సాధికారమిత్రలకు చీరలు పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్న వారిని గుర్తించి, వారికి ప్రభుత్వం పట్ల సానుకూలత ఏర్పడేలా నచ్చజెప్పే బాధ్యత సాధికార మిత్రలదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి 35 ఇళ్లకు ఒక డ్వాక్రా మహిళను సాధికార మిత్రలుగా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు బుధవారం ఉండవల్లిలోని తన అధికార నివాసం నుంచి 500 మంది సాధికార మిత్రలతో ప్రత్యక్షంగా, మిగిలిన 4.60 లక్షల మంది సాధికార మిత్రలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘మీకు కేటాయించిన 35 కుటుంబాల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందుతున్నాయో లేదో తెలుసుకోవాలి. ప్రభుత్వం పట్ల ప్రజలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో గుర్తించాలి.
రాష్ట్రంలో 99 శాతం మంది ప్రజలు ప్రభుత్వం పట్ల సంతృప్తి చెందేలా నచ్చజెప్పాల్సిన బాధ్యత మీదే’’ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సాధికార మిత్రలకు త్వరలో ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్లు అందజేస్తుందని, ఫోన్ బిల్లులు సైతం చెల్లిస్తుందని చెప్పారు. ఫోన్‌లోని ప్రత్యేక యాప్‌లో ప్రభుత్వ పథకాల వివరాలుంటాయని, సాధికార మిత్రలు ఆ వివరాలను ఇంటింటికీ వెళ్లి తెలియజేయాలని, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. కేటాయించిన 35 కుటుంబాలకు సాధికార మిత్రలు తోడ్పాటు అందిస్తే, సాధికార మిత్రలకు అండగా నిలిచే బాధ్యత తనదేనని చంద్రబాబు వెల్లడించారు.
రైతులకు రెట్టింపు ఆదాయం అందేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలే చెబుతోందని.. కానీ, రెండింతల ఆదాయం ఎలా పెంచాలన్నది రాష్ట్రంలో మనం చేసి చూపించామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లు ఖర్చు పెట్టి, మహిళలకు తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్స్ అందజేస్తోందని తెలిపారు. ఈ ప్యాడ్స్‌కు ‘రక్ష’ పేరు ఖరారు చేస్తున్నామన్నారు.
కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తాం
ఏటా జూన్ 1వ తేదీనే కృష్ణాడెల్టాకు నీరు విడుదల చేసి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబుఅన్నారు. ప్రకాశం బ్యారేజీ కింద ఉన్న తూర్పు కాలువపై కొత్తగా నిర్మించిన రెగ్యులేటరీ ద్వారా కృష్ణా డెల్టాకు సీఎం బుధవారం నీరు విడుదల చేశారు. కృష్ణా కాలువలో గంగపూజ నిర్వహించిన అనంతరం కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. రోజుకు వెయ్యి క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి తరలిస్తారు. సీఎం మాట్లాడుతూ గతేడాది కంటే వారం ముందే కాలువలకు నీరు విడుదల చేశామని తెలిపారు.
తద్వారా కృష్ణా తూర్పు డెల్టాలో 7.36లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. 160 ఏళ్లలో మొదటిసారిగా ఈ ఏడాది కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ నుంచి జీరో అవుట్ ఫ్లో ఉందన్నారు. వర్షాభావ పరిస్థితులు, కృష్ణానదిపై ఎగువ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా గడిచిన 15ఏళ్లలో కృష్ణా డెల్టాలో అదను తప్పి సాగు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని పట్టిసీమ నిర్మాణం, కృష్ణా–గోదావరి నదుల అనుసంధానం ద్వారా ఈ సమస్య అధిగమించామన్నారు. భూగర్భ జలాలు పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment