
నీటి విడుదలకు ఓకే
కృష్ణా డెల్టాకు 4 టీఎంసీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ నిర్ణీత వాటా కంటే ఇప్పటికే ఎక్కువగా వినియోగించుకుందని స్పష్టం చేసిన తెలంగాణ... ప్రస్తుతం కృష్ణా డెల్టా అవసరాల కోసం నాలుగు టీఎంసీల నీటి విడుదలకు అంగీకరించింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నీటి విడుదల పట్ల సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఏపీలోని కృష్ణా డెల్టా అవసరాల కోసం 4 టీఎంసీల నీటి విడుదలకు ఆదేశిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు తెలంగాణ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 1.2 టీఎంసీల నీటి విడుదలకు ఓకే చెప్పింది.
ఇప్పటికే అధిక వినియోగం..
తెలంగాణ, ఏపీల్లో వినియోగం కోసం శ్రీశైలం నుంచి నీటి విడుదల అంశంపై ఈనెల 5న బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌తో కూడిన త్రిసభ్య కమిటీ అత్యవసరంగా సమావేశమైన విషయం తెలిసిందే. కృష్ణా డెల్టా తాగునీటి అవసరాల కోసం 6 టీఎంసీలు విడుదల చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ కోరింది. అయితే తెలంగాణ సానుకూలంగా స్పందించకపోవడంతో... 4 టీఎంసీల విడుదలకైనా అంగీకరించాలని కోరింది. ప్రభుత్వంతో మాట్లాడాక నిర్ణయం చెబుతానని తెలంగాణ ఈఎన్‌సీ ఆ సమావేశంలో చెప్పారు.
అనంతరం ప్రభుత్వ పెద్దలతో ఈ అంశంపై మాట్లాడిన సమయంలో అదనపు నీటి విడుదల తెరపైకి వచ్చింది. ‘‘కృష్ణా బేసిన్‌లో ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీల నీటిని వాడుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు కృష్ణాలో లభించిన దాదాపు 140 టీఎంసీల నీటిలో తెలంగాణ 44.79 టీఎంసీలు, ఏపీ 95.15 టీఎంసీల మేర వినియోగించుకున్నాయి. నిర్దిష్ట వాటా నిష్పత్తి ప్రకారం చూస్తే.. తెలంగాణ 52.4 టీఎంసీలు, ఏపీ 88.12 టీఎంసీలు వాడుకోవాలి. ఈ లెక్కన తెలంగాణ 7 టీఎంసీలు తక్కువగా వాడుకోగా.. ఏపీ 7 టీఎంసీలు అదనంగా వినియోగించుకుంది...’’ అని తెలంగాణ ఉన్నతాధికారులు తేల్చారు. దీంతో ఏపీకి అదనపు నీటి విడుదలకు తెలంగాణ ఒప్పుకోదనే భావన వ్యక్తమైంది. అయినా ఏపీ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన తెలంగాణ.. 4 టీఎంసీల నీటి విడుదలకు అంగీకరించింది.
ఈ నేపథ్యంలో నీటి విడుదలకు సంబంధించి మంగళవారం కృష్ణా బోర్డు ఉత్తర్వులు విడుదల చేసింది. ‘ఏపీ విజ్ఞప్తికి తెలంగాణ అంగీకరించిన నేపథ్యంలో శ్రీశైలం నుంచి 4.2 టీఎంసీలు (0.2 టీఎంసీల సరఫరా నష్టంతో కలిపి) విడుదల చేయాలి. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 1.2 టీఎంసీలను శ్రీశైలం నుంచి విడుదల చేయాలి. విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే విధంగా నీటి విడుదల జరగాలి. విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు చెరి సగం వినియోగించుకోవాలి..’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
బోర్డు చైర్మన్ పండిట్ పదవీ విరమణ
కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్.కె.జి.పండిట్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన అధ్యక్షతన చివరిగా బుధవారం బోర్డు సమావేశం జరగనుంది. పండిట్ పదవీ విరమణ తర్వాత గోదావరి బోర్డు చైర్మన్ రాంశరణ్‌కు కృష్ణా బోర్డు బాధ్యతలను అదనంగా అప్పగించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.