సాక్షి, అమరావతి : గుంటూరు చానల్ ఆధునికీకరణ పనులు కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్‌కు దక్కవని నిర్ధారణకు వచ్చిన ముఖ్య నేత.. జలవనరుల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి టెక్నికల్ బిడ్ స్థాయిలోనే టెండర్‌ను ఈ నెల 7న రద్దు చేయించారు. తాజాగా అంచనా వ్యయాన్ని మరింతగా పెంచేయించి, ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలను మార్చేసి టెండర్ నోటిఫికేషన్ ఇప్పించారు. ఫిబ్రవరి 4న టెక్నికల్ బిడ్, 8న ప్రైస్ బిడ్ తెరిచి టెండర్లు ఖరారు చేసి అనుకూల కాంట్రాక్టర్‌కు కట్టబెట్టనున్నారు. ఆ వెంటనే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి కమీషన్‌గా రూ.100 కోట్లు వసూలు చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు చానల్‌కు నాలుగు టీఎంసీలు కేటాయించారు. బ్యారేజీ ఎగువన ప్రారంభమయ్యే ఈ కాలువ 47 కి.మీ.ల పొడవున తవ్వారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, చేబ్రోలు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల్లో 28,500 ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. అలాగే గుంటూరు కార్పొరేషన్, మంగళగిరి మున్సిపాల్టీలకు మంచినీటితోపాటు కాలువ పరిసర 27 గ్రామాలకు తాగునీటి కోసం 32 చెరువులకు దీని ద్వారానే నీటిని సరఫరా చేస్తారు. 600 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో తవ్విన ఈ కాలువ పాడైపోయింది. దీంతో కాలువను విస్తరించి లైనింగ్ చేయడంతోపాటూ సుద్దపల్లి మేజర్, కోవెలమూడి మేజర్ డిస్ట్రిబ్యూటరీలను ఆధునికీకరించేందుకు కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనలపై సర్కార్ 2015, మే 27న ఆమోదముద్ర వేసింది. ఆధునికీకరణ పనులకు రూ.378.25 కోట్లను మంజూరు చేస్తూ మే 27, 2015న ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
మూడున్నరేళ్ల తర్వాత టెండరా?
ఐదేళ్లుగా గుంటూరు చానల్ కింద ఆయకట్టుకు సర్కార్ సక్రమంగా నీళ్లందించిన దాఖలాలు లేవు. ఏటా పంటలు ఎండిపోవడం వల్ల రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. గుంటూరు చానల్‌ను ఆధునికీకరించడానికి నిధులు మంజూరు చేసిన మూడున్నరేళ్ల తర్వాత టెండర్ పిలవడానికి సర్కార్ సిద్ధమైంది. ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందిస్తామని రైతులను మభ్యపెట్టడం, ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించి భారీ ఎత్తున కమీషన్ దండుకోవడమే లక్ష్యంగా ఆ పనులు చేపట్టింది. 750 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ విస్తరణ.. ఆధునికీకరణ పనులకు కి.మీ.కు గరిష్టంగా రూ.3 కోట్లకు మించి వ్యయం కాదని ఇంజనీరింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. 47 కి.మీ. కాలువ విస్తరణ, లైనింగ్ పనులకు రూ.141 కోట్లు ఖర్చవుతుంది. కాలువపై 172 సిమెంటు కట్టడాల (అండర్ టన్నెల్స్, సూపర్‌పాసేజ్‌లు, బ్రిడ్జిలు)ను తొలగించి.. కొత్తగా నిర్మించడానికి రూ.88 కోట్లు వ్యయమవుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈ లెక్కన గుంటూరు చానల్ ఆధునికీకరణ పనులకు రూ.229 కోట్లకు మించి వ్యయం కాదు. కానీ అంచనా వ్యయాన్ని రూ.330 కోట్లకు పెంచేసి డిసెంబర్ 17న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 31న టెక్నికల్ బిడ్.. జనవరి 4న ప్రైస్ బిడ్ ఖరారు చేయాలని నిర్ణయించారు. ఆరుగురు కాంట్రాక్టర్లు బిడ్‌లు దాఖలు చేశారు. అయితే ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు దక్కవనే నెపంతో సాంకేతిక బిడ్ తెరవకుండానే ముఖ్య నేత టెండర్‌ను రద్దు చేయించారు.
కాంట్రాక్టర్‌కు అనుకూలంగా నిబంధనలు
తాజాగా అంచనా వ్యయాన్ని రూ.332 కోట్లకు పెంచేసి.. 24 నెలల్లో పనులు పూర్తి చేయాలనే నిబంధన పెట్టి ఈ నెల 19న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో పదేళ్లలో కనీసం ఒక్క ఏడాదైనా 7.70 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి, 1,33,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేసి ఉండాలని నిబంధన పెడితే.. తాజాగా కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్‌కు అనుకూలంగా మట్టి పనుల పరిమాణాన్ని 3 లక్షల క్యూబిక్ మీటర్లకు, కాంక్రీట్ పనుల పరిమాణాన్ని 1.31 లక్షలకు తగ్గించారు. పదేళ్లలో ఒక్క ఏడాదైనా కనీసం రూ.83 కోట్ల విలువైన ఇదే రకమైన పనులు పూర్తి చేసి ఉండాలని మరో నిబంధన పెట్టారు. గత ఐదేళ్లలో సీడీఆర్ (కార్పొరేట్ డెట్ రీకన్‌స్ట్రక్షన్), బీఐఎఫ్‌ఆర్ (బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్), ఎస్‌డీఆర్ (స్టాటజిక్ డెట్ రీకన్‌స్ట్రక్షన్) విధానాలు అమలు చేయని కాంట్రాక్టర్లే అర్హులని నిబంధనలు విధించారు. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో సిమెంటు లైనింగ్ చేసిన కాంట్రాక్టర్లే షెడ్యూలు దాఖలు చేయడానికి అర్హులని షరతు విధించారు. ఇతరులు ఎవరైనా టెండర్లు దాఖలు చేస్తే.. టెక్నికల్ బిడ్‌లో అనర్హత వేటు వేయించి, కమీషన్‌లు ఇచ్చే కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంలో రూ.వంద కోట్లకుపైగా అక్రమాలు చోటుచేసుకున్నాయని అధికార వర్గాలు చెబుతుండటం గమనార్హం.
‘గుంటూరు చానల్’లోనూ కమీషన్ల కక్కుర్తి
Published Thu, Jan 31 2019 9:12 AM | Last Updated on Thu, Jan 31 2019 9:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment