సాక్షి, హైదరాబాద్: కృష్ణా డెల్టాకు నీరు పారాలంటే మహబూబ్‌నగర్ జిల్లాలో పొలాలెండిపోవాలి. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల గొంతు తడవాలంటేనేమో డెల్టా ఆయకట్టు ఎండిపోవాల్సిందే. రాష్ట్ర విభజన ప్రక్రియతో తెరపైకి రానున్న అనేకానేక చిక్కుముడుల్లో ఇదొకటి. నీటి పంపకాలకు సంబంధించి కృష్ణా, గుంటూరు, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య ప్రత్యేక సమస్య ఉత్పన్నం కానుంది. సమైక్య రాష్ట్రంలో చేసుకున్న పరస్పర నీటి సర్దుబాటు విభజన తర్వాత చెల్లుబాటయ్యే పరిస్థితి కన్పించడం లేదు. అంతేగాక నిత్య కరువుతో ఇబ్బంది పడే మహబూబ్‌నగర్ జిల్లాలోని బీమా ప్రాజెక్టుకు నికర జలాల కేటాయింపు నిర్ణయం కూడా అమలయ్యే పరిస్థితి కన్పించడం లేదు.
ఇదీ ప్రతిపాదన: మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల ఎగువన బీమా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు కోసం 20 టీఎంసీల నీరు అవసరం. కానీ కృష్ణా నదిలో మన రాష్ట్రానికి కేటాయించిన మొత్తం 811 టీఎంసీల నికర జలాలనూ ఉపయోగించుకునేందుకు ఇప్పటికే ప్రాజెక్టులున్నాయి. కాబట్టి కొత్త ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే పరిస్థితి లేదు.
దాంతో బీమా ప్రాజెక్టు నిర్మాణం కష్టమవుతుందనే ఉద్దేశంతో కృష్ణా డెల్టా ఆయకట్టుకు చెందిన నీటిని దానికి కేటాయించారు. 13 లక్షల ఎకరాల ఆయక ట్టున్న కృష్ణా డెల్టా పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలున్నాయి. అయితే వీటిలో అత్యధిక ఆయకట్టు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఉంది. బచావత్ అవార్డు ప్రకారం కృష్ణా డెల్టాకు 181 టీఎంసీలు కేటాయించారు. అయితే డెల్టా ఆధునీకరణ ద్వారా సుమారు 29 టీఎంసీల నీటిని ఆదా చేయవచ్చనే భావనతో, అందులో సుమారు 9 టీఎంసీలను పులిచింతల ప్రాజెక్టుకు, మిగతా 20 టీఎంసీలను బీమాకు ఉపయోగించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సమ్మతించింది. అలా బీమా ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి లభించింది. ప్రస్తుతం కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ వరద నీటిపైనే ఆధారపడ్డవి కాగా ఒక్క బీమాకు మాత్రమే నికర జల కేటాయింపు ఉంది. కానీ రాష్ట్ర విభజన జరిగితే దానికి కూడా నికర జలాలు అందే పరిస్థితి కనిపించడం లేదు.
ఇదీ సమస్య: సుమారు రూ. 4,573 కోట్ల అంచనాతో ఐదేళ్ల క్రితం మొదలు పెట్టిన కృష్ణా డెల్టా ఆధునీకరణ పనులు ఇప్పటికీ 17 శాతం పనులే పూర్తయ్యాయి. 683 కిలోమీటర్ల మేర కాల్వలు, 1,034 కిలోమీటర్ల మేర ఉన్న డ్రెయిన్ల ఆధునీకరణ వంటి పనులు జరగాల్సి ఉంది. కానీ మొత్తం 84 ప్యాకేజీల పనులకు గాను ఇప్పటికి 54 ప్యాకేజీలకే టెండర్లు ఖరారయ్యాయి. ఆధునీకరణ పనులు పూర్తయ్యే దాకా 29 టీఎంసీల నీటి ఆదా సాధ్యం కాదు. మరోవైపు కృష్ణా డెల్టాకు కేటాయించిన 181 టీఎంసీల కంటే ఇప్పటికే మరో 50 టీఎంసీలను అదనంగా వాడుతున్నారు. ఎగువ నుంచి వచ్చే వరద నీటినీ ఉపయోగిస్తున్నారు. అంటే రాష్ట్ర విభజన తర్వాత బీమాకు కేటాయించిన 20 టీఎంసీలతో పాటు అదనంగా ఉపయోగిస్తున్న 50 టీఎంసీలను కూడా కృష్ణా డెల్టా కోల్పోవాల్సి ఉంటుంది. మరో పక్క బీమా ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే కొన్ని పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు.
అంటే ఒకపక్క డెల్టా ఆధునీకరణ పనులు సాగక ఆశించిన మేరకు నీటి పొదుపు జరగడం లేదు. మరోవైపు బీమా ప్రాజెక్టు నీటి వినియోగం మొదలైతే కృష్ణా డెల్టాకు నీటికొరత తప్పేలా లేదు. దానికి నీరిచ్చేందుకు డెల్టా రైతులు అంగీకరించకపోతే బీమా పరిధిలో పాలమూరులో సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరి కానున్నాయి. సమైక్య రాష్ట్రంలోనైతే ఇరు ప్రాంతాల వారికి నచ్చజెప్పడం ద్వారా, లేక మరో ప్రాజెక్టు నుంచి నీరివ్వడం ద్వారా వారికి న్యాయం చేసే అవకాశముండేది. విభజన జరిగితే రెండు ప్రాంతాలకు నీటి కేటాయింపు ఇబ్బందికరమేనని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు.
జిల్లాల మధ్య జల వైరం
Published Sun, Aug 25 2013 5:25 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement