ఖరీఫ్‌కు గడ్డుకాలం..
ఖరీఫ్‌కు గడ్డుకాలం..
Published Sat, Aug 20 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
కృష్ణాడెల్టాకు అరకొరగా నీరు
ఇప్పుడు నాట్లు వేస్తే జనవరిలో కోతలు
ఆందోళనలో రైతులు
మచిలీపట్నం :
కృష్ణా డెల్టాకు గడ్డు కాలం. పాలకుల నిర్లక్ష్యంతో వరిసాగు చేసే రైతుల పాలిట శాపంగా మారింది. ఆగస్టు ముగుస్తున్నా పూర్తిస్థాయిలో కాలువలకు నీరు విడుదల చేయలేదు. వర్షాలు కురవని సమయంలో అన్ని ప్రధాన కాలువలకు ప్రకాశం బ్యారేజీ నుంచి 15 వేల క్యూసెక్కులు విడుదల చేయాల్సి ఉంది. 9,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో కాలువల్లో నీటిమట్టం పెరగని పరిస్థితి నెలకొంది.
ఎండిపోతున్న పైరు..
గతంలో నెలలో కురిసిన ఓ మోస్తరు వర్షానికి రైతులు నారుమళ్లు పోశారు. కొంత మేర నాట్లు వేశారు. ప్రస్తుతం ఎండలు పెరగడంతో పైరు సగం మేర చనిపోయింది. నాలుగు రోజులుగా కాలువలకు నీరు విడుదల చేస్తున్నా పొలాలకు ఎక్కేంతగా నీట్టి మట్టం పెరగటం లేదు. దీంతో కాలువ పక్కనే భూములు ఉన్న రైతులు ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని మళ్లించుకుంటున్నారు.
2.40 లక్షల ఎకరాల్లో సాగు..
జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉంది. ఆగస్టు 15లోపే వరినాట్లు పూర్తి చేయాల్సి ఉంది. విజయవాడ రూరల్, కంకిపాడు, ఉంగుటూరు, గుడివాడ, తోట్లవల్లూరు, పామర్రు తదితర మండలాల్లో సబ్‌మెర్సిబుల్ పంపులు ఉన్న బోర్ల ద్వారా దాదాపు 2.40 లక్షల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పూర్తిచేశారు. వెద పద్ధతితో కొంతమేర వరినాట్లు వేసినా, నీరు లేకపోవటంతో ఎండిపోయింది. ఖరీఫ్‌లో ఏ రకం వరివంగడం సాగు చేసినా కనీసంగా 145 రోజులకు కోతకు వస్తుంది.
పట్టిసీమ పేరుతో మాయ..
ప్రకాశం బ్యారేజీ నుంచి అన్ని ప్రధాన కాలువలకు రోజుకు 15 వేల క్యూసెక్కులు విడుదల చేయాల్సి ఉంది. పట్టిసీమ నుంచి 8,500 క్యూసెక్కుల నీరు వచ్చినా డెల్టాకు ఏ విధంగా సాగునీటి అవసరాలను తీరుస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే డెల్టా బీడుగా మారి దర్శనమిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు దీని ప్రభావం అపరాల సాగుపై తీవ్రంగా ఉంటుందని వాపోతున్నారు.
Advertisement
Advertisement