⇒ పోలవరం ప్రాజెక్టుతో 4.368 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుంది
⇒ 540 గ్రామాలకు తాగునీరు ఇవ్వొచ్చు
⇒ ఏటా 2,369.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది
⇒ ప్రజెక్టుకు పెద్దయెత్తున నీటి స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది
⇒ పట్టిసీమ వద్ద కానీ, కుడికాల్వలో కానీ నీటిని నిల్వ చేయడానికి అవకాశం లేదు
సాక్షి, హైదరాబాద్: పోలవరం ఎన్నో దశాబ్దాల కల. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు రావడానికి ఎంతోకాలం పట్టింది. ఎట్టకేలకు అనుమతులు వచ్చాయి. జాతీయ హోదా కూడా వచ్చింది. ఈ సమయంలో ప్రాజెక్టు శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ దిశగా కృషి చేయకుండా పట్టిసీమ ఎత్తిపోతలను తెరపైకి తెచ్చింది.
పట్టిసీమను ‘వట్టి’సీమగా పేర్కొంటూ.. టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ వ్యతిరేకిస్తున్నా.. ఆ విధంగానే ముందుకు వెళతామంటోంది. 22 శాతం అధిక ధరతో ఎత్తిపోతలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు వరప్రదాయని? పట్టిసీమను ‘వట్టి’సీమని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఎందుకంటున్నాయి... ఒకసారి పరిశీలిస్తే.. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నం జిల్లా మొదలు రాయలసీమ వరకు.. పలు జిల్లాలకు తాగు, సాగు నీటితో పాటు పారిశ్రామిక అవసరాలకూ నీళ్లివ్వడానికి అవకాశం ఉంటుంది.
పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లివ్వవచ్చు. ఆమేరకు డెల్టా వాడకంలో మిగిలే నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమ అవసరాలకు వినియోగించుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం ఉంటుంది కాబట్టి, అవసరమైనప్పుడు, అవసరమైన మేరకు కుడికాల్వకు నీటి విడుదల చేస్తారు. కాబట్టి.. ఏడాది పొడవునా ఎప్పుడు అవసరమైతే అప్పుడు కుడికాలువ ద్వారా నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేయడానికి వీలవుతుంది. అంటే.. పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తప్పనిసరిగా నీరివ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా శ్రీశైలం ఎగువ నుంచి నమ్మకంగా రాయలసీమకు నీళ్లివ్వడానికి వీలవుతుంది.
గోదావరి నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని కుడికాలువకు మళ్లిస్తే.. కృష్ణా డెల్టాకు వస్తాయి. అయితే గోదావరిలో వరద ఏడాదిలో 60 రోజులకు అటూఇటూగా ఉంటుంది. మిగతా రోజుల్లో నీటిని కృష్ణాకు తరలించడం సాధ్యం కాదు. గోదావరిలో వరద ఉండే సమయంలోనే కృష్ణానదిలోనూ వరదలు ఉండే అవకాశం ఉంది. కృష్ణాలో ఏటా దాదాపు 40 రోజులు వరద ఉంటుంది. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా డెల్టా, రాయలసీమ.. అన్ని ప్రాంతాల్లోనూ పట్టిసీమపై అనుమానాలున్నాయి.
తమ నీటిని కృష్ణాకు తరలిస్తారమోననే అనుమానం ఉభయ గోదావరి జిల్లాల రైతులను వేధిస్తుండగా, గోదావరి నుంచి నీళ్లిస్తున్నామనే పేరిట నాగార్జున సాగర్ నుంచి తమకు రావాల్సిన నీళ్లు నిలిపివేసే ప్రమాదం ఉందన్న ఆందోళన కృష్ణా డెల్టా రైతుల్లో నెలకొంది. గోదావరి మీద ఎత్తిపోతల పథకాన్ని నమ్ముకొని, సాగర్ నుంచి వచ్చే నీటిపై హక్కును వదులుకోవడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు.
గోదావరి పొంగి ప్రవహిస్తున్నప్పుడు, పుష్కలంగా విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడే లిఫ్ట్ ద్వారా గోదావరి నీరు కృష్ణా డెల్టాకు చేరుతుందని, పరిస్థితుల్లో తేడా వస్తే నీరందని పరిస్థితులు వస్తాయని, అదే జరిగితే తమ పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాంతానికీ ఉపయోగపడని పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని హడావుడిగా తెరపైకి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని నీటిపారుదల శాఖ ఇంజనీర్లే విమర్శిస్తున్నారు. ఏ ప్రాంతానికీ ఉపయోగపడకపోగా, కృష్ణా జలాల్లోనూ 35 టీఎంసీల వాటా కోల్పోయే ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటున్నామని, ఫలితంగా అన్ని ప్రాంతాలకు నష్టం జరుగుతుందని విశ్లేషిస్తున్నారు.
కుడికాల్వను ముందే ఎందుకు తవ్వారంటే..
సీడబ్ల్యూసీ అనుమతి మంజూరైన మరుక్షణం కృష్ణా జలాల్లో 35 టీఎంసీల నీటిని వాడుకొనే స్వేచ్ఛ ఎగువ రాష్ట్రాలు దక్కుతుందనే నిబంధన దృష్ట్యా.. అనుమతి వచ్చిన వెంటనే పనులు ముమ్మరం చేసి ఆఘమేఘాల మీద పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి. లేదంటే కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రాలు 35 టీఎంసీలు వాడుకుంటే.. ఏపీ తీవ్రంగా నష్టపోతుంది.
అందుకే ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకముందే కుడికాల్వ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి భావించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం కాంట్రాక్టు అవార్డు చేయడంలో చూపిస్తున్న వేగం, కుడికాలువ పనుల్లో అసంపూర్తిగా ఉన్న 30 శాతం పనులను పూర్తి చేయడంపై చూపించడం లేదు. పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా దక్కిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం పనులు వేగవంతం చేసి నిర్మాణాన్ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారు?
గోదావరి నుంచి పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 80 టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాకు మళ్లించి, ఆ మేరకు మిగిలే నీటిని శ్రీశైలం ఎగువ నుంచి రాయలసీమ అవసరాలకు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న వాదనలో వాస్తవం లేదని ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. పట్టిసీమ లిఫ్ట్ నిర్మాణానికి రూ.1,300 కోట్ల అంచనా వ్యయానికి పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఈ ఏడాది జనవరి ఒకటిన జారీ చేసిన జీవో నంబర్ 1.. ముఖ్యమంత్రి వాదనలో డొల్లతనాన్ని వెల్లడించింది.
జీవోలోని 5వ పాయింట్‌లో ‘డొమెస్టిక్, ఇండస్ట్రియల్ అవసరాల కోసం గోదావరి నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణాకు నీటిని మళ్లించే పనులకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది’ అని పేర్కొన్నారు. కృష్ణా డెల్టాకు నీళ్లిస్తామని ఈ జీవోలో ఎక్కడా చెప్పలేదు. కృష్ణా డెల్టాకు నీటిని మళ్లిస్తామని జీవోలో చెప్పని ప్రభుత్వం, డెల్టాలో వాడుకొనే కృష్ణా జలాలను శ్రీశైలం ద్వారా రాయలసీమకు ఇస్తామని చెప్పడాన్ని ఎలా నమ్మాలని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఇటు సీమకు, అటు కృష్ణా డెల్టాకు నష్టం!
గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల నీటిలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు 35 టీఎంసీల వాటా ఉంటుంది. కుడికాల్వకు నీళ్లు ఎప్పుడు మళ్లిస్తారనే విషయంతో సంబంధం లేకుండా, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి మంజూరు చేసిన మరుక్షణం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో ఉన్న వాటా నుంచి 35 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలు ఉపయోగించుకోవడానికి హక్కు ఉంటుందని గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో పేర్కొంది.
వాస్తవంగా కుడికాల్వకు నీటిని ఎప్పుడు మళ్లిస్తారనే విషయంతో సంబంధం లేకుండా, పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఎగువ రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న వాటా నుంచి 35 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలు వినియోగించుకొనే స్వేచ్ఛ ఉంటుంది. పోలవరం నుంచి నమ్మకంగా జలాలు రాకుండా, ఎత్తిపోతల పథకాన్ని సాకుగా చూపి ఎగువ రాష్ట్రాలు కృష్ణా జలాల్లో అధిక వినియోగానికి పాల్పడితే.. ఇటు రాయలసీమకు, అటు కృష్ణా డెల్టాకు తీరని నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకు ‘వట్టి’సీమ అంటే...
⇒ పట్టిసీమ వద్ద, కుడికాల్వకు మళ్లించిన తర్వాత ఎక్కడా నీటిని నిల్వ చేయడానికి అవకాశం లేదు
⇒ గోదావరి, కృష్ణాకు ఒకేసారి వరద వచ్చే రోజులు ఎక్కువ. కృష్ణాలో వరద ఉంటే లిఫ్ట్ అనవసరం
⇒ రెండు నదులు జీవ నదులు కాదు. రుతుపవనాల సమయంలోనే పోటెత్తి ప్రవహిస్తాయి
⇒ ఏడాదిలో గోదావరికి 60 రోజులు, కృష్ణాకు 40 రోజుల వరద ఉంటుంది
⇒ వరద లేని రోజుల్లో లిఫ్ట్ వాడితే గోదావరి డెల్టాకు నీళ్లందవు
⇒ కృష్ణలో నీళ్లు లేక డెల్టా రైతులు ఇబ్బంది పడితే.. కచ్చితంగా గోదావరి నీళ్లిస్తామని చెప్పడానికి లేదు
⇒ ఆ సమయంలో గోదావరిలో వరద ఉండి, పుష్కలంగా విద్యుత్ అందుబాటులో ఉంటేనే.. లిఫ్ట్ వాడగలరు
⇒ కృష్ణా డెల్టాకు నమ్మకంగా నీళ్లిస్తామనే గ్యారంటీ లేకుండా, రాయలసీమకు నీళ్లివ్వడం సాధ్యం కాదు
⇒ సీమకు నీళ్లిస్తామని పట్టిసీమ జీవోలో ప్రభుత్వం పేర్కొనలేదు
⇒ నమ్మకం లేని నీటి కోసం లిఫ్ట్ నిర్మాణానికి రూ.1300 కోట్లు ఖర్చు పెట్టాలి
⇒ పోలవరం మీద దృష్టి పెట్టకుండా పట్టిసీమను పట్టుకొని వేలాడితే.. రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది
⇒ కుడికాల్వకు మళ్లించే నీటి మీద ఎగువ రాష్ట్రాలు హక్కు కోరితే.. రాష్ట్ర ప్రయోజనాలకు గండి
పోల‘వరం’ ఎందుకంటే...
⇒ పోలవరం ప్రాజెక్టులో స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది
⇒ ఎప్పుడు అవసరమైనా నీటిని కుడికాల్వ ద్వారా కృష్ణా డెల్టాకు ఇవ్వచ్చు... పైసా ఖర్చు లేకుండా.. గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి కృష్ణాకు నీళ్లు చేరతాయి
⇒ గోదావరిలో వరద లేనప్పుడు కూడా, నిల్వ సామర్థ్యం ఉంటుంది కాబట్టి కృష్ణాడెల్టాకు నీటి గ్యారంటీ ఉంటుంది
⇒ కృష్ణా డెల్టాలో మిగిలే వాడకాన్ని, శ్రీశైలం నుంచి రాయలసీమకు ఇవ్వచ్చు
⇒ కుడికాల్వకు 80 టీఎంసీల గ్యారంటీ ఉంటుంది కాబట్టి.. ఎగువ రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో వాటా ఇవ్వచ్చు
⇒ గోదావరి డెల్టాకు ఎలాంటి అన్యాయం జరగదు. చివరి ఆయకట్టు భూములకూ నీళ్లొస్తాయి
⇒ విశాఖపట్నానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీళ్లు అందుతాయి
⇒ ప్రాజెక్టు ప్రయోజనాలపై ఏ ప్రాంత రైతులకూ అనుమానాల్లేవు... పోలవరంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయి
⇒ అన్నిటికంటే మించి.. జాతీయ హోదా దక్కినందున ప్రజెక్టు మొత్తం వ్యయం కేంద్రమే భరిస్తుంది
⇒ రాష్ట్ర ఖజానాపై పైసా భారం పడదు
⇒ 4.368 లక్షల హెక్టార్లకు సాగునీరు, 540 గ్రామాలకు తాగునీరు అందుబాటులోకొస్తుంది.
⇒ ఏటా 2,369.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.
ఎందుకది పోల‘వరం’.. ఎందుకిది ‘వట్టి’సీమ
Published Wed, Mar 18 2015 2:16 AM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM
Advertisement
Advertisement