అక్విడెక్టులు లేకుండానే నీటిని దాటిస్తారట
పట్టిసీమలో మరో వింత..
- ఆచరణ సాధ్యంకాని ప్రత్యామ్నాయానికి సర్కారు ఆమోదం
- కుడికాలువకు కొనసాగింపుగా రామిలేరు, తమ్మిలేరులో మట్టికట్టలు కడతారట!
- నదిలో నీటిమట్టం పెరిగి.. ఆవలి ఒడ్డున కాల్వకు నీరెక్కుతుందని అంచనా
- సాధ్యం కాదంటున్న ఇంజనీర్లు
సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ వద్ద గోదావరి నీటిని లిఫ్ట్ చేసి పోలవరం కుడికాల్వలో పోసినంత మాత్రాన అవి కృష్ణానది ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరవు.
కుడికాలువ పనులు పూర్తయితేనే ఇది సాధ్యం. అయితే తమ్మిలేరు, రామిలేరుపై రెండు అక్విడెక్టుల నిర్మాణం, బుడమేరు డైవర్షన్ చానల్ తవ్వకం, 1,800 ఎకరాల భూసేకరణ వంటివి కుడికాల్వను పూర్తి చేయడంలో ఉన్న ప్రధాన అవరోధాలు. ప్రస్తుతం తమ్మిలేరు, రామిలేరుపై అక్విడెక్టుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వేగంగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఎంతగా ఊదరగొట్టినా.. పనుల్ని ఈ ఏడాది పూర్తిచేయడం అసాధ్యమని అధికారులు చేతులెత్తేశారు.
దీంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏర్పాటు చేయనున్న 24 మోటర్లలో నాలుగైదు పంప్‌లు బిగించి పథకం పూర్తి చేశాం చూశారా? అని ఘనంగా చెప్పాలన్న ప్రయత్నం ఫలించదని గ్రహించిన ప్రభుత్వం.. అక్విడెక్టులు లేకుండానే నీటిని రామిలేరు, తమ్మిలేరును దాటించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేసింది. సీఎం ఆదేశించడంతో ఇంజనీర్లు ఆ మేరకు ప్రత్యామ్నాయ మార్గంపై నివేదిక ఇచ్చారు. అయితే ఇది వినడానిక్కూడా అత్యంత వింతగా ఉంది.
ఆచరణాత్మకమా?
ఇదిలాఉండగా ప్రత్యామ్నాయమార్గం ఆచరణ సాధ్యాసాధ్యాలపై నీటిపారుదలశాఖలోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామిలేరు, తమ్మిలేరులో 25-30 వేల క్యూసెక్కుల వరద వస్తుందని, మట్టికట్ట కట్టాక వరదొస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ‘మట్టికట్ట తెగితే.. దిగువనున్న పొలాలు, గ్రామాలు మునకకు గురవుతాయి. మట్టికట్టను తెగిపోనంత గట్టిగా ఏర్పాటు చేయడం సాధ్యపడదు. తెగదనే అనుకుంటే.. వరదొచ్చినప్పుడు ఎగువనున్న గ్రామాలు, పొలాలు మునకకు గురికాక తప్పదు.
నదిలో వరద సంగతి పక్కనబెడితే.. నదికి అడ్డంగా మట్టికట్టలు కట్టినా ఆవలివైపు కాలువకు నీరెక్కదు. మట్టికట్టలు, నది ఒడ్డులనుంచి పొర్లిపోతుంది. ఇంత చిన్న విషయాన్నీ విస్మరిస్తున్నారు. ప్రత్యామ్నాయమార్గం సూచించిన ఇంజనీర్లకూ ఈ విషయం తెలుసు. కానీ సీఎం, మంత్రి గట్టిగా అడిగితే.. ఏదోఒకటి చెప్పక తప్పదు’ అని ఈ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్న సీనియర్ ఇంజనీర్లు ‘సాక్షి’తో అన్నారు. ‘ముఖ్యమంత్రిగారు ఆదేశాలిచ్చాక.. ఏదోఒకటి చేయాల్సిందే. ఏదో చేసి నీటిని దాటిస్తాం’ అని వారు వెటకారంగా చెబుతుండడం గమనార్హం.
ఇదీ ప్రత్యామ్నాయం
‘‘రామిలేరు, తమ్మిలేరుల వద్ద కుడికాల్వ కలిసే ప్రాంతానికి దిగువన, ఎగువన నదికి అడ్డంగా మట్టితో కట్టలు(నదిలోనూ కాలువకు కొనసాగింపు) కట్టాలి. కాల్వలో వచ్చేనీరు నదిలో పడి మట్టం పెరుగుతుంది. ఎంతగా పెరుగుతుందంటే.. అవతలి ఒడ్డునున్న కాలువలోకి నీరు ప్రవహిస్తుంది. అంటే కుడికాల్వలో వచ్చిన నీరు నదిని దాటి వెళుతుంది’’... ఇదీ అధికారులిచ్చిన నివేదిక. దీనికి సీఎం ఆమోదముద్ర వేశారు. దీంతో అక్విడెక్టు నిర్మాణ పనులు ఆపి.. మట్టికట్టల ఏర్పాటుపై అధికారులు దృష్టిపెడుతున్నారు.