ఒక్క కీలక ప్రాజెక్టూ దక్కలేదు
నిట్ వచ్చినా సీట్లు ఫట్
‘పోర్టులు’ వచ్చే వరకు అనుమానమే
పట్టిసీమతో రైతుల గుండెల్లో గుబులు
పడకేసిన పోలవరంతో దిగాలు
సీఎం పర్యటనల్లో అడిగిందే తడువుగా
హామీలు తప్ప కార్యాచరణ లేదు
ఏడాదిలో లాభపడింది టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులే
ఇసుక, మట్టి, పుష్కర పనులు,
బదిలీలు.. అన్నీ పచ్చచొక్కాలకు ఆదాయ మార్గాలే
సాక్షి ప్రతినిధి, ఏలూరు:సరిగ్గా నేటితో చట్టసభల ప్రజాప్రతినిధులు ఎన్నికై ఏడాది పూర్తవుతోంది. అనూహ్యంగా జిల్లాలో అన్ని స్థానాలూ తెలుగుదేశం పార్టీనే గెలుచుకోవడం, నవ్యాంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీనే అధికారంలోకి రావడం, కేంద్రంలో టీడీపీ బలపరిచిన బీజేపీ కొలువు దీరడం.. వెరసి పశ్చిమగోదావరి జిల్లా రూపురేఖలు మారిపోతాయని అందరూ భావించారు. ఇక జిల్లాకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు వచ్చినప్పుడల్లా పశ్చిమ రుణం తీర్చుకోలేనిది.. ఈ జిల్లాకు ఎంత చేసినా తక్కువే.. సొంత జిల్లా.. చిత్తూరు కంటే కూడా ఈ జిల్లానే ఎక్కువ అంటూ పదేపదే రుణం మాటలు వల్లె వేయడంతో జిల్లా ప్రగతి అనూహ్యంగా పరుగులు తీస్తుందని ఆశించారు.
అయితే ఈ ఏడాదిలో జిల్లాకు ఇది సాధించాం... అని గర్వంగా అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి గుండెల మీద చేయివేసుకుని చెప్పే పరిస్థితి లేదు. అంతెందుకు పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రైతులే ముఖ్య కారణమని, అర్హులైన అందరికీ రుణమాఫీ వర్తింపజేస్తామని నమ్మబలికిన పాలకులు ముందు అన్నదాతనే నట్టేట ముంచారు. రుణమాఫీ జిల్లాలో సరిగ్గా 50 శాతం అమలైందని కూడా ఆ పార్టీ నేతలు ధైర్యంగా చెప్పలేని పరిస్థితే నెలకొంది. డ్వాక్రా మహిళలకు, ఉద్యాన రైతులకు, కౌలురైతులకు.. ఇలా ఎవరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ కాకపోవడంతో రైతులు, డ్వాక్రా మహిళలు ప్రైవేటు అప్పుల ఊబిలో కూరుకుపోయే దుస్థితి నెలకొంది.
సీఎం హామీలు గాలిలో.. ప్రజలు సమస్యల్లో
ఏడాది కాలంలో ఇప్పటికి ఎనిమిది సార్లు జిల్లాకు విచ్చేసిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు అడిగిందే తడువుగా హామీలు గుప్పించారు. వచ్చిన ప్రతిసారీ ఆయా
నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలను బహిరంగసభల్లో ప్రకటించి... ఇప్పటికిప్పుడే నిధుల విడుదలకు జీవో జారీ చేస్తున్నామని ప్రకటించడం రివాజుగా మారింది. కానీ ఇంతవరకు ఆయా ప్రకటనలకు సంబంధించి నయాపైసా కూడా విడుదల కాలేదు. జిల్లా ప్రగతి రూపురేఖలు మార్చే వందల రూ.కోట్ల ప్రాజెక్టులకు ఇప్పటివరకు అతీగతీ లేకున్నా స్వయానా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఇచ్చిన ప్రతిపాదనలూ అమలుకు నోచుకోకపోవడం గమనార్హం
ఎత్తిపోతలతో గోదావరి రైతుకు గుండెకోత
ఆర్నెల్లుగా జిల్లా రైతాంగానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ప్రాజెక్టు పట్టిసీమ ఎత్తిపోతల పథకం. ఉభయగోదావరి జిల్లాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళుతోంది. వర్షాకాలంలో సముద్రంలోకి వృథాగా పోయే గోదావరి జలాలను మాత్రమే కృష్ణాడెల్టాకు అక్కడి నుంచి రాయలసీమకు తీసుకువెళతామని సర్కారు చెబుతోంది. గోదావరి జిల్లాలకు నీరు ఇచ్చిన తర్వాతే మిగిలిన నీటిని తీసుకువెళతామని బాబు ప్రకటిస్తున్నా... ఇక్కడి రైతుల సందేహాలను, అనుమానాలను ఇంతవరకు ఎవరూ నివృత్తి చేయలేదు. ఎత్తిపోతలను శరవేగంగా పూర్తి చేసి ఆగస్టులోగా నీటిని మళ్లించేందుకు తీవ్రంగా కృషిచేస్తున్న ప్రభుత్వం ఇందులో ఒకటో వంతు శ్రద్ధ కూడా పోలవరంపై పెట్టడం లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాదికాలంలో కేవలం రూ.వందకోట్ల పనులే పూర్తయ్యాయి. ఇంకా రూ.12వేల కోట్ల పైచిలుకు పనులు కావాల్సి ఉందంటే ఈ లెక్కన పోలవరం నిర్మాణానికి ఎన్నేళ్లు పడుతుందో ఎవరైనా ఊహించొచ్చు.
నిట్ వచ్చినా లాభం లేదా?
అదిగో ఇదిగో అంటూ ఏడాదిగా ఊరించి ఎట్టకేలకు జిల్లా కేంద్రం ఏలూరుకు వచ్చిందనుకున్న నిట్ వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేశంలో ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) మన చెంతనే కొలువుదీరినా ఏపీ విద్యార్థులకు సీట్ల కేటాయింపు మునపటి కంటే బాగా తగ్గనుందని తేలిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్ నిట్‌లో సీమాంధ్ర జిల్లాల విద్యార్థులకు 200 సీట్లు దక్కేవి. కానీ ఇప్పుడు ఏలూరులో నిట్ ఏర్పాటు చేసినా మొత్తం 120 సీట్లనే కేటాయించారు. ఇందులో జాతీయకోటాకు 60 సీట్లు పక్కనపెడితే మొత్తం 13 జిల్లాల విద్యార్థులకు దక్కేది కేవలం 60 సీట్లు మాత్రమే. ఈ లెక్కన 140 సీట్లు నష్టపోయే పరిస్థితి నెలకొందని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు, నరసాపురంలో పోర్టు, భీమవరంలో మెరైన్ వర్శిటీ ఏర్పాటు చేస్తామంటూ ఏడాదికాలంగా సీఎం జిల్లాకు వచ్చిన ప్రతిసారీ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అవి ప్రతిపాదన దశ నుంచి కార్యరూపం దాల్చే వరకు అనుమానంగానే కనిపిస్తోందని స్వయంగా అధికార పార్టీ వర్గాలే వ్యాఖ్యానించడం గమనార్హం.
అధికారం దన్నుతో అరాచకాలు
పదేళ్లు అధికారానికి దూరంగా ఉండి అనూహ్యంగా పవర్‌లోకి వచ్చిన తెలుగుదేశం నేతల్లో కొందరు వచ్చీరాగానే ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులే లక్ష్యంగా పనిచేశారు. అధికారం అండతో ఎక్కడికక్కడ రెచ్చిపోయారు. ఇక మరికొంతమంది ఎక్కడ ఆదాయవనరులుంటే అక్కడ వాలిపోయారు. ప్రతిపనిలోనూ నాకేంటి అని లెక్కలు వేసుకుంటూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇసుక, మట్టి, పుష్కర కాంట్రాక్టు పనులు, ఉద్యోగుల బదిలీలు.. ఇలా అన్నింటినీ ఆదాయమార్గాలుగా మార్చేశారు. ఈ ఏడాది పాలనలో ఎవరికైనా లబ్ధి చేకూరిందంటే కేవలం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకే అనేది అందరికీ తెలిసిన వాస్తవం. జిల్లాలో ఏ వర్గానికీ న్యాయం జరక్కపోయినా టీడీపీ నేతలు మాత్రం అక్రమార్జనతో అడ్డగోలు వ్యవహారాలతో లాభపడ్డారనేది ఎవరూ కాదనలేని నిజం.
ఏడాది అంటే తక్కువ కాలమేమీ కాదు. ఐదేళ్లలో 20 శాతం పాలన పూర్తయినట్టే. ఏడాదేగా అయింది.. ఇంకా నాలుగేళ్లు ఉంది.. బాబుగారేం చేస్తారో చూడాలి.. అనే దశలోనే ఉన్న టీడీపీ నేతలు జిల్లాను ప్రగతి బాట పట్టించడం అనుమానమేనన్న వాదనలు ప్రతిపక్షాల నుంచే కాదు స్వయంగా టీడీపీ క్యాడర్ నుంచే వినిపిస్తుండటం గమనార్హం.
ఏడాదిలో ఏం ఒరిగింది?
Published Sun, May 17 2015 1:43 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement