ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ‘యాస’ల ట్రెండ్ నడుస్తోంది. పాత్రలకు తగ్గట్టు స్టార్స్ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల యాసలు పలకడానికి ‘యస్’ చెబుతున్నారు. ఏ యాసకి ఆ యాస ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించడానికి ఉపయోగపడుతోంది. అందుకే ‘యాసలందు అన్ని యాసలూ లెస్స’ అని చెప్పాలి. ప్రస్తుతం ‘పుష్ప 2, హరోం హర’తో పాటు విశ్వక్ సేన్ చిత్రం, అనన్య నాగళ్ల మూవీ వంటి పలు సినిమాలు ఆయా ప్రాంత యాసల నేపథ్యంలో రూపొందుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేద్దాం.
పుష్పగాడి రూలు
‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’... ‘తగ్గేదే లే’ అంటూ ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో హీరో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయిందో చెప్పక్కర్లేదు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయింది. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ సహా దాదాపు అన్ని పాత్రలు రాయలసీమలోని చిత్తూరు యాసలో మాట్లాడతాయి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప 2: ది రూల్’ కూడా చిత్తూరు యాసలో రూపొందుతోంది. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇక ‘అడవిలో జంతువులు రెండడుగులు ఎనక్కి ఏసినాయంటే పులి వచ్చుండాదని అర్థం.. అదే పులి రెండడుగులు ఎనక్కి ఏసినాదంటే పుష్ప వచ్చుండాడని అర్థం’, ‘పుష్పగాడి రూలు’ వంటి డైలాగులు ‘పుష్ప 2: ది రూల్’ గ్లింప్స్‌లో ఉన్నాయి.
ఇంగ సెప్పేదేం లేదు.. సేసేదే
సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన 1989 నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్‌లో ‘సుబ్రహ్మణ్యం అన్న.. జనాలు నీ కోసం సూస్తా ఉండారు.. అట్లా కదలకుండా ఉంటే ఎట్లా.. ఏందోకటి సెప్పు’, ‘ఇంగ సెప్పేదేం లేదు.. సేసేదే’ వంటి చిత్తూరు యాస డైలాగులు వినిపించాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది
బ్లాక్.. వైట్ ఉండదు..
‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో బ్లాక్ ఉండదు, వైట్ ఉండదు, గ్రే మాత్రమే ఉంటుంది’ అంటూ ‘వీఎస్ 11’ (వర్కింగ్ టైటిల్) చిత్రం వీడియో రిలీజ్ అయింది. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడిక్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో విశ్వక్ సేన్ గోదావరి యాసలో మాట్లాడతారు.
శ్రీకాకుళం యాసతో...
అనన్య నాగళ్ల, రవి మహాదాస్యం జంటగా ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో రాజా రామ్మోహన్ చల్లా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. బేబీ లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కథాంశం శ్రీకాకుళం యాస నేపథ్యంలో సాగుతుంది.
నెల్లూరి నెరజాణ
డైరెక్టర్ నాగ్ అశ్విన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన చిగురుపాటి సుబ్రమణ్యం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నెల్లూరి నెరజాణ’. ఎంఎస్ చంద్ర, హరి హీరోలుగా, అక్షా ఖాన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం పక్కా నెల్లూరు యాసలో రూపొందినట్లు చిగురుపాటి సుబ్రమణ్యం తెలిపారు.
ఇవే కాదు.. మరికొన్ని చిత్రాల్లో కూడా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ యాస వినిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment