డా. విలాస్ ఎ.తొనపి
పౌష్టికాహార భద్రతను కల్పించే చిరుధాన్యాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చైతన్యం వెల్లివిరుస్తున్న నేపథ్యంలో మెట్ట పొలాలతో పాటు గోదావరి, కృష్ణా డెల్టా భూముల్లో కూడా వీటిని సాగు చేయడంపై రైతులు దృష్టి సారించాలని రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) డైరెక్టర్ డా. విలాస్ ఎ.తొనపి సూచించారు. సంక్రాంతి సందర్భంగా ‘సాక్షి సాగుబడి’తో ఆయన మాట్లాడారు. మెట్ట ప్రాంతాలతో పోల్చితే సారవంతమైన డెల్టా భూముల్లో చిరుధాన్యాల రెట్టింపు దిగుబడి పొందవచ్చన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని డెల్టా భూముల్లో ఖరీఫ్‌లోనూ చిరుధాన్యాలను సాగు చేయవచ్చన్నారు. వరి కోసిన తర్వాత రెండో పంటగా కూడా చిరుధాన్యాలను సాగు చేయవచ్చని, భూమిలో తేమ ఉంటుంది కాబట్టి, ఒక రక్షక పంట ఇస్తే సరిపోతుందన్నారు.
చిరుధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనెగింజలను అంతర పంటలుగా, మిశ్రమ పంటలుగా సాగు చేయాలన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడం, సాగు నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం కోసం చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చిరుధాన్యాల క్లస్టర్లను ఏర్పాటు చేసి రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పత్తి తదితర పంటల నుంచి రైతుల దృష్టి మళ్లించాలంటే ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమన్నారు. కొర్ర, అండుకొర్ర, సామ, ఊద, అరికలు వంటి సిరి(చిరు)ధాన్యాల ప్రాసెసింగ్‌కు యంత్రాలను అందుబాటులోకి తేవడంతో పాటు మార్కెటింగ్‌కు మౌలిక సదుపాయాలు కల్పించడం అవసరమన్నారు. రైతులకు శిక్షణతోపాటు మేలైన విత్తనాలు అందించడానికి ఐ.ఐ.ఎం.ఆర్. సిద్ధంగా ఉందని డా. తొనపి(85018 78645) తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment