రబీ వరి సాగు కీలక దశకు చేరిన ప్రస్తుత తరుణంలో.. నీరందక గోదావరి డెల్టా రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం పైసా కూడా విదల్చకపోవడం.. కీలక సమయంలో నీరందించాలన్న ముందుచూపు లేని నీటిపారుదల శాఖ నిర్వాకం అన్నదాతకు శాపంగా మారాయి. వరి పైరు పాలు పోసుకుంటున్న దశలో చేలకు సమృద్ధిగా నీరందించాల్సి ఉంటుందని తెలిసి కూడా.. అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయలేదు.
అమలాపురం :డెల్టాలో రబీ వరి పైరు పాలు పోసుకునే దశలో ఉంది. ఈ తరుణంలో సాగునీరందించడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. రబీకి 16 టీఎంసీల నీటికొరత ఉందని అటు ఇరిగేషన్ అధికారులకు, ఇటు ప్రజాప్రతినిధులకు ముందే తెలుసు. అయినప్పటికీ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి డెల్టా మొత్తం ఆయకట్టుకు నీరందించాలని గతంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ప్రభుత్వం రూ.10 కోట్లు ఇస్తే అదనపు జలాలు సేకరిస్తామని అధికారులు అప్పట్లో చెప్పారు. నిధులు తెచ్చే బాధ్యత తమదని అధికార పార్టీ నేతలు వారికి భరోసా ఇచ్చారు. దీంతో రబీ మొత్తం ఆయకట్టుకు అధికారులు అనుమతి ఇచ్చారు. కానీ, వరిపైరు పాలు పోసుకుంటున్న ప్రస్తుత దశలో సాగునీరందక రైతులు పడుతున్న ఇబ్బందులను ఇటు అధికారులు, అటు పాలకపక్ష ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.
క్రాస్‌బండ్లకు అనుమతి వచ్చినా..
సాగునీటి కొరతను అధిగమించేందుకు గోదావరి వృథా జలాలను కాలువల్లోకి మళ్లించాలని, మురుగునీటి కాలువలపై క్రాస్‌బండ్లు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తద్వారా ఏడు టీఎంసీల నీటిని సేకరించవచ్చని, ఇందుకు నిధులివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. డెల్టాలో రబీకి నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుందని తెలిసి కూడా ప్రభుత్వం ఆమేరకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో గోదావరిలో వృథా పోతున్న నీటిని కాలువల్లోకి మళ్లించే అవకాశం లేకుండా పోయింది. గతంలో కడియం మండలం వేమగిరి, ముమ్మిడివరం మండలం పళ్లవారిపాలెం, అయినవిల్లి మండలం శానపల్లిలంకల వద్ద ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సేకరణ జరిగింది.
గత నెలలో మాత్రం ‘క్రాస్‌బండ్లు వేయించండి. నిధులు వచ్చిన తరువాత ఇస్తాం’ అని జిల్లా ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఎక్కడెక్కడ వీటిని నిర్మించాలనేది సూచిస్తూ డ్రైన్ అధికారులకు ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. క్రాస్‌బండ్లు వేయించినా నిధులు వస్తాయనే భరోసా లేకపోవడం డ్రైన్స్ అధికారులు పనులు మొదలు పెట్టించేందుకు జంకుతున్నారు. గతంలో నీటి ఎద్దడి సమయంలో తూర్పు, మధ్య డెల్టాల్లో సుమారు 220 వరకూ క్రాస్‌బండ్లు వేయగా, ఇప్పటివరకూ అమలాపురం సబ్ డివిజన్‌లో కూనవరం, వాసాలతిప్ప వద్ద కేవలం రెండంటే రెండే క్రాస్‌బండ్లు వేశారు. అవికూడా రైతులే స్వయంగా నిర్మించుకున్నవి కావడం గమనార్హం. అలాగే చిన్నిచిన్ని మురుగునీటి కాలువలు, బోదెలపై రైతులు సొంతంగా క్రాస్‌బండ్లు వేసి చేలల్లో నీరు దిగకుండా చూసుకుంటున్నారు.
లోపించిన ముందస్తు ప్రణాళిక
మొత్తం ఆయకట్టుకు నీటి లభ్యత తక్కువగా ఉందని తెలిసి కూడా ఇరిగేషన్ అధికారులు ముందస్తు ప్రణాళికతో సాగునీరందించడంలో నిర్లక్ష్యం వహించారు. సాధారణంగా నాట్లు వేసే సమయంలోను, పంట చేలు పాలు పోసుకుని గింజ గట్టిపడే దశలోను చేలల్లో ఐదు సెంటీమీటర్ల ఎత్తున నీరు ఉంచుతారు. అందువల్ల పాలు పోసుకునే ఈ నెల రోజులూ సమృద్ధిగా సాగు నీరందించాలి. ఈ ఏడాది డెల్టాలో రబీ సాగు ఆలస్యమైంది. దీంతో ఎగువ ప్రాంతాలకు, శివారుకు మధ్య నాట్లకు నెల రోజులు పైగా వ్యత్యాసముంది. ఈ కారణంగా ఫిబ్రవరి 15 నుంచి ఈ నెలాఖరు వరకూ చేలు పాలు పోసుకుని గింజ గట్టిపడే దశ ఉంటుంది. ఈ సమయంలో మూడు డెల్టా కాలువల ద్వారా 9 వేల నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలి. ఇది ముందే తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు గతంలో ఎన్నడూ లేనివిధంగా సీలేరు నుంచి వస్తున్న నీటికి అదనంగా 2 వేల క్యూసెక్కులు రప్పిస్తున్నారు. ఇదేదో రెండు వారాల క్రితం రప్పించి ఉంటే ప్రస్తుతం నీటికి ఇబ్బందులు వచ్చేవి కావని రైతులంటున్నారు. సీలేరు నీరు వస్తున్నా శివారుకు ఎద్దడి ఏర్పడుతోందంటే అందుకు క్రాస్‌బండ్ల ద్వారా మురుగునీటి కాలువల నుంచి, లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి గోదావరి నుంచి కాలువల్లోకి నీరు మళ్లించకపోవడమే కారణమని ఇరిగేషన్ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.
కన్నీటిపాట్లు
Published Mon, Mar 9 2015 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM
Advertisement
Advertisement