నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వకింద రబీ సాగుకు నేటినుంచి నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఎల్లారెడ్డి తెలిపారు. నీటి విడుదలపై ఆయన గురువారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ నాగార్జునసాగర్ జలాశయంలో ఉన్న నీటి లభ్యత ఆధారంగా కుడి, ఎడమ కాల్వలకు, కృష్ణా డెల్టాకు 50 టీఎంసీల చొప్పున నీటిని కేటాయించినట్టు చెప్పారు. ఈ రబీలో కుడి, ఎడమ కాల్వలు, డెల్టా కింద సుమారు 15.67లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, ఇందులో ఎడమ కాల్వ కింద 4లక్షల 31వేల 300 ఎకరాలని తెలిపారు. ఆ నీటిని ఐదు విడతలుగా విభజించి స్థానిక ఎన్‌ఎస్‌పీ అధికారులు ప్రణాళికాబద్ధంగా మేజర్ కాల్వలకు విడుదల చేస్తారన్నారు. తొలి విడతగా ఈ నెల 20వ తేదీన, 22న రెండో విడత, ఫిబ్రవరి 10న మూడో విడత, మార్చి ఒకటిన నాల్గోవిడత, మార్చి20న ఐదో దఫాగా సాగునీరు విడుదల చేస్తామని వివరించారు. మార్చి 31వ తేదీ తర్వాత నీరు విడుదల చేయడం సాధ్యపడదని తెలిపారు.
ఈ లోపు రైతులు పంటలు సాగుచేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో 567.60అడుగుల నీరుంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 8580 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా రాగా, 20,200 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. అందులో కుడికాల్వ ద్వారా 8875 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 5000 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1200 క్యూసెక్కులు, శ్రీశైలం రివర్స్ పంపింగ్ ద్వారా 5,125 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.