TMC allocation
-
789 టీఎంసీలు మాకే కావాలి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో ఉన్న 1,050 టీఎంసీల్లో 798 టీఎంసీలను తమకు కేటాయించాలని జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2కి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలోని ప్రాజెక్టులకు 238 టీఎంసీలు, భవిష్యత్‌లో కట్టబోయే ప్రాజెక్టులకు 216 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 36 టీఎంసీలు కలిపి మొత్తం 789 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్(కృష్ణా ట్రిబ్యునల్–1) గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలతో పాటు ఇతర కేటాయింపులను.. ఏపీ, తెలంగాణల మధ్య పునః పంపిణీకి కృష్ణా ట్రిబ్యునల్–2కు అదనపు విధివిధానాలు (టీఓఆర్) జారీ చేస్తూ 2023 అక్టోబర్ 10న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పంపిణీపై తమ వాదనలతో స్టేట్ ఆఫ్ కేసు (ఎస్ఓసీ) దాఖలు చేయాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నెల 20తో గడువు ముగియగా, అదేరోజు తమకు 798 టీఎంసీలను కేటాయించాలని కోరుతూ తెలంగాణ ఎస్ఓసీ దాఖలు చేసింది. నది పరీవాహక ప్రాంతం(బేసిన్)ను ప్రామాణికంగా తీసుకుంటే 68 శాతం క్యాచ్మెంట్ ఏరియా తమ రాష్ట్రం పరిధిలో ఉందని తెలంగాణ స్పష్టం చేసింది. బేసిన్ పరిధిలో 2 కోట్ల జనాభాతో పాటు అత్యధిక శాతం కరువు పీడిత ప్రాంతాలున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకొని న్యాయమైన వాటాగా 789 టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. కనీస మొత్తంగా 75 శాతం లభ్యత(డిపెండబిలిటీ) ఆధారంగా 555 టీఎంసీలు, 65 శాతం లభ్యత ఆధారంగా 575 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని నివేదించింది. భవిష్యత్‌లో కట్టే ప్రాజెక్టులకు 216 టీఎంసీలు భవిష్యత్‌లో కోయిల్‌కొండ, గండీడ్, జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం జరగాల్సి ఉందని, వీటికి 216 టీఎంసీల నీటిని కేటాయించాలని ట్రిబ్యునల్‌ను తెలంగాణ కోరింది. 1050 టీఎంసీల్లో సగానికి పైగా... ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ గంపగుత్తగా 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అదనంగా 194 టీఎంసీలు కేటాయించడంతో ఉమ్మడి ఏపీకి 1005 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇవికాక పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా సిస్టమ్ (కేడీఎస్)కు తరలించే 80 టీఎంసీల గోదావరి జలాలకు బదులుగా, నాగార్జునసాగర్ ఎగువన ఉండే రాష్ట్రాలకు 80 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునే వెసులుబాటు గతంలోనే బచావత్ ట్రిబ్యునల్ కల్పించింది. అందులో ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలు కలుపుకొని మొత్తం 1050 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. ట్రిబ్యునల్ నివేదికకు 15 నెలల గడువు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం–1956లోని సెక్షన్–3 కింద విచారణ జరిపి, నివేదిక ఇచ్చేందుకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును ఇటీవల కేంద్రం మరో 15 నెలలు పొడిగించింది. 2025 జూలై 31లోపు ట్రిబ్యునల్ నివేదిక అందించాలి. ఏపీ సైతం తమ స్టేట్ ఆఫ్ కేస్‌ను దాఖలు చేస్తే ట్రిబ్యునల్ విచారణ ముందుకు సాగనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్–89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్ విచారణ చేసినందున, తీర్పు కూడా 15 నెలల్లోపే వస్తుందనే ఆశతో తెలంగాణ ఉంది. -
తెలంగాణకు 92 .. ఏపీకి 21 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో లభ్యతగా ఉన్న 113 టీఎంసీల నుంచి 92 టీఎంసీలను తెలంగాణకు, 21 టీఎంసీలను ఏపీకి కేటాయిస్తూ కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకుంది. శ్రీశైలంలో నీటి మట్టం అడుగంటిన నేపథ్యంలో నాగార్జునసాగర్ నుంచి రివర్స్ పంపింగ్ చేసిన జలాలను తాగునీటి అవసరాల కోసం వాడుకోవాలని తెలంగాణకు సూచించింది. రబీలో సాగునీరు.. వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు తాగునీటి అవసరాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో గురువారం బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అధ్యక్షతన త్రిసభ్య కమిటీ సమావేశమైంది. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్. ఏపీ ఈఎన్సీ తరఫున కర్నూలు ప్రాజెక్టుల సీఈ మురళీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణాలో మొత్తం లభ్యతగా ఉన్న 953 టీఎంసీల్లో 629 టీఎంసీలు(66 శాతం) ఏపీకి, 324 టీఎంసీలు (34 శాతం) తెలంగాణకు దక్కుతాయని రాయ్‌పురే తేల్చారు. అయితే శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసి.. కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు మళ్లించిన వరద జలాలను కోటా కింద లెక్కించకూడదని ఏపీ సీఈ వాదించారు. దీనిపై తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ జలాలను కోటా కింద లెక్కించాల్సిందేనన్న తెలంగాణ డిమాండ్‌కు రాయ్‌పురే అంగీకరించారు. మళ్లించిన వరద జలాలతో కలుపుకొని ఏపీ ఇప్పటిదాకా 608, తెలంగాణ 232 టీఎంసీలు వాడుకున్నట్లు చెబుతూ.. ఆ మేరకు నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం లభ్యతగా ఉన్న జలాలను ఇరు రాష్ట్రాలకు కేటాయించారు. పది టీఎంసీలపై ప్రభుత్వంతో మాట్లాడి చెబుతాం.. మే 31తో నీటి సంవత్సరం ముగుస్తున్నందున ఆలోగానే కోటా నీటిని వాడుకోవాలని.. లేదంటే మిగిలిన నీటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని ఏపీ సీఈ చెప్పగా.. రాయ్‌పురే ఏకీభవించారు. సాగు, తాగునీటి అవసరాల కోసం 82 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ ప్రతిపాదన పంపిన నేపథ్యంలో.. ఆ రాష్ట్ర కోటాలో మిగులుగా ఉన్న 10 టీఎంసీలను తమకు కేటాయించాలని ఏపీ సీఈ కోరగా.. దీనిపై తమ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఈఎన్సీ చెప్పారు. గెజిట్‌ను అబయన్స్‌లో పెట్టమన్నాం.. కృష్ణా బోర్డు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి ఆర్నెల్లు పూర్తయినా.. అనుమతి లేని ప్రాజెక్టులకు రెండు రాష్ట్రాలు ఇప్పటిదాకా కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు తెచ్చుకోలేదని, అందువల్ల వచ్చే నీటి సంవత్సరం నుంచి ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగాన్ని ఆపేయాలని రాయ్‌పురే సూచించారు. అయితే తాము గెజిట్ నోటిఫికేషన్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసేదాకా దీనిని అబయన్స్‌లో పెట్టాల్సిందిగా కేంద్ర జల శక్తి శాఖను తాము కోరామని తెలంగాణ ఈఎన్సీ తెలిపారు. దీంతో ఈ అంశంపై బోర్డు సర్వసభ్య సమావేశంలో చర్చిద్దామని రాయ్‌పురే చెప్పారు. -
భారమంతా సీలేరుపైనే..
సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో రబీసాగు ఇక పూర్తిగా సీలేరుపై ఆధారపడాల్సిందే. సాగు కీలక దశకు చేరుకున్న ఈ సమయంలో సహజ జలాలు గణనీయంగా పడిపోవడంతో సీలేరు నుంచి వచ్చే నీటినే పంట చేలకు మళ్లిస్తూ అధికారులు రబీని గట్టెక్కించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటి వరకు సగానికి పైగా సీలేరు నుంచి వచ్చే నీటిపైనే సాగు జరగగా, ఇక నుంచి మొత్తం సీలేరు నుంచి వచ్చే నీటిపైనే నెట్టుకు రావాల్సి ఉంది. పంట చేలు పాలుపోసుకుని గింజగట్టి పడే దశకు చేరుకుంది. సాగు ఆలస్యం కావడం వల్ల మార్చి నెలాఖరు నాటికి పూర్తికావాల్సిన రబీ ఏప్రిల్ నెలాఖరు నాటికి కాని పూర్తికాని పరిస్థితి నెలకొంది. అందువల్ల ఎంతలేదన్నా ఏప్రిల్ 20వ తేదీ వరకు డెల్టా కాలువలకు సాగునీరందించాల్సి వస్తోంది. రబీ డిసెంబర్ 1 నుంచి మొదలు కాగా మార్చి 6వ తేదీ వరకు మూడు ప్రధాన పంట కాలువలకు 70.982 టీఎంసీల నీరు అందించారు. దీనిలో సీలేరు నుంచి వచ్చింది 40.338 టీఎంసీలు కాగా, సహజ జలాలు 30.644 టీఎంసీలు. మరో 40 రోజుల పాటు కనీసం 21 టీఎంసీల నీరు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డెల్టా కాలువలకు 7 వేల క్యూసెక్కులకు పైబడి నీరు విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 10 తరువాత 5 వేల క్యూసెక్కులు సరిపోతుంది. సగటు ఆరు వేల క్యూసెక్కులు అంటే 40 రోజుల కాలానికి 2.40 లక్షల క్యూసెక్కులు అవసరం. 11 వేల 575 క్యూసెక్కులు ఒక టీఎంసీ. ఆ విధంగా చూస్తే కనీసం 21 టీఎంసీల నీరు అవసరం. డిసెంబర్ 1 నుంచి మార్చి 6వ తేదీ వరకు వినియోగించిన నీరు 70.982 టీఎంసీలు తూర్పుడెల్టాకు 20.994 మధ్యడెల్టాకు 13.901 పశ్చిమడెల్టాకు 35.982 సీలేరు డిసెంబర్ నెలలో 9.809 జనవరి నెలలో 12.182 ఫిబ్రవరి నెలలో 14.778 మార్చి 6వ తేదీ వరకు 3.569 మొత్తం 40.338 సహజ జలాలు 30.644 పడిపోతున్న సహజ జలాలు ఇంతవరకు సహజ జలాల రాక ఆశాజనకంగా ఉన్నా ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గిపోతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శనివారం నీటి రాక 8 వేల 100 క్యూసెక్కులు కాగా, దీనిలో సీలేరు వాటా 7వేల 831 క్యూసెక్కులు. అంటే సహజ జలాల రాక కేవలం 269 క్యూసెక్కులు మాత్రమే. వచ్చిన నీటిని తూర్పుడెల్టాకు 2300, మధ్యడెల్టాకు 1,500, పశ్చిమ డెల్టాకు 4,300 చొప్పున మొత్తం 8,100 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గడిచిన పది రోజులుగా వస్తున్న నీటికన్నా వదిలేది ఎక్కువ కావడం వల్ల బ్యారేజ్ వద్ద పాండ్ లెవెల్ తగ్గుతోంది. నీటి విడుదల అంతంత మాత్రం కావడం, కాలువలపై వంతుల వారీ విధానం వల్ల పంట చేలకు నీరందక రైతులు పాట్లు పడుతున్నారు. మరో 40 రోజుల పాటు వచ్చే సహజ జలాలు 2 టీఎంసీలు మాత్రమే. దీంతో సీలేరు నుంచి 19 టీఎంసీల నీటిని పవర్ జనరేషన్, బైపాస్ పద్ధతిలో విడుదల చేయాల్సి ఉంది. బలిమెలలో మన వాటా ఇంకా 40 టీఎంసీలు, సీలేరు, డొంకరాయల ప్రాజెక్టుల్లో 5 టీఎంసీలు కలిపి మొత్తం 45 టీఎంసీల వరకు ఉన్నందున డెల్టాకు ఇబ్బంది ఉండదని సాగునీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రబీ గట్టెక్కించేందుకు మొత్తం మీద 91 టీఎంసీల వరకు నీరు వినియోగిస్తుండగా అందులో సీలేరుది 60 టీఎంసీలు కావడం గమనార్హం. గతంలో రబీ సీజన్లో సీలేరు నుంచి వచ్చే 40 టీఎంసీలు సాగుకు సరిపోయేవి. అత్యవసర పరిస్థితుల్లో మరో 5 టీఎంసీలు అదనంగా తెచ్చేవారు. కానీ కొన్నేళ్లుగా రబీ సీజన్లో 55 నుంచి 60 టీఎంసీలు వినియోగించాల్సి వస్తోంది. -
కృష్ణా డెల్టాకు 60 టీఎంసీలు చాలు!
-
కృష్ణా డెల్టాకు 60 టీఎంసీలు చాలు!
కేంద్ర జల వనరుల శాఖ ముందు రాష్ట్రం వాదనలు ♦ సాగర్ దిగువన-ప్రకాశం ఎగువన నీటి లభ్యత పుష్కలం ♦ 181 టీఎంసీల కేటాయింపుల్లో 101 టీఎంసీలు అక్కడే లభ్యం ♦ మరో 20 టీఎంసీలు భీమాకు తరలిస్తే డెల్టాకు 60 టీఎంసీలు చాలు ♦ బచావత్ ట్రిబ్యునల్ క్లాజ్-15 మేరకు రాష్ట్రాలకు ఉన్నవి ♦ గుండుగుత్త కేటాయింపులే ♦ వాటిని రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వినియోగించుకోవచ్చని వివరణ.. ♦ ఈ వాదనపై ఏకీభవించిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా డెల్టాకు ఉన్న నీటివాటాలో సగానికి పైగా నీరు.. నాగార్జునసాగర్ దిగువన, ప్రకాశం ఎగువలోనే లభ్యమవుతోందని కేంద్ర జల వనరుల శాఖకు తెలంగాణ స్పష్టం చేసింది. సాగర్-ప్రకాశం మధ్య పరీవాహకంలో పుష్కలంగా నీటి లభ్యత ఉన్నందున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటికేటాయింపులను 60 టీఎంసీలకు తగ్గించాలని సూచించింది. ఢిల్లీలో కేంద్ర జల వనరులశాఖ వద్ద జరుగుతున్న కృష్ణా బోర్డు సమావేశాల్లో రాష్ట్రం తన వాదనలను బలంగా వినిపించింది. కృష్ణా పరీవాహక ప్రాంతం, దాని ఉపనదుల్లో లభ్యమయ్యే నీరు, అందులో తెలంగాణకు దక్కాల్సిన వాటాను వివరిస్తూ నీటి లెక్కలను సమర్పించింది. సాగర్ దిగువనే..: నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు ఇచ్చే 181.2 టీఎంసీల నీటిలో 101.2 టీఎంసీలు సాగర్ దిగువనే లభిస్తోందని తెలిపింది. కాబట్టి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీటినే అవసరంగా భావించాలని పేర్కొంది. ఇందులో 20 టీఎంసీలను భీమాకు పునః కేటాయింపుగా ఇవ్వాల్సి ఉంటుందని, దీంతో డెల్టాకు 60 టీఎంసీలు సరిపోతుందని వివరించింది. తుంగభద్ర, వేదవతి సబ్బేసిన్ల ద్వారా కృష్ణాకు ఆశించిన నీరు రావడం లేదని.. లోయర్ కృష్ణా, మూసీ, పాలేరు, మున్నేరు సబ్బేసిన్ల నుంచి సాగర్‌కు నీరు రావడం లేదని స్పష్టం చేసింది. వీటి దృష్ట్యా సాగర్ నుంచి డెల్టాకు 60 టీఎంసీలను సరిపెట్టాలని వాదించింది. సబ్బేసిన్లు, కృష్ణా ప్రధాన పరీవాహకంలో 200 టీఎంసీలు(41.6 శాతం) తెలంగాణకు, 280.6 టీఎంసీలు (58.4 శాతం) ఏపీకి దక్కుతాయని తెలిపింది. గుండుగుత్త కేటాయింపులే!: ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలు గుండుగుత్త (ఎన్‌బ్లాక్)గా ఇచ్చినవేనని.. విభజన అనంతర ం తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి దక్కిన 512 టీఎంసీలను ఎన్‌బ్లాక్‌గానే చూడాలని రాష్ట్రం స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్‌లోని క్లాజ్-15 ప్రకారం ఒక రాష్ట్రానికి కేటాయించిన నీటిని ఆ రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్కడైనా వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. 1996లోనూ అప్పటి కేంద్ర జల సంఘం చైర్మన్.. రాష్ట్రాలు తమకు కేటాయించిన నీటిని పునః కేటాయించుకోవచ్చని చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. తమకు కేటాయించిన వాటా నీటినే సాగర్ నుంచి వాడుకుంటున్నామని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ వాదనతో కేంద్ర జలవనరుల శాఖ సైతం ఏకీభవించింది. కాగా ప్రాజెక్టుల భద్రతకు అన్ని రకాల రెగ్యులేటర్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద సీఐఎస్ఎఫ్తో పహారా అవసరం లేదని, ఎక్కడైనా సీఐఎస్ఎఫ్ బలగాలతో పెట్రోలింగ్ చేయించాలని సూచించింది.