ముడుపుల యావ తప్ప ముందుచూపేదీ?
గోదావరి ట్రిబ్యునల్ నిబంధనలు పట్టని సీఎం
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం జరిగితే బేసిన్ మారుతుంది కనుక గోదావరి ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు అదనంగా కొన్ని హక్కులు కల్పించింది. 7 (ఇ), 7 (ఎఫ్) క్లాజుల ప్రకారం ఆ హక్కులు సంక్రమిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని 13 జిల్లాలకు తాగు, సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుంది. కృష్ణా డెల్టాకు, రాయలసీమకు నమ్మకంగా నీరందించవచ్చు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యుసీ) అనుమతి మంజూరైన మరుక్షణం కృష్ణాజలాల్లో కర్ణాటక, మహారాష్ర్టకు 35 టీఎంసీల నీటిని వాడుకునే స్వేచ్ఛ ఉంటుంది. అందుకే ప్రాజెక్టు అనుమతుల కంటే ముందుగానే కాల్వల పనులను శరవేగంగా పూర్తిచేయడానికి, అనుమతులు రాగానే పోలవరం ప్రాజెక్టును కూడా వేగంగా పూర్తి చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాధాన్యమిచ్చారు. 190 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని ఉపయోగించుకోవడానికి వీలు కల్పించే పోలవరం వంటి భారీ ప్రాజెక్టు వల్ల 35 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలకు కోల్పోయినా పరవాలేదు కానీ.. పట్టిసీమ వంటి 4 టీఎంసీల పిల్ల ప్రాజెక్టుతో ఇపుడు 35 టీఎంసీల నీటిని కోల్పోయే ప్రమాదమేర్పడడమే విచారకర అంశం.
ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనాలోచిత నిర్ణయ ఫలితమేనని సాగునీటి రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ముడుపుల యావలో రాష్ట్రానికి జరుగుతున్న ఈ నష్టాన్ని చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేశారని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శిస్తున్నారు.
వైఎస్ ముందుచూపు వల్లే వేగంగా కుడికాల్వ పనులు
కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి మంజూరైన మరుక్షణం కృష్ణా జలాల్లో 35 టీఎంసీల నీటిని వాడుకొనే స్వేచ్ఛ ఎగువ రాష్ట్రాలకు దక్కుతుందనే నిబంధన దృష్ట్యా.. అనుమతి వచ్చిన వెంటనే పనులు ముమ్మరం చేసి ఆఘమేఘాల మీద పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి. లేదంటే కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రాలు 35 టీఎంసీలు వాడుకుంటే.. ఏపీ తీవ్రంగా నష్టపోతుంది. అందుకే ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకముందే కుడికాల్వ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి భావించారు. పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా దక్కిన నేపథ్యంలో.. ప్రాజెక్టు పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు భిన్నంగా పట్టిసీమ లిఫ్ట్ ద్వారా కుడికాల్వకు నీరు మళ్లించడానికి పూనుకొంది.
రెండు నదుల్లోనూ ఒకేసారి వరద.. నిల్వకు లేని అవకాశం
‘ఇటు గోదావరి, అటు కృష్ణా.. రెండు నదుల్లోనూ దాదాపు ఒకే సమయంలో వరదలు ఉంటాయి. కృష్ణాలో వరద నీరు ప్రవహిస్తున్నప్పుడు గోదావరి నుంచి నీళ్లు మళ్లించడంలో అర్థం లేదు. కృష్ణాలో వరద లేనప్పుడు గోదావరిలో కూడా ప్రవాహం పెద్దగా ఉండదు. ఫలితంగా లిఫ్ట్ చేయడం సాధ్యం కాదు. కుడికాల్వకు నీళ్లు మళ్లించిన తర్వాత.. నీటిని నిల్వ చేయడానికి ఎక్కడా అవకాశం లేదు. కృష్ణా డెల్టాలో నీరు అవసరం ఉన్నప్పుడే, అవసరం ఉన్నంత మేరకే గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు గోదావరిలో ప్రవాహం ఉండే అవకాశం లేనందున, కృష్ణా డెల్టాకు నీళ్లివ్వడం సాధ్యం కాదు.
అంటే.. లిఫ్ట్ వల్ల కృష్ణా డెల్టాకు అదనంగా వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. గోదావరి ట్రిబ్యునల్ తీర్పును అడ్డం పెట్టుకొని.. ఎగువ రాష్ట్రాలు వాటా కోసం పట్టుబడితే.. కృష్ణా జలాల్లో మనకు ఉన్న నికర జలాల నుంచి 35 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి ఉంటుంది. అదే జరిగితే.. రాష్ట్రానికి, ప్రత్యేకించి రాయలసీమ, కృష్ణా డెల్టాకు తీవ్ర నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
7(ఇ) క్లాజ్: ‘పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి వచ్చిన వెంటనే, కుడికాల్వకువాస్తవంగా నీటిని ఎప్పుడు మళ్లిస్తారనే విషయంలో నిమిత్తం లేకుండా, కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న కేటాయింపుల్లో 35 టీఎంసీల నీటిని వాడుకొనే స్వేచ్ఛ కర్ణాటక,మహారాష్ట్రకు ఉంటుంది.
7(ఎఫ్)క్లాజ్: 80 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని కుడికాల్వకుమళ్లిస్తే.. ఆ నీటిలోనూ ఎగువ రాష్ట్రాలకు అదే దామాషాలో వాటా ఉంటుంది.