సాక్షి, అమరావతి: గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలిదశ పనులకు సంబంధించి ప్రభుత్వ పెద్దలు నిబంధనలను తుంగలో తొక్కి ఆగమేఘాలపై పరిపాలనా అనుమతులు ఇవ్వడంపై జలవనరుల శాఖ అధికారులు నివ్వెరపోతున్నారు. వ్యాప్కోస్ డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) ఆధారంగా కృష్ణా డెల్టా సీఈ రూపొందించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను జలవనరుల శాఖ ఈఎన్‌సీ(ఇంజనీర్–ఇన్–చీఫ్)కి పంపకుండానే పని పూర్తి చేశారు. ఆర్థిక శాఖ అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసి రూ.6,020.15 కోట్లతో ఈనెల 13న ఉత్తర్వులు జారీ చేయించటం గమనార్హం. పథకం ప్రతిపాదన దశలోనే అంచనా వ్యయాన్ని రూ.1,403.15 కోట్లు పెంచడంతోపాటు ఒకే ప్యాకేజీ కింద బడా కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం, మొబిలైజేషన్ అడ్వాన్సుగా ఇచ్చే రూ.500 కోట్లను కమీషన్‌ల రూపంలో వసూలు చేసుకోవడం ఇందులో అసలు వ్యూహం.
నిబంధనలకు నీళ్లు..
గోదావరి–పెన్నా అనుసంధానంపై తొలుత వ్యాప్కోస్ రూపొందించిన నివేదికను పక్కనపెట్టిన సీఎం చంద్రబాబు నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించడంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ పనులను తొలి దశ కింద చేపట్టాలని నిర్ణయించారు. గత ఫిబ్రవరి 5న చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.4,617 కోట్లుగా జలవనరుల శాఖ ప్రతిపాదించింది. ఇది మరింత పెంచాలని ఒత్తిడి తెచ్చినా కీలక అధికారి ఒకరు అంగీకరించలేదు. అయితే అనంతరం ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.6,212.08 కోట్లకు పెంచుతూ గత ఏప్రిల్ 28న కృష్ణా డెల్టా సీఈ ద్వారా జలవనరులశాఖకు ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదనలు తెప్పించారు. కనీసం హైడ్రలాజికల్ క్లియరెన్స్ తీసుకోకుండానే వీటిని రూపొందించడం గమనార్హం. నిబంధనల ప్రకారం వీటిని ఈఎన్‌సీకి పంపాలి. అక్కడ ఆమోదించాక ఐబీఎం కమిటీకి పంపాలి. కానీ అటు ఈఎన్‌సీకిగానీ ఇటు ఐబీఎం కమిటీకిగానీ ప్రతిపాదనలు పంపలేదు. వ్యయం భారీగా పెంచేసిన నేపథ్యంలో వీటిని ఈఎన్‌సీ, ఐబీఎం తిరస్కరిస్తాయనే నేరుగా జలవనరుల శాఖ కార్యదర్శికి పంపేలా ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
తిప్పి పంపిన ఆర్థిక శాఖ
కృష్ణా డెల్టా సీఈ రూ.6,212.08 కోట్లతో పంపిన ప్రతిపాదనలను జలవనరులశాఖ రూ.6,020.15 కోట్లకు కుదించింది. అనంతరం వీటిని పరిశీలించిన ఆర్థిక శాఖ క్షేత్ర స్థాయిలో చేపట్టే పనులకు, అంచనా వ్యయానికి భారీ వ్యత్యాసం ఉండటంపై ఆశ్చర్యపోయింది. అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించింది. పాత కాంట్రాక్టర్లను 60 సీ నిబంధన కింద తొలగించడం, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి కొత్తవారికి అప్పగించడాన్ని పరోక్షంగా తప్పుబట్టింది. కావాలంటే సర్వే, భూసేకరణకు మాత్రం అనుమతి ఇస్తామంటూ ప్రతిపాదనలను వెనక్కి పంపింది.
కేబినెట్‌లో చర్చించకుండానే..
బడ్జెట్‌లో నిధులు కేటాయించని కొత్త పథకాలు ఏవైనా చేపట్టాలంటే కేబినెట్ అనుమతి తప్పనిసరి. కానీ కేబినెట్‌లో చర్చికుండానే గోదావరి–పెన్నా తొలిదశ అంచనా వ్యయం పెంపు ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఈనెల 6వ తేదీన ఆమోదముద్ర వేశారు. నిధులు సమకూర్చాలంటూ ఆర్థిక శాఖను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.రెండు వేల కోట్లకు మించి నిధులు సర్దుబాటు చేయలేమని ఆర్థికశాఖ మరోసారి స్పష్టం చేసినా దీన్ని బేఖాతర్ చేస్తూ రూ.6,020.15 కోట్లతో గోదావరి–పెన్నా తొలిదశకు జలవనరుల శాఖ ద్వారా సీఎం చంద్రబాబు పరిపాలన అనుమతి ఉత్తర్వులు జారీ చేయించారు.
టెండర్లకు ముందే బేరం...!
గోదావరి–పెన్నా తొలిదశ పనుల్లో ఒక్కో పంప్ ద్వారా 1,750 క్యూసెక్కుల చొప్పున నాలుగు పంప్‌ల ద్వారా ఏడు వేల క్యూసెక్కులను వైకుంఠపురం నుంచి ఐదు దశల్లో ఎత్తిపోయాలి. నాగార్జునసాగర్ కుడి కాలువకు గోదావరి జలాలను తరలించేందుకు ఐదు చోట్ల పంప్ హౌస్‌లు, 10.09 కి.మీ. పొడవు ప్రెజర్ మైన్, 56.5 కి.మీ. పొడవున కాలువ తవ్వాలి. భూసేకరణకు రూ.676.25 కోట్లు, పనులకు 4,588.63 కోట్లు, క్రాస్ డ్రైనేజ్ పనులకు రూ.86.12 కోట్లు, బ్రిడ్జిలకు రూ.106.72 కోట్లను కేటాయించారు.
ఈ పనుల్లో పంప్ హౌస్, కాలువ పనులు అంటే రూ.4,588.63 కోట్ల విలువైన పనులకు ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలవాలంటూ జలవనరులశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఇటీవల నామినేషన్ పద్ధతిలో భారీ ఎత్తున పనులు కట్టబెట్టిన సంస్థకే దక్కేలా గోదావరి–పెన్నా తొలి దశ పనులకు టెండర్లు పిలవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. టెండర్లు ఖరారైన వెంటనే మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో సర్కార్ ఇచ్చే రూ.500 కోట్లను తొలి విడత కమీషన్ కింద, బిల్లులు చెల్లించేటపుడు మలి విడతగా మరో రూ.600 కోట్లకుపైగా కమీషన్ ఇచ్చేలా కాంట్రాక్టు సంస్థతో ప్రభుత్వ పెద్దలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment