సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో లభ్యతగా ఉన్న 113 టీఎంసీల నుంచి 92 టీఎంసీలను తెలంగాణకు, 21 టీఎంసీలను ఏపీకి కేటాయిస్తూ కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకుంది. శ్రీశైలంలో నీటి మట్టం అడుగంటిన నేపథ్యంలో నాగార్జునసాగర్ నుంచి రివర్స్ పంపింగ్ చేసిన జలాలను తాగునీటి అవసరాల కోసం వాడుకోవాలని తెలంగాణకు సూచించింది.
రబీలో సాగునీరు.. వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు తాగునీటి అవసరాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో గురువారం బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అధ్యక్షతన త్రిసభ్య కమిటీ సమావేశమైంది. తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్. ఏపీ ఈఎన్‌సీ తరఫున కర్నూలు ప్రాజెక్టుల సీఈ మురళీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణాలో మొత్తం లభ్యతగా ఉన్న 953 టీఎంసీల్లో 629 టీఎంసీలు(66 శాతం) ఏపీకి, 324 టీఎంసీలు (34 శాతం) తెలంగాణకు దక్కుతాయని రాయ్‌పురే తేల్చారు.
అయితే శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసి.. కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు మళ్లించిన వరద జలాలను కోటా కింద లెక్కించకూడదని ఏపీ సీఈ వాదించారు. దీనిపై తెలంగాణ ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ జలాలను కోటా కింద లెక్కించాల్సిందేనన్న తెలంగాణ డిమాండ్‌కు రాయ్‌పురే అంగీకరించారు. మళ్లించిన వరద జలాలతో కలుపుకొని ఏపీ ఇప్పటిదాకా 608, తెలంగాణ 232 టీఎంసీలు వాడుకున్నట్లు చెబుతూ.. ఆ మేరకు నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం లభ్యతగా ఉన్న జలాలను ఇరు రాష్ట్రాలకు కేటాయించారు.
పది టీఎంసీలపై ప్రభుత్వంతో మాట్లాడి చెబుతాం..
మే 31తో నీటి సంవత్సరం ముగుస్తున్నందున ఆలోగానే కోటా నీటిని వాడుకోవాలని.. లేదంటే మిగిలిన నీటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని ఏపీ సీఈ చెప్పగా.. రాయ్‌పురే ఏకీభవించారు. సాగు, తాగునీటి అవసరాల కోసం 82 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ ప్రతిపాదన పంపిన నేపథ్యంలో.. ఆ రాష్ట్ర కోటాలో మిగులుగా ఉన్న 10 టీఎంసీలను తమకు కేటాయించాలని ఏపీ సీఈ కోరగా.. దీనిపై తమ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఈఎన్‌సీ చెప్పారు.
గెజిట్‌ను అబయన్స్‌లో పెట్టమన్నాం..
కృష్ణా బోర్డు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి ఆర్నెల్లు పూర్తయినా.. అనుమతి లేని ప్రాజెక్టులకు రెండు రాష్ట్రాలు ఇప్పటిదాకా కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు తెచ్చుకోలేదని, అందువల్ల వచ్చే నీటి సంవత్సరం నుంచి ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగాన్ని ఆపేయాలని రాయ్‌పురే సూచించారు. అయితే తాము గెజిట్ నోటిఫికేషన్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసేదాకా దీనిని అబయన్స్‌లో పెట్టాల్సిందిగా కేంద్ర జల శక్తి శాఖను తాము కోరామని తెలంగాణ ఈఎన్‌సీ తెలిపారు. దీంతో ఈ అంశంపై బోర్డు సర్వసభ్య సమావేశంలో చర్చిద్దామని రాయ్‌పురే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment