల-జీడిపల్లి మధ్యలో ఎనిమిది లిఫ్ట్‌లు ఉన్నాయి. ప్రతీ లిఫ్ట్ వద్ద 12 పంపులున్నాయి. అయితే 3 పంపులద్వారా మాత్రమే నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తికాకపోవడం, ప్రధాన కాలువ వెంబడి అప్రోచ్ కాలువను నిర్మించకపోవడంతో మొత్తం పంపులు రన్ చేస్తే నీటి ప్రవాహ ఒత్తిడికి ప్రధాన కాలువ తెగిపోయే ప్రమాదముంది. దీంతో 3 పంపులతోనే రన్ చేస్తున్నారు. అప్రోచ్ కాలువ పనులు పూర్తయ్యాక పూర్తిస్థాయిలో రన్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
* ఏడాదిలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు పదేపదే చెప్పారు. మంత్రులు, బాలకృష్ణతోసహా రెండుసార్లు హంద్రీ-నీవా కాలువను సందర్శించారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల జరిగిన బహిరంగసభలోనూ హంద్రీ-నీవా ద్వారా ఏడాదిలోపు చిత్తూరుకు నీళ్లు తీసుకొస్తానని సీఎం చెప్పారు. దీంతో ఈ ఏడాది బడ్జెట్‌లో కనీసం రూ.800-1000 కోట్లు కేటాయిస్తారని అంతా భావించారు. కానీ రూ. 200 కోట్లే కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement