పట్టిసీమ ‘నీటిమట్టం’పై సర్కారు దొంగాట | pattiseema 'water level' government master paln | Sakshi
Sakshi News home page

పట్టిసీమ ‘నీటిమట్టం’పై సర్కారు దొంగాట

Published Mon, Mar 30 2015 1:10 AM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM

పట్టిసీమ ‘నీటిమట్టం’పై సర్కారు దొంగాట - Sakshi

పట్టిసీమ ‘నీటిమట్టం’పై సర్కారు దొంగాట

కాటన్ బ్యారేజీ పాండ్ లెవల్ 13.56 మీటర్లు
గోదావరిలో కనీస మట్టం 14 మీటర్లు ఉంటేనే నీటిని తోడాలని జీవో
పట్టిసీమలో 12.5 మీటర్ల మట్టం వద్ద కూడా నీటిని తోడేలా డిజైన్

 
హైదరాబాద్: పట్టిసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. గోదావరి డెల్టా రైతుల ప్రయోజనాలతో చెలగాటమాడుతోందని నీటిపారుదలరంగ నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రాంత రైతుల ప్రయోజనాలు కాపాడతామని, వారి అవసరాలు తీరిన తర్వాతే ఎత్తిపోతల ద్వారా నీటిని పోలవరం కుడి కాల్వకు పంప్ చేస్తామని ప్రభుత్వం నమ్మబలుకుతోంది. అయితే వాస్తవ విషయాలు అందుకు భిన్నంగా ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పట్టిసీమ లిఫ్ట్ డిజైన్ ప్రకారం.. 12.5 మీటర్ల కనీస నీటిమట్టం ఉన్నప్పుడు కూడా నీటిని తోడేందుకు అనుకూలంగా నిర్మాణం చేపడుతున్నారు. ఈమేరకు కాంట్రాక్టర్, ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. పట్టిసీమ లిఫ్ట్ నిర్మాణానికి పిలిచిన టెండర్లలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ‘గోదావరిలో కనీస నీటిమట్టం 12.5 మీటర్ల నుంచి పోలవరం కుడి కాల్వలో 42.5 మీటర్ల ఎత్తు వద్దకు నీటిని లిఫ్ట్ చేయడం పథకం ప్రధాన ఉద్దేశం’ అని టెండర్‌లో ప్రభుత్వం చెప్పింది. టెండర్ డాక్యుమెంట్‌లో పెట్టిన ఎత్తిపోతల పథకం రేఖాచిత్రం (స్కీమాటిక్ డయాగ్రమ్)లోనూ గోదావరి కనీస నీటిమట్టాన్ని 12.5 మీటర్లుగా చూపించారు. అందుకు అనుగుణంగానే ధరలు నిర్ణయించారు. ఆదివారం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రభుత్వం మీడియాకిచ్చిన పత్రాల్లో కనీస నీటిమట్టం 12.5 మీటర్ల అని ముద్రించిన స్థానంలో 14 మీటర్లు అని చేతితో దిద్దడం స్పష్టంగా కనిపిస్తోంది.

వ్యతిరేకతతో దొంగాట..

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం మీద గోదావరి డెల్టా రైతుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ‘దొంగాట’ మొదలుపెట్టింది. దీన్లో భాగంగా పట్టిసీమ లిఫ్ట్ వాడకం మార్గదర్శకాలను ఈనెల 27న జారీ చేసింది. గోదావరిలో కనీస నీటిమట్టం 14 మీటర్లు ఉన్నప్పుడే లిఫ్ట్‌ను వాడాలని, అంతకంటే తక్కువ ఉంటే నీటిని తీసుకోవడానికి వీల్లేదని పేర్కొంటూ జీవో 200 జారీ చేసింది. ‘కాటన్ బ్యారేజీ జలాశయం నుంచి ఈ లిఫ్ట్ ద్వారా నీటిని తీసుకోకూడదు. బ్యారేజీ జలాశయం గరిష్ట మట్టం 13.67 మీటర్లు. లిఫ్ట్ వద్ద కనీసం 14 మీటర్ల మట్టం ఉన్నప్పుడే నీటిని తోడుకోవాలి’ అని జీవోలో పేర్కొన్న మార్గదర్శకాల్లో ఉంది. అంటే.. కాటన్ బ్యారేజీ జలాశయం మట్టం కంటే గోదావరిలో ఎక్కువ నీటిమట్టం ఉంటేనే లిఫ్ట్ వాడతామని, అందువల్ల బ్యారేజీ కింద ఉన్న గోదావరి డెల్టా ప్రయోజనాలకు ఇబ్బంది ఉండదని ప్రభుత్వం జీవో 200 ద్వారా పరోక్షంగా చెప్పింది. గోదావరి డెల్టా మీద అంత ప్రేమ ఉంటే.. పట్టిసీమ పథకం రూపకల్పనలోనే కనీస నీటిమట్టాన్ని 14 మీటర్లుగా ఎందుకు పెట్టలేదని నీటిపారుదల రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటని దీన్ని బట్టే అర్థమవుతోందంటున్నారు.

ఎప్పటికప్పుడు మారే మార్గదర్శకాలు..

కాటన్ బ్యారేజీ జలాశయం(పాండ్) స్థాయి 13.67 మీటర్ల కంటే దిగువన.. గోదావరిలో 12.5 మీటర్ల నీటిమట్టం వద్ద నీటిని లిఫ్ట్ చేస్తే.. గోదావరిలో వేగంగా ప్రవాహం లేకుంటే బ్యారేజీ వద్ద నీటి మట్టం పడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోదావరి మట్టాలను పట్టించుకోకుండా నీటిని లిఫ్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తే, అడ్డు చెప్పేవారు ఎవరూ ఉండరని, పథకం అమలు విధివిధానాలు, మార్గదర్శకాలు అడ్డురావని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘లిఫ్ట్ వాడకం మార్గదర్శకాల్లో మార్పులు చేయాలంటే ప్రభుత్వ అనుమతితో చేయాలి’ అని జీవో 200లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం తమ ఇష్టానుసారం మార్చేలా మార్గదర్శకాలు ఏర్పాటు చేసి.. గోదావరి డెల్టా రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయబోమని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని విమర్శిస్తున్నారు. గోదావరి పోటెత్తి ప్రవహించినప్పుడు నీటిని లిఫ్ట్ చేస్తే ఎవరికీ నష్టం ఉండదని, అయితే కరువు సంవత్సరాల్లో ఎత్తిపోతల పథకాన్ని వాడితే గోదావరి డెల్టాకు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement