Godavari delta farmers
-
భారమంతా సీలేరుపైనే..
సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో రబీసాగు ఇక పూర్తిగా సీలేరుపై ఆధారపడాల్సిందే. సాగు కీలక దశకు చేరుకున్న ఈ సమయంలో సహజ జలాలు గణనీయంగా పడిపోవడంతో సీలేరు నుంచి వచ్చే నీటినే పంట చేలకు మళ్లిస్తూ అధికారులు రబీని గట్టెక్కించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటి వరకు సగానికి పైగా సీలేరు నుంచి వచ్చే నీటిపైనే సాగు జరగగా, ఇక నుంచి మొత్తం సీలేరు నుంచి వచ్చే నీటిపైనే నెట్టుకు రావాల్సి ఉంది. పంట చేలు పాలుపోసుకుని గింజగట్టి పడే దశకు చేరుకుంది. సాగు ఆలస్యం కావడం వల్ల మార్చి నెలాఖరు నాటికి పూర్తికావాల్సిన రబీ ఏప్రిల్ నెలాఖరు నాటికి కాని పూర్తికాని పరిస్థితి నెలకొంది. అందువల్ల ఎంతలేదన్నా ఏప్రిల్ 20వ తేదీ వరకు డెల్టా కాలువలకు సాగునీరందించాల్సి వస్తోంది. రబీ డిసెంబర్ 1 నుంచి మొదలు కాగా మార్చి 6వ తేదీ వరకు మూడు ప్రధాన పంట కాలువలకు 70.982 టీఎంసీల నీరు అందించారు. దీనిలో సీలేరు నుంచి వచ్చింది 40.338 టీఎంసీలు కాగా, సహజ జలాలు 30.644 టీఎంసీలు. మరో 40 రోజుల పాటు కనీసం 21 టీఎంసీల నీరు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డెల్టా కాలువలకు 7 వేల క్యూసెక్కులకు పైబడి నీరు విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 10 తరువాత 5 వేల క్యూసెక్కులు సరిపోతుంది. సగటు ఆరు వేల క్యూసెక్కులు అంటే 40 రోజుల కాలానికి 2.40 లక్షల క్యూసెక్కులు అవసరం. 11 వేల 575 క్యూసెక్కులు ఒక టీఎంసీ. ఆ విధంగా చూస్తే కనీసం 21 టీఎంసీల నీరు అవసరం. డిసెంబర్ 1 నుంచి మార్చి 6వ తేదీ వరకు వినియోగించిన నీరు 70.982 టీఎంసీలు తూర్పుడెల్టాకు 20.994 మధ్యడెల్టాకు 13.901 పశ్చిమడెల్టాకు 35.982 సీలేరు డిసెంబర్ నెలలో 9.809 జనవరి నెలలో 12.182 ఫిబ్రవరి నెలలో 14.778 మార్చి 6వ తేదీ వరకు 3.569 మొత్తం 40.338 సహజ జలాలు 30.644 పడిపోతున్న సహజ జలాలు ఇంతవరకు సహజ జలాల రాక ఆశాజనకంగా ఉన్నా ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గిపోతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శనివారం నీటి రాక 8 వేల 100 క్యూసెక్కులు కాగా, దీనిలో సీలేరు వాటా 7వేల 831 క్యూసెక్కులు. అంటే సహజ జలాల రాక కేవలం 269 క్యూసెక్కులు మాత్రమే. వచ్చిన నీటిని తూర్పుడెల్టాకు 2300, మధ్యడెల్టాకు 1,500, పశ్చిమ డెల్టాకు 4,300 చొప్పున మొత్తం 8,100 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గడిచిన పది రోజులుగా వస్తున్న నీటికన్నా వదిలేది ఎక్కువ కావడం వల్ల బ్యారేజ్ వద్ద పాండ్ లెవెల్ తగ్గుతోంది. నీటి విడుదల అంతంత మాత్రం కావడం, కాలువలపై వంతుల వారీ విధానం వల్ల పంట చేలకు నీరందక రైతులు పాట్లు పడుతున్నారు. మరో 40 రోజుల పాటు వచ్చే సహజ జలాలు 2 టీఎంసీలు మాత్రమే. దీంతో సీలేరు నుంచి 19 టీఎంసీల నీటిని పవర్ జనరేషన్, బైపాస్ పద్ధతిలో విడుదల చేయాల్సి ఉంది. బలిమెలలో మన వాటా ఇంకా 40 టీఎంసీలు, సీలేరు, డొంకరాయల ప్రాజెక్టుల్లో 5 టీఎంసీలు కలిపి మొత్తం 45 టీఎంసీల వరకు ఉన్నందున డెల్టాకు ఇబ్బంది ఉండదని సాగునీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రబీ గట్టెక్కించేందుకు మొత్తం మీద 91 టీఎంసీల వరకు నీరు వినియోగిస్తుండగా అందులో సీలేరుది 60 టీఎంసీలు కావడం గమనార్హం. గతంలో రబీ సీజన్లో సీలేరు నుంచి వచ్చే 40 టీఎంసీలు సాగుకు సరిపోయేవి. అత్యవసర పరిస్థితుల్లో మరో 5 టీఎంసీలు అదనంగా తెచ్చేవారు. కానీ కొన్నేళ్లుగా రబీ సీజన్లో 55 నుంచి 60 టీఎంసీలు వినియోగించాల్సి వస్తోంది. -
డెల్టా భూముల్లో చిరుధాన్యాల దిగుబడి రెట్టింపు!
పౌష్టికాహార భద్రతను కల్పించే చిరుధాన్యాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చైతన్యం వెల్లివిరుస్తున్న నేపథ్యంలో మెట్ట పొలాలతో పాటు గోదావరి, కృష్ణా డెల్టా భూముల్లో కూడా వీటిని సాగు చేయడంపై రైతులు దృష్టి సారించాలని రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) డైరెక్టర్ డా. విలాస్ ఎ.తొనపి సూచించారు. సంక్రాంతి సందర్భంగా ‘సాక్షి సాగుబడి’తో ఆయన మాట్లాడారు. మెట్ట ప్రాంతాలతో పోల్చితే సారవంతమైన డెల్టా భూముల్లో చిరుధాన్యాల రెట్టింపు దిగుబడి పొందవచ్చన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని డెల్టా భూముల్లో ఖరీఫ్‌లోనూ చిరుధాన్యాలను సాగు చేయవచ్చన్నారు. వరి కోసిన తర్వాత రెండో పంటగా కూడా చిరుధాన్యాలను సాగు చేయవచ్చని, భూమిలో తేమ ఉంటుంది కాబట్టి, ఒక రక్షక పంట ఇస్తే సరిపోతుందన్నారు. చిరుధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనెగింజలను అంతర పంటలుగా, మిశ్రమ పంటలుగా సాగు చేయాలన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడం, సాగు నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం కోసం చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చిరుధాన్యాల క్లస్టర్లను ఏర్పాటు చేసి రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పత్తి తదితర పంటల నుంచి రైతుల దృష్టి మళ్లించాలంటే ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమన్నారు. కొర్ర, అండుకొర్ర, సామ, ఊద, అరికలు వంటి సిరి(చిరు)ధాన్యాల ప్రాసెసింగ్‌కు యంత్రాలను అందుబాటులోకి తేవడంతో పాటు మార్కెటింగ్‌కు మౌలిక సదుపాయాలు కల్పించడం అవసరమన్నారు. రైతులకు శిక్షణతోపాటు మేలైన విత్తనాలు అందించడానికి ఐ.ఐ.ఎం.ఆర్. సిద్ధంగా ఉందని డా. తొనపి(85018 78645) తెలిపారు. -
పట్టిసీమ ‘నీటిమట్టం’పై సర్కారు దొంగాట
కాటన్ బ్యారేజీ పాండ్ లెవల్ 13.56 మీటర్లు గోదావరిలో కనీస మట్టం 14 మీటర్లు ఉంటేనే నీటిని తోడాలని జీవో పట్టిసీమలో 12.5 మీటర్ల మట్టం వద్ద కూడా నీటిని తోడేలా డిజైన్ హైదరాబాద్: పట్టిసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. గోదావరి డెల్టా రైతుల ప్రయోజనాలతో చెలగాటమాడుతోందని నీటిపారుదలరంగ నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రాంత రైతుల ప్రయోజనాలు కాపాడతామని, వారి అవసరాలు తీరిన తర్వాతే ఎత్తిపోతల ద్వారా నీటిని పోలవరం కుడి కాల్వకు పంప్ చేస్తామని ప్రభుత్వం నమ్మబలుకుతోంది. అయితే వాస్తవ విషయాలు అందుకు భిన్నంగా ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పట్టిసీమ లిఫ్ట్ డిజైన్ ప్రకారం.. 12.5 మీటర్ల కనీస నీటిమట్టం ఉన్నప్పుడు కూడా నీటిని తోడేందుకు అనుకూలంగా నిర్మాణం చేపడుతున్నారు. ఈమేరకు కాంట్రాక్టర్, ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. పట్టిసీమ లిఫ్ట్ నిర్మాణానికి పిలిచిన టెండర్లలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ‘గోదావరిలో కనీస నీటిమట్టం 12.5 మీటర్ల నుంచి పోలవరం కుడి కాల్వలో 42.5 మీటర్ల ఎత్తు వద్దకు నీటిని లిఫ్ట్ చేయడం పథకం ప్రధాన ఉద్దేశం’ అని టెండర్లో ప్రభుత్వం చెప్పింది. టెండర్ డాక్యుమెంట్లో పెట్టిన ఎత్తిపోతల పథకం రేఖాచిత్రం (స్కీమాటిక్ డయాగ్రమ్)లోనూ గోదావరి కనీస నీటిమట్టాన్ని 12.5 మీటర్లుగా చూపించారు. అందుకు అనుగుణంగానే ధరలు నిర్ణయించారు. ఆదివారం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రభుత్వం మీడియాకిచ్చిన పత్రాల్లో కనీస నీటిమట్టం 12.5 మీటర్ల అని ముద్రించిన స్థానంలో 14 మీటర్లు అని చేతితో దిద్దడం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యతిరేకతతో దొంగాట.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం మీద గోదావరి డెల్టా రైతుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ‘దొంగాట’ మొదలుపెట్టింది. దీన్లో భాగంగా పట్టిసీమ లిఫ్ట్ వాడకం మార్గదర్శకాలను ఈనెల 27న జారీ చేసింది. గోదావరిలో కనీస నీటిమట్టం 14 మీటర్లు ఉన్నప్పుడే లిఫ్ట్‌ను వాడాలని, అంతకంటే తక్కువ ఉంటే నీటిని తీసుకోవడానికి వీల్లేదని పేర్కొంటూ జీవో 200 జారీ చేసింది. ‘కాటన్ బ్యారేజీ జలాశయం నుంచి ఈ లిఫ్ట్ ద్వారా నీటిని తీసుకోకూడదు. బ్యారేజీ జలాశయం గరిష్ట మట్టం 13.67 మీటర్లు. లిఫ్ట్ వద్ద కనీసం 14 మీటర్ల మట్టం ఉన్నప్పుడే నీటిని తోడుకోవాలి’ అని జీవోలో పేర్కొన్న మార్గదర్శకాల్లో ఉంది. అంటే.. కాటన్ బ్యారేజీ జలాశయం మట్టం కంటే గోదావరిలో ఎక్కువ నీటిమట్టం ఉంటేనే లిఫ్ట్ వాడతామని, అందువల్ల బ్యారేజీ కింద ఉన్న గోదావరి డెల్టా ప్రయోజనాలకు ఇబ్బంది ఉండదని ప్రభుత్వం జీవో 200 ద్వారా పరోక్షంగా చెప్పింది. గోదావరి డెల్టా మీద అంత ప్రేమ ఉంటే.. పట్టిసీమ పథకం రూపకల్పనలోనే కనీస నీటిమట్టాన్ని 14 మీటర్లుగా ఎందుకు పెట్టలేదని నీటిపారుదల రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటని దీన్ని బట్టే అర్థమవుతోందంటున్నారు. ఎప్పటికప్పుడు మారే మార్గదర్శకాలు.. కాటన్ బ్యారేజీ జలాశయం(పాండ్) స్థాయి 13.67 మీటర్ల కంటే దిగువన.. గోదావరిలో 12.5 మీటర్ల నీటిమట్టం వద్ద నీటిని లిఫ్ట్ చేస్తే.. గోదావరిలో వేగంగా ప్రవాహం లేకుంటే బ్యారేజీ వద్ద నీటి మట్టం పడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోదావరి మట్టాలను పట్టించుకోకుండా నీటిని లిఫ్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తే, అడ్డు చెప్పేవారు ఎవరూ ఉండరని, పథకం అమలు విధివిధానాలు, మార్గదర్శకాలు అడ్డురావని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘లిఫ్ట్ వాడకం మార్గదర్శకాల్లో మార్పులు చేయాలంటే ప్రభుత్వ అనుమతితో చేయాలి’ అని జీవో 200లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం తమ ఇష్టానుసారం మార్చేలా మార్గదర్శకాలు ఏర్పాటు చేసి.. గోదావరి డెల్టా రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయబోమని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని విమర్శిస్తున్నారు. గోదావరి పోటెత్తి ప్రవహించినప్పుడు నీటిని లిఫ్ట్ చేస్తే ఎవరికీ నష్టం ఉండదని, అయితే కరువు సంవత్సరాల్లో ఎత్తిపోతల పథకాన్ని వాడితే గోదావరి డెల్టాకు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
కన్నీటిపాట్లు
రబీ వరి సాగు కీలక దశకు చేరిన ప్రస్తుత తరుణంలో.. నీరందక గోదావరి డెల్టా రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం పైసా కూడా విదల్చకపోవడం.. కీలక సమయంలో నీరందించాలన్న ముందుచూపు లేని నీటిపారుదల శాఖ నిర్వాకం అన్నదాతకు శాపంగా మారాయి. వరి పైరు పాలు పోసుకుంటున్న దశలో చేలకు సమృద్ధిగా నీరందించాల్సి ఉంటుందని తెలిసి కూడా.. అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయలేదు. అమలాపురం :డెల్టాలో రబీ వరి పైరు పాలు పోసుకునే దశలో ఉంది. ఈ తరుణంలో సాగునీరందించడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. రబీకి 16 టీఎంసీల నీటికొరత ఉందని అటు ఇరిగేషన్ అధికారులకు, ఇటు ప్రజాప్రతినిధులకు ముందే తెలుసు. అయినప్పటికీ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి డెల్టా మొత్తం ఆయకట్టుకు నీరందించాలని గతంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ప్రభుత్వం రూ.10 కోట్లు ఇస్తే అదనపు జలాలు సేకరిస్తామని అధికారులు అప్పట్లో చెప్పారు. నిధులు తెచ్చే బాధ్యత తమదని అధికార పార్టీ నేతలు వారికి భరోసా ఇచ్చారు. దీంతో రబీ మొత్తం ఆయకట్టుకు అధికారులు అనుమతి ఇచ్చారు. కానీ, వరిపైరు పాలు పోసుకుంటున్న ప్రస్తుత దశలో సాగునీరందక రైతులు పడుతున్న ఇబ్బందులను ఇటు అధికారులు, అటు పాలకపక్ష ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. క్రాస్బండ్లకు అనుమతి వచ్చినా.. సాగునీటి కొరతను అధిగమించేందుకు గోదావరి వృథా జలాలను కాలువల్లోకి మళ్లించాలని, మురుగునీటి కాలువలపై క్రాస్బండ్లు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తద్వారా ఏడు టీఎంసీల నీటిని సేకరించవచ్చని, ఇందుకు నిధులివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. డెల్టాలో రబీకి నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుందని తెలిసి కూడా ప్రభుత్వం ఆమేరకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో గోదావరిలో వృథా పోతున్న నీటిని కాలువల్లోకి మళ్లించే అవకాశం లేకుండా పోయింది. గతంలో కడియం మండలం వేమగిరి, ముమ్మిడివరం మండలం పళ్లవారిపాలెం, అయినవిల్లి మండలం శానపల్లిలంకల వద్ద ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సేకరణ జరిగింది. గత నెలలో మాత్రం ‘క్రాస్బండ్లు వేయించండి. నిధులు వచ్చిన తరువాత ఇస్తాం’ అని జిల్లా ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఎక్కడెక్కడ వీటిని నిర్మించాలనేది సూచిస్తూ డ్రైన్ అధికారులకు ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. క్రాస్బండ్లు వేయించినా నిధులు వస్తాయనే భరోసా లేకపోవడం డ్రైన్స్ అధికారులు పనులు మొదలు పెట్టించేందుకు జంకుతున్నారు. గతంలో నీటి ఎద్దడి సమయంలో తూర్పు, మధ్య డెల్టాల్లో సుమారు 220 వరకూ క్రాస్బండ్లు వేయగా, ఇప్పటివరకూ అమలాపురం సబ్ డివిజన్లో కూనవరం, వాసాలతిప్ప వద్ద కేవలం రెండంటే రెండే క్రాస్బండ్లు వేశారు. అవికూడా రైతులే స్వయంగా నిర్మించుకున్నవి కావడం గమనార్హం. అలాగే చిన్నిచిన్ని మురుగునీటి కాలువలు, బోదెలపై రైతులు సొంతంగా క్రాస్బండ్లు వేసి చేలల్లో నీరు దిగకుండా చూసుకుంటున్నారు. లోపించిన ముందస్తు ప్రణాళిక మొత్తం ఆయకట్టుకు నీటి లభ్యత తక్కువగా ఉందని తెలిసి కూడా ఇరిగేషన్ అధికారులు ముందస్తు ప్రణాళికతో సాగునీరందించడంలో నిర్లక్ష్యం వహించారు. సాధారణంగా నాట్లు వేసే సమయంలోను, పంట చేలు పాలు పోసుకుని గింజ గట్టిపడే దశలోను చేలల్లో ఐదు సెంటీమీటర్ల ఎత్తున నీరు ఉంచుతారు. అందువల్ల పాలు పోసుకునే ఈ నెల రోజులూ సమృద్ధిగా సాగు నీరందించాలి. ఈ ఏడాది డెల్టాలో రబీ సాగు ఆలస్యమైంది. దీంతో ఎగువ ప్రాంతాలకు, శివారుకు మధ్య నాట్లకు నెల రోజులు పైగా వ్యత్యాసముంది. ఈ కారణంగా ఫిబ్రవరి 15 నుంచి ఈ నెలాఖరు వరకూ చేలు పాలు పోసుకుని గింజ గట్టిపడే దశ ఉంటుంది. ఈ సమయంలో మూడు డెల్టా కాలువల ద్వారా 9 వేల నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలి. ఇది ముందే తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు గతంలో ఎన్నడూ లేనివిధంగా సీలేరు నుంచి వస్తున్న నీటికి అదనంగా 2 వేల క్యూసెక్కులు రప్పిస్తున్నారు. ఇదేదో రెండు వారాల క్రితం రప్పించి ఉంటే ప్రస్తుతం నీటికి ఇబ్బందులు వచ్చేవి కావని రైతులంటున్నారు. సీలేరు నీరు వస్తున్నా శివారుకు ఎద్దడి ఏర్పడుతోందంటే అందుకు క్రాస్బండ్ల ద్వారా మురుగునీటి కాలువల నుంచి, లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి గోదావరి నుంచి కాలువల్లోకి నీరు మళ్లించకపోవడమే కారణమని ఇరిగేషన్ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.