* కేటాయింపులు, వాడకంపై ముగిసిన అధికారుల కసరత్తు
* కేంద్రానికి ప్రత్యేక నివేదిక సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలోని ఏ ప్రాంతానికి ఎంతెంత నీటి కేటాయింపులు ఉన్నాయనే విషయంలో అధికారులు సాగించిన కసరత్తు పూర్తయింది. ప్రాంతాల వారీగా నీటి కేటాయింపులు, వాడకంపై గత వారం రోజులుగా అధికారులు రూపొందిస్తున్న నివేదిక తుది రూపం దాల్చింది. ఈ నివేదికను కేంద్రానికి పంపించనున్నారు. బచావత్ అవార్డు ప్రకారం చేసిన కేటాయింపులనే నివేదికలో ప్రధానంగా ప్రస్తావించారు.
ప్రాంతాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, వరద నీటిపై ఆధారపడిన ప్రాజెక్టుల వివరాలను పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టుల వివరాలు, వాటికి కావాల్సిన నీటి కేటాయింపుల వంటి సమాచారాన్ని పొందుపరిచారు. కృష్ణానదిలో రాష్ట్రానికి మొత్తం 811 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నట్టు తెలిపారు.
ఇందులో ఆంధ్ర ప్రాంతానికి 367.34 టీఎంసీలు, రాయలసీమకు 144.70 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేటాయించినట్టు పేర్కొన్నారు. అలాగే మిగులు జలాలపై ఆధారపడిన నెట్టెంపాడు, కల్వకుర్తి, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, వెలిగొండ, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టులను కూడా ప్రస్తావించారు. కృష్ణా డెల్టాకు 181 టీఎంసీల నీటి కేటాయింపు ఉండగా, ఇప్పటివరకు వాడకం ఎక్కువగా ఉన్నట్టు వివరించారు.
అయితే డెల్టా ఆధునీకరణ వల్ల పొదుపయ్యే నీటిలో 20 టీఎంసీలను మహబూబ్‌నగర్‌లోని బీమాకు, మరో 9 టీఎంసీలను సాగర్ దిగువన నిర్మిస్తున్న పులిచింతలకు కేటాయించినట్టు తెలిపారు. వర్షాలు ఎక్కువగా కురిసి వరదనీరు వచ్చిన సమయంలో డెల్టా ఆయకట్టులో రెండవ పంటను సాగు చేస్తున్నట్టు నివేదికలో పొందుపరిచారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు 280 టీఎంసీల కేటాయింపు ఉన్నట్టు పేర్కొన్నారు.
ఇవిగో సాగునీటి లెక్కలు!
Published Sat, Oct 19 2013 4:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
Advertisement
Advertisement