చంద్రబాబు కూటమి నిర్వాకం ఫలితం
పోలవరం ఎత్తు తగ్గింపుతో జల విద్యుత్కేంద్రంలో ఉత్పత్తికి విఘాతం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే కూటమి ప్రభుత్వం కుదించడంతో 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం ప్రశ్నార్ధకంగా మారింది. ఏడాది పొడవునా కారు చౌకగా విద్యుత్తునందించే ఈ కేంద్రం ఇప్పుడు దిష్టిబొమ్మలా మారనుంది. దీనివల్ల ప్రజలు చౌక విద్యుత్‌ను కోల్పోయి, ఈమేరకు విద్యుత్‌ను బయట కొనుగోలు చేస్తే ప్రజలపై చార్జీల భారం పడుతుందని, పారిశ్రామికాభివృద్ధికి విఘాతం కలిగి, ఉపాధి అవకాశాలూ దెబ్బ తింటాయని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు.
గోదావరి ట్రిబ్యునల్ ఆమోదించిన డిజైన్ ప్రకారం 45.72 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మించి, 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేస్తే హిమాలయ నదులపై ఉన్న విద్యుత్ కేంద్రాల తరహాలో ఇక్కడి జల విద్యుత్ కేంద్రంలోనూ కరెంటు ఉత్పత్తి చేయవచ్చని నిపుణులు అంచనా వేశారు. రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ఎత్తును కేవలం 41.15 మీటర్లకే కుదించడం ద్వారా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు లక్ష్యాలన్నింటికీ గండి కొట్టేసింది.
కేవలం ఓ బ్యారేజ్‌గా మార్చేస్తోంది. దీనివల్ల ‘హెడ్’ తగ్గిపోయి జల విద్యుదుత్పత్తికి విఘాతం కలుగుతుందని నిపుణులు తేల్చిచెబుతున్నారు. గోదావరికి భారీగా వరద వచ్చే రోజుల్లో మాత్రమే అదీ.. అరకొరగా విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
బాబు కమీషన్ల కక్కుర్తితో ఖజానాపై రూ.4,124.64 కోట్ల భారం
విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రంతో సహా పోలవరం ప్రాజెక్టును పూర్తిగా తామే నిర్మించి ఇస్తామని విభజన చట్టం ద్వారా కేంద్రం హామీ ఇచ్చింది. ఇందులో పోలవరం జల విద్యుత్ కేంద్రం అంచనా వ్యయం రూ.4,124.64 కోట్లు.
విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు.. కమీషన్ల కక్కుర్తితో 2016, సెప్టెంబరు 7న ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకుంది. దీంతో పోలవరం జల విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయాన్ని ఇవ్వబోమని కేంద్రం చెబితే.. దానికీ చంద్రబాబు అంగీకరించారు. తద్వారా రాష్ట్ర ఖజానాపై రూ.4,124.64 కోట్ల భారాన్ని చంద్రబాబు మోపారు.
రివర్స్ టెండరింగ్‌తో రూ.560 కోట్లు ఆదా
పోలవరం జల విద్యుత్ కేంద్రం టెండర్లను ‘ఈనాడు’ రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు 4.8 శాతం అధిక ధరకు 2018లో చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అక్రమంగా కట్టబెట్టిన ఆ కాంట్రాక్టును రద్దు చేశారు.
టీడీపీ సర్కారు నిర్ణయించిన కాంట్రాక్టు విలువనే రూ.3216.11 కోట్లు అంచనా వ్యయంగా నిర్ధారించి 2019లో అప్పటి సీఎం వైఎస్ జగన్ రివర్స్ టెండర్ నిర్వహించారు. దీని ద్వారా 12.6 శాతం తక్కువ ధరకు పనులు చేసేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దాంతో ఖజానాకు రూ.550 కోట్లు ఆదా అయ్యాయి. ఆ తర్వాత పోలవరం జలవిద్యుత్ కేంద్రం పనులను పరుగులెత్తించారు. ప్రెజర్ టన్నెళ్లతో సహా కీలకమైన పనులు 2024 మే నాటికే పూర్తయ్యాయి.
గోదావరి సిగలో కలికితురాయిని దిష్టిబొమ్మగా మార్చేశారు
పోలవరం ప్రధాన డ్యాంకు ఎడమ వైపున ఒక్కోటి 80 మెగావాట్ల చొప్పున 12 యూనిట్లతో మొత్తం 960 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రాజెక్టులో 35.52 మీటర్ల స్థాయి నుంచి విద్యుదుత్పత్తి చేసేలా టర్బైన్లను అమర్చుతారు. 12 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి 1,40,291.04 క్యూసెక్కులు అవసరం. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో అంటే 45.72 మీటర్ల స్థాయిలో 194.6 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే హెడ్ పెరుగుతుంది.
అప్పుడే ఏడాది పొడవునా విద్యుదుత్పత్తి చేయవచ్చు. అందుకే ఈ విద్యుత్ కేంద్రాన్ని గోదావరి సిగలో కలికితురాయిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదించడం వల్ల విద్యుదుత్పత్తి జరగదని, ఈ విద్యుత్ కేంద్రాన్ని దిష్టిబొమ్మగా మార్చేశారని విద్యుత్ రంగ నిపుణులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment