కృష్ణా డెల్టాకు 60 టీఎంసీలు చాలు!
కేంద్ర జల వనరుల శాఖ ముందు రాష్ట్రం వాదనలు
♦ సాగర్ దిగువన-ప్రకాశం ఎగువన నీటి లభ్యత పుష్కలం
♦ 181 టీఎంసీల కేటాయింపుల్లో 101 టీఎంసీలు అక్కడే లభ్యం
♦ మరో 20 టీఎంసీలు భీమాకు తరలిస్తే డెల్టాకు 60 టీఎంసీలు చాలు
♦ బచావత్ ట్రిబ్యునల్ క్లాజ్-15 మేరకు రాష్ట్రాలకు ఉన్నవి
♦ గుండుగుత్త కేటాయింపులే
♦ వాటిని రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వినియోగించుకోవచ్చని వివరణ..
♦ ఈ వాదనపై ఏకీభవించిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా డెల్టాకు ఉన్న నీటివాటాలో సగానికి పైగా నీరు.. నాగార్జునసాగర్ దిగువన, ప్రకాశం ఎగువలోనే లభ్యమవుతోందని కేంద్ర జల వనరుల శాఖకు తెలంగాణ స్పష్టం చేసింది. సాగర్-ప్రకాశం మధ్య పరీవాహకంలో పుష్కలంగా నీటి లభ్యత ఉన్నందున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటికేటాయింపులను 60 టీఎంసీలకు తగ్గించాలని సూచించింది. ఢిల్లీలో కేంద్ర జల వనరులశాఖ వద్ద జరుగుతున్న కృష్ణా బోర్డు సమావేశాల్లో రాష్ట్రం తన వాదనలను బలంగా వినిపించింది. కృష్ణా పరీవాహక ప్రాంతం, దాని ఉపనదుల్లో లభ్యమయ్యే నీరు, అందులో తెలంగాణకు దక్కాల్సిన వాటాను వివరిస్తూ నీటి లెక్కలను సమర్పించింది.
సాగర్ దిగువనే..: నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు ఇచ్చే 181.2 టీఎంసీల నీటిలో 101.2 టీఎంసీలు సాగర్ దిగువనే లభిస్తోందని తెలిపింది. కాబట్టి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీటినే అవసరంగా భావించాలని పేర్కొంది. ఇందులో 20 టీఎంసీలను భీమాకు పునః కేటాయింపుగా ఇవ్వాల్సి ఉంటుందని, దీంతో డెల్టాకు 60 టీఎంసీలు సరిపోతుందని వివరించింది. తుంగభద్ర, వేదవతి సబ్‌బేసిన్‌ల ద్వారా కృష్ణాకు ఆశించిన నీరు రావడం లేదని.. లోయర్ కృష్ణా, మూసీ, పాలేరు, మున్నేరు సబ్‌బేసిన్‌ల నుంచి సాగర్‌కు నీరు రావడం లేదని స్పష్టం చేసింది. వీటి దృష్ట్యా సాగర్ నుంచి డెల్టాకు 60 టీఎంసీలను సరిపెట్టాలని వాదించింది. సబ్‌బేసిన్‌లు, కృష్ణా ప్రధాన పరీవాహకంలో 200 టీఎంసీలు(41.6 శాతం) తెలంగాణకు, 280.6 టీఎంసీలు (58.4 శాతం) ఏపీకి దక్కుతాయని తెలిపింది.
గుండుగుత్త కేటాయింపులే!: ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలు గుండుగుత్త (ఎన్‌బ్లాక్)గా ఇచ్చినవేనని.. విభజన అనంతర ం తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి దక్కిన 512 టీఎంసీలను ఎన్‌బ్లాక్‌గానే చూడాలని రాష్ట్రం స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్‌లోని క్లాజ్-15 ప్రకారం ఒక రాష్ట్రానికి కేటాయించిన నీటిని ఆ రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్కడైనా వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
1996లోనూ అప్పటి కేంద్ర జల సంఘం చైర్మన్.. రాష్ట్రాలు తమకు కేటాయించిన నీటిని పునః కేటాయించుకోవచ్చని చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. తమకు కేటాయించిన వాటా నీటినే సాగర్ నుంచి వాడుకుంటున్నామని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ వాదనతో కేంద్ర జలవనరుల శాఖ సైతం ఏకీభవించింది. కాగా ప్రాజెక్టుల భద్రతకు అన్ని రకాల రెగ్యులేటర్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, అంతర్‌రాష్ట్ర సరిహద్దుల వద్ద సీఐఎస్‌ఎఫ్‌తో పహారా అవసరం లేదని, ఎక్కడైనా సీఐఎస్‌ఎఫ్ బలగాలతో పెట్రోలింగ్ చేయించాలని సూచించింది.