వైద్య, విద్యా ప్రాప్తిరస్తు | Speed of medical college construction work in Amalapuram | Sakshi
Sakshi News home page

వైద్య, విద్యా ప్రాప్తిరస్తు

Published Fri, May 24 2024 5:39 AM | Last Updated on Fri, May 24 2024 5:39 AM

Speed of medical college construction work in Amalapuram

అటు ప్రభుత్వ వైద్య కళాశాల, ఇటు బోధనాసుపత్రి

అమలాపురంలో శరవేగంగా పనులు 

ఇప్పటికే 65 శాతం పూర్తి

అమలాపురం టౌన్‌: చేరువలో చదువుల కోవెల ఉంటే.. ఆరోగ్యానికి పూర్తి భరోసా లభిస్తే ఆ ఆనందమే వేరు. అందుకే విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. పేదలకు సకల సౌకర్యాలూ కల్పిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు ప్రభుత్వ వైద్య విద్య, ఉచిత ప్రభుత్వ వైద్య సేవలు త్వరలో మరింత చేరువ కానున్నాయి. అమలాపురం మండలం కామనగరువు, సమనస గ్రామాల సరిహద్దుల్లో రాష్ట్ర ప్రభుత్వం 54 ఎకరాలను సేకరించి రూ.450 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మిస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు సైతం ప్రభుత్వపరంగా వైద్య విద్యను అభ్యసించేందుకు మార్గం సుగమమవుతోంది.

అమలాపురంలో ఈ వైద్య కళాశాలల నిర్మాణ పనుల వేగం పుంజుకుంది. ఇది అందుబాటులోకి వస్తే ఏటా దాదాపు 150 మెడికల్‌ సీట్లతో విద్యార్థులు వైద్యను అభ్యసించే అవకాశం ఏర్పడుతుంది. ఇంత వరకూ ప్రభుత్వ వైద్య విద్య కోసం ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు విద్యార్థులు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అమలాపురంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులోకి వస్తే ఈ పరిస్థితులన్నీ దాదాపు దూరం కానున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఎవరైనా వైద్య విద్య అభ్యసించాలంటే రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అలాంటి విద్యార్థులకు వైద్య విద్యపరంగా జిల్లాలో ఓ భరోసాగా నిలువనుంది. ఇప్పటికే ఈ కళాశాల నిర్మాణ పనులు దాదాపు 65 శాతం పూర్తయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు చెందిన ఇంజినీర్లు ఈ భవనాలను త్వరితగతిన పూర్తి చేసే దిశగా శ్రమిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి మొత్తం నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ ఇంజినీర్‌ యోగి తెలిపారు.

చకచకా సదుపాయాల కల్పన
ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా జిల్లా బోధనా ఆసుపత్రిగా అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 100 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రి 650 పడకలుగా జిల్లా స్థాయిలో పెద్దాసుపత్రిగా సేవలు అందించనుంది. ఇప్పటికే ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన పనులు చకచకా జరుగుతున్నాయి. ఏరియా ఆస్పత్రిలో బోధనా ఆసుపత్రి కోసం అప్పుడే ఆపరేషన్‌ థియేటర్లు, కన్సల్టింగ్‌ వార్డులు సిద్ధమవుతున్నాయి.

ఆ దిశగా యంత్ర పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు జరుగుతోంది. ఇక ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఈ బోధనా ఆసుపత్రి జిల్లా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించనుంది. ఇప్పుడు ఆసుపత్రిలో 12 విభాగాలకు వైద్య నిపుణులు ఉంటే, అదే బోధనా ఆసుపత్రి హోదా వచ్చాక 24 విభాగాలు ఏర్పడి ఆయా విభాగాలకు ఒక్కో వైద్య నిపుణుడు అందుబాటులోకి రాను­న్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్య­నభ్యసించే విద్యార్థులు బోధనా ఆస్పత్రిలో కూడా సేవలు అందించి తమ వైద్య విద్యను పూర్తి చేయ­నున్నారు. ఇప్పటికే నాడు–నేడు పథకంలో రూ.570 కోట్లతో ఏరియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. ఈ అభివృద్ధి అంతా బోధనా ఆసుపత్రి అప్‌గ్రేడ్‌కు ఉపయోగపడుతోంది.

వచ్చే ఏడాదికి అంతా సిద్ధం
అమలాపురంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల, బోధనా ఆసుపత్రి వచ్చే ఏడాదికి జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని అంచనా వేస్తున్నాం. ఏరియా ఆసుపత్రిలో బోధనా ఆసుపత్రికి అవసరమైన అన్ని సదుపాయాలూ సిద్ధమవుతున్నాయి. దీనివల్ల ప్రజలకు ఉచిత వైద్యం మరింత చేరువవుతోంది. మెడికల్‌ స్పెషలిస్ట్‌లు, మెడికల్‌ ఎక్యూప్‌మెంట్లు వంటి విషయాల్లో అప్‌గ్రేడ్‌ సదుపాయాలు వస్తాయి.    –డాక్టర్‌ పద్మశ్రీరాణి, సమన్వయకర్త, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement