ఏడాదిలోనే పట్టిసీమ పూర్తి
శాసనసభలో సీఎం ప్రకటన
సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోనే పూర్తిచేసి కృష్ణా డెల్టాకు నీళ్ళిచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. 2019 కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉభయ గోదావరి జిల్లాలకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపై మంగళవారం ఆయన శాసనసభలో ఒక ప్రకటన చేశారు. గతంలో తాను పునాది వేసిన సాగునీటి ప్రాజెక్టులను తిరిగి తన హయాంలోనే పూర్తి చేస్తున్నానని సీఎం చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి నీరు అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నానని, నదుల అనుసంధానానికి కృషి జరుగుతోందని చెప్పారు. రాయలసీమ జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామన్నారు. చంద్రబాబు సుదీర్ఘోపన్యాసంలోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
► కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులు కట్టడం వల్ల రాష్ట్రంలోని జలాశయాలకు సరిపడా నీరు రావడం లేదు. ఇంకోవైపు గోదావరి నీరు వృథా అవుతోంది. ఈ నేపథ్యంలో గోదావరి నీటిని కృష్ణాకు మళ్ళించే ఉద్దేశంతోనే పట్టిసీమను చేపట్టాం.
► ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్లు, డ్రాయింగులు ఏమాత్రం ఆలస్యం లేకుండా అధికారులు పూర్తిచేశారు. ప్రతిరోజు వెయ్యిమంది ప్రాజెక్టు వద్ద పనిచేశారు.
► 24 పంపులు, మోటార్లను ఉపయోగించి 8,500 క్యూసెక్కుల గోదావరి జలాలను తోడే విధంగా పథకాన్ని రూపొందించాం.
► రాష్ట్రంలోనే తొలిసారిగా 354 క్యూసెక్కుల సామర్థ్యం గల వర్టికల్ టర్బయిన్ పంపులను నీళ్ళను లిఫ్ట్ చేయడానికి ఉపయోగించాం.
► పట్టిసీమ వల్ల 80 నుంచి 100 టీఎంసీల గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదికి మళ్ళించడానికి వీల వుతుంది. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు దీనివల్ల ప్రయోజనం జరుగుతుంది.
► గత వ్యవసాయ సీజన్‌లో సుమారు 4.20 టీఎంసీల నీటిని పట్టిసీమ వద్ద లిఫ్ట్ చేయడం జరిగింది. మరో 4.6 టీఎంసీలను ఆడిపూడి వద్ద లిఫ్ట్ చేశాం. పట్టిసీమ నీటి వల్ల కృష్ణాడెల్టాలో రూ.2,500 కోట్ల విలువైన వరిపంటను కాపాడాం.