management board of the Krishna River
-
ముసాయిదా గడువు ముగిసింది.. ఇప్పుడెలా..?
తాగునీటి అవసరాలకు కృష్ణా జలాల్లో 6 టీఎంసీలు కోరిన ఏపీ ముసాయిదా గడువు ముగియడంతో సందిగ్ధంలో బోర్డు, ఏం చేయమంటారని తెలంగాణకు లేఖ సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల నుంచి ఏపీకి తాగునీటి అవసరాల నిమిత్తం నీటి విడుదల చేసే విషయంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సందిగ్ధంలో పడింది. గత ఏడాది ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ముసాయిదా గడువు జూన్ ఒకటవ తేదీతో ముగియడం, మళ్లీ నీటి వినియోగం, విడుదలపై పర్యవేక్షణ చేయాలంటే కొత్త ముసాయిదా అమల్లోకి రావాల్సి ఉండటం, ఇంతలోనే ఏపీ 6 టీఎంసీల నీటిని కోరడంతో ఎలాంటి నిర్ణయం చేయాలన్న ప్రశ్నను ఎదుర్కొంటోంది. ఈ విషయంలో జోక్యం చేసుకొని, అభిప్రాయాన్ని తెలపాలని తెలంగాణను కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా తెలంగాణ ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాశారు. ఈ లేఖలో.. గత ఏడాది చేసుకున్న ఒప్పంద ముసాయిదా గడువు ఈ నెల ఒకటో తేదీతోనే ముగిసిందని, వచ్చే ఏడాది నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాలతో స మావేశం ఏర్పాటు చేయాలని ఏపీ కోరినా దీనిపై తె లంగాణ ఇంతవరకు అభిప్రాయం చెప్పలేదని వివరించారు. కానీ ఇంతలోనే 6 టీఎంసీలు విడుదల చే యాలని ఏపీ కోరిందని తెలిపారు. ఈ నెల 21న కేంద్ర జల వనరుల శాఖ వద్ద జరిగే సమావేశం, అ క్కడ ముసాయిదా ఆమోదం పొందే వరకు నీటి వి డుదలపై తామేమీ చేయలేమని, ఈ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వమే ఒక నిర్ణయం చేయాలని సూ చించారు. ఏపీకి నిజంగా అంత నీటి అవసరం ఉందా? అన్న అంశాలను పరిశీలించి, ఏపీకి సాయం చేయాలని కోరారు. ఇప్పటివరకు చేసిన నీటి వి నియోగంపై వివరాలు సమర్పించాలని సూచించారు. -
ఏమీ తేల్చలేదు!
ప్రాథమిక చర్చలకే పరిమితమైన కృష్ణా బోర్డు సమావేశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏమీ తేల్చలేదు. ఎజెండాలో పేర్కొన్న అంశాలపై కేవలం ప్రాథమిక చర్చలకే పరిమితమైంది. వివాదాలను పరిష్కరించే దిశగా ఏ నిర్ణయం చేయలేదు. నీటి నిర్వహణపై ముసాయిదా కానీ, వాటర్ ప్రోటోకాల్‌ని కానీ సిద్ధం చేయలేదు. మొత్తంమ్మీద ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న బోర్డు చైర్మన్ నాథన్‌కు వీడ్కోలు సమావేశంలా భేటీ సాగింది. బోర్డుకు కొత్త చైర్మన్ వచ్చాకే ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, బోర్డు పరిధి వంటి అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించి ముసాయిదా సిద్ధం చేసుకోవాలని సమావేశంలో ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. కృష్ణా జలాల లభ్యత, వినియోగం, నీటి ప్రోటోకాల్, ప్రాజెక్టుల నిర్వహణ వంటి 11 అంశాలపై చర్చించేందుకు బోర్డు ఇక్కడి కేంద్ర జల సంఘం ప్రాంతీయ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించింది. బోర్డు చైర్మన్ నాథన్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌రావు, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ వెంకటేశ్వర్రావు తదితరులు హాజరయ్యారు. సమావేశంలో అంశాల వారీగా ఎవరి వాదనలు వారు వినిపించారు. ఆ ప్రాజెక్టులు కొత్తవి.. కాదు పాతవి! కృష్ణా జలాల వినియోగంతో తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల అంశాన్ని ఏపీ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించింది. ఎలాంటి అనుమతుల్లేకుండా తెలంగాణ వీటిని చేపడుతోందని, దీనిపై వివరణ కోరినా ఇంతవరకు స్పందన లేదని బోర్డు దృష్టికి తెచ్చింది. అయితే అవన్నీ పాత ప్రాజెక్టులేనని తెలంగాణ మరోమారు స్పష్టం చేసింది. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013లోనే జీవో 72 ఇచ్చారని, అలాగే 30 టీఎంసీలతో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టేందుకు 2007 జూలై7న జీవో 159 ఇచ్చారని గుర్తు చేసింది. దీనిపై ఇదివరకే వివరణ ఇచ్చామని తెలిపింది. ఈ సందర్భంగా బోర్డు జోక్యం చేసుకుంటూ.. దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున పక్కన పెట్టాలని, కోర్టే తేలుస్తుందని పేర్కొంది. ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చే అంశంపై సమావేశంలో ప్రస్తావన వచ్చినా చర్చ మాత్రం జరగలేదు. ముందుగా ఈ అంశాన్ని ప్రస్తావించిన ఏపీ.. కృష్ణా బేసిన్ పరిధిలోని అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని కోరింది. అందుకు బోర్డు స్పందిస్తూ.. బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులను తమ పరిధిలోకి తెస్తూ నోటిఫై చేయాలని కేంద్ర జలసంఘానికి లేఖ రాసినట్లు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా తెలిపారు. దీనిపై కేంద్రం త్వరలో నిర్ణయం ప్రకటిస్తుందని, అంతకుముందే ఏమైనా అభ్యంతరాలుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. ముసాయిదా మార్చాల్సిందే.. వాటర్ ఇయర్‌కు సంబంధించి గతేడాది ముసాయిదాను ఈ ఏడాది కొనసాగించేం దుకు తెలంగాణ, ఏపీ అంగీకరించలేదు. ఈ ముసాయిదాలో మార్పు చేర్పులు చేయాలని అభిప్రాయపడ్డాయి. దీనికి అంగీ కరిం చిన బోర్డు.. తదుపరి సమావేశంలో చర్చించి నిర్ణయానికి వద్దామని తెలిపింది. అలాగే బోర్డు ఖర్చు, అధికారుల కేటాయింపు, కార్యాలయం ఏర్పాటుపై చర్చ జరిగింది. 4న పార్లమెంటరీ కమిటీ రాక కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టుల స్థితిగతులు, నీటి లభ్యత, వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ వంటి అంశాలపై చర్చించేందుకు వచ్చేనెల 4న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(పీఎస్సీ) రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ మేరకు బోర్డు ఇరు రాష్ట్రాల అధికారులకు సమాచారం ఇచ్చింది. ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో గడిచిన ఐదేళ్ల కాలంలో నీటి సామర్థ్యాలు ఎలా పడిపోయాయి, అందుకు కారణాలు, ప్రస్తుత ఏడాది పరిస్థితులు వంటి అంశాలపై చర్చిస్తుందని తెలిపింది. అన్ని అంశాలతో నివేదికలు తయారు చేసి సిద్ధంగా ఉండాలని సూచించింది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపై అభ్యంతరాలు, నదుల కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలు తదితరాలపైనా కమిటీ చర్చిస్తుందని వివరించింది. -
పదకొండు అంశాలతో ఎజెండా
- ఖరారు చేసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు - ఏపీ, తెలంగాణ జల వివాదంపై 27న సమావేశం... సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 27న సమావేశం ఎజెండాను ఖరారు చేసింది. నీటి యాజమాన్యం, కొత్త ప్రాజెక్టులు, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, బోర్డు పరిధి వంటి వాటితో కలిపి మొత్తంగా 11 అంశాలను ఎజెండాలో చేర్చింది. ఈ మేరకు మంగళవారం సమావేశపు ఎజెండాను బోర్డు సభ్యకార్యదర్శి ఆర్కే గుప్తా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపారు. ఇందులో తొలి అంశంగా గతేడాది కేంద్ర ప్రభుత్వం సమక్షంలో తీసుకున్న నిర్ణయాలు, తయారు చేసుకున్న ముసాయిదా అంశాల అమలు, వాటి కొనసాగింపును చేర్చారు. ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి విడుదల చేసేందుకు బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన, రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేశారు. పాలమూరు, డిండిపై చర్చ? నీటి వినియోగ లెక్కల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య తరుచూ వివాదం రేకెత్తుతున్న దృష్ట్యా ముసాయిదా కొనసాగింపు, లేదా అందులో మార్పులకు బోర్డు తొలి ప్రాధాన్యం ఇచ్చిన ట్లుగా తెలుస్తోంది. నీటి నిర్వహణ అంశాన్ని రెండో ప్రాధాన్యతగా చేర్చారు. కేవలం నీటి విడుదల సమయంలో మాత్రమే ఇరు రాష్ట్రాలు తమ అవసరాలు, వినియోగాన్ని పేర్కొంటున్నాయి తప్పితే ముందస్తుగా వెల్లడించడం లేదు. వివాదం తలెత్తినప్పుడు ఏ రాష్ట్ర లెక్కలు సరైనవన్నది తేల్చడం బోర్డుకు పెద్ద తలనొప్పిగా మారింది. వీటితో పాటే ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణను ఎవరు చూడాలన్న దానిపై లోతుగా చర్చించి ఓ నిర్ణయానికి రావాలని బోర్డు భావిస్తోంది. దీంతో పాటే కృష్ణా పరీవాహకంలో చేపట్టిన కొత్త ప్రాజెక్టుల అంశాన్ని బోర్డు ఎజెండాలో చేర్చింది. తెలంగాణ చేపట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల విషయంలో ఏపీ అనేక అభ్యంతరాలను లేవనెత్తుతోంది. ఈ అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు బోర్డు నిర్వహణ ఖర్చు, డ్యామ్‌ల భద్రత తదితర అంశాలను ఎజెండాలో చేర్చింది. -
శ్రీశైలం నుంచి 6.5 టీఎంసీల నీరు
2 టీఎంసీలు తెలంగాణకు, 4.5 టీఎంసీలు ఏపీకి ఆమోదం తెలిపిన కృష్ణా బోర్డు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 6.5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అంగీకరించింది. ఇందులో 2 టీఎంసీల నీటిని తెలంగాణ, మరో 4.5 టీఎంసీలను ఏపీ తమ తాగునీటి అవసరాలకు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని బుధవారం ఇరు రాష్ట్రాల అధికారులకు లేఖల ద్వారా తెలియజేసింది. రాష్ట్ర తాగునీటి అవసరాల దృష్ట్యా జూన్ వరకు 10 టీఎంసీలు అవసరమని తెలంగాణ కృష్ణా బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఇందులో 4 టీఎంసీలు సాగర్ ఎడమ కాల్వకు, 1.5 టీఎంసీ ఏఎంఆర్పీకి, 4.5 టీఎంసీలు హైదరాబాద్ తాగు నీటికి కావాలని కోరింది. కాగా ఏపీ సైతం 10 టీఎంసీలు అవసరమని, అందులో 2టీఎంసీలు కృష్ణా డెల్టాకు, 6 టీఎంసీలు సాగర్ కుడి కాల్వకు, 2 టీఎంసీలు ఎడమ కాల్వకు ఇవ్వాలని కోరింది. ఈ విజ్ఞప్తిని పరిశీలించేందుకు బోర్డు తాత్కాలిక చైర్మన్ రామ్‌శరణ్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాలు కేంద్ర జల సంఘం కార్యాలయంలో ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వరావులతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి పరిమాణం, ప్రస్తుతం శ్రీశైలంలో లభ్యత నీటిపైనా చర్చించారు. మొత్తంగా 821.6 అడుగుల వద్ద 42.02 టీఎంసీల నీరు ఉందని, ఇందులో 790 అడుగుల వరకు 17 టీఎంసీలు వినియోగార్హమైన నీరుందని తేల్చారు. ఈ నీటిని ఇప్పటికిప్పుడు రెండు రాష్ట్రాలు కోరిన మేరకు ఇవ్వడం కుదర దని, ప్రస్తుత నెల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏపీకి 4.5 టీఎంసీలు, తెలంగాణకు 2 టీఎంసీలు విడుదలకు ఆమోదిస్తామని బోర్డు స్పష్టం చేసింది. తర్వాత మరోమారు సమావేశమై అవసరాలు, పంపిణీపై చర్చిద్దామని తెలిపింది. దీనికి ఇరు రాష్ట్రాలు సమ్మతి తెలుపడంతో 6.5 టీఎంసీల నీటి విడుదలకు ఆమోదిస్తూ, ఆర్కే గుప్తా ఇరు రాష్ట్రాలకు లేఖలు పంపారు. -
నీటి విడుదలకు ఓకే
కృష్ణా డెల్టాకు 4 టీఎంసీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ నిర్ణీత వాటా కంటే ఇప్పటికే ఎక్కువగా వినియోగించుకుందని స్పష్టం చేసిన తెలంగాణ... ప్రస్తుతం కృష్ణా డెల్టా అవసరాల కోసం నాలుగు టీఎంసీల నీటి విడుదలకు అంగీకరించింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నీటి విడుదల పట్ల సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఏపీలోని కృష్ణా డెల్టా అవసరాల కోసం 4 టీఎంసీల నీటి విడుదలకు ఆదేశిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు తెలంగాణ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 1.2 టీఎంసీల నీటి విడుదలకు ఓకే చెప్పింది. ఇప్పటికే అధిక వినియోగం.. తెలంగాణ, ఏపీల్లో వినియోగం కోసం శ్రీశైలం నుంచి నీటి విడుదల అంశంపై ఈనెల 5న బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌తో కూడిన త్రిసభ్య కమిటీ అత్యవసరంగా సమావేశమైన విషయం తెలిసిందే. కృష్ణా డెల్టా తాగునీటి అవసరాల కోసం 6 టీఎంసీలు విడుదల చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ కోరింది. అయితే తెలంగాణ సానుకూలంగా స్పందించకపోవడంతో... 4 టీఎంసీల విడుదలకైనా అంగీకరించాలని కోరింది. ప్రభుత్వంతో మాట్లాడాక నిర్ణయం చెబుతానని తెలంగాణ ఈఎన్సీ ఆ సమావేశంలో చెప్పారు. అనంతరం ప్రభుత్వ పెద్దలతో ఈ అంశంపై మాట్లాడిన సమయంలో అదనపు నీటి విడుదల తెరపైకి వచ్చింది. ‘‘కృష్ణా బేసిన్లో ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీల నీటిని వాడుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు కృష్ణాలో లభించిన దాదాపు 140 టీఎంసీల నీటిలో తెలంగాణ 44.79 టీఎంసీలు, ఏపీ 95.15 టీఎంసీల మేర వినియోగించుకున్నాయి. నిర్దిష్ట వాటా నిష్పత్తి ప్రకారం చూస్తే.. తెలంగాణ 52.4 టీఎంసీలు, ఏపీ 88.12 టీఎంసీలు వాడుకోవాలి. ఈ లెక్కన తెలంగాణ 7 టీఎంసీలు తక్కువగా వాడుకోగా.. ఏపీ 7 టీఎంసీలు అదనంగా వినియోగించుకుంది...’’ అని తెలంగాణ ఉన్నతాధికారులు తేల్చారు. దీంతో ఏపీకి అదనపు నీటి విడుదలకు తెలంగాణ ఒప్పుకోదనే భావన వ్యక్తమైంది. అయినా ఏపీ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన తెలంగాణ.. 4 టీఎంసీల నీటి విడుదలకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో నీటి విడుదలకు సంబంధించి మంగళవారం కృష్ణా బోర్డు ఉత్తర్వులు విడుదల చేసింది. ‘ఏపీ విజ్ఞప్తికి తెలంగాణ అంగీకరించిన నేపథ్యంలో శ్రీశైలం నుంచి 4.2 టీఎంసీలు (0.2 టీఎంసీల సరఫరా నష్టంతో కలిపి) విడుదల చేయాలి. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 1.2 టీఎంసీలను శ్రీశైలం నుంచి విడుదల చేయాలి. విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే విధంగా నీటి విడుదల జరగాలి. విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు చెరి సగం వినియోగించుకోవాలి..’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. బోర్డు చైర్మన్ పండిట్ పదవీ విరమణ కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్.కె.జి.పండిట్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన అధ్యక్షతన చివరిగా బుధవారం బోర్డు సమావేశం జరగనుంది. పండిట్ పదవీ విరమణ తర్వాత గోదావరి బోర్డు చైర్మన్ రాంశరణ్కు కృష్ణా బోర్డు బాధ్యతలను అదనంగా అప్పగించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. -
నేనే వాదిస్తా!
కృష్ణా జలాల పంపిణీపై అధికారులతో సీఎం కేసీఆర్ నదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని వాయిదా వేయించండి శ్రీశెలం, సాగర్‌లలో పూడికతో నిల్వలు తగ్గాయి ఆ నీటిని పాలమూరు ఎత్తిపోతలకు మళ్లించేలా బోర్డుకు ప్రతిపాదిద్దాం అన్ని విషయాలు బోర్డుకు తానే వివరిస్తానన్న ముఖ్యమంత్రి భేటీ వాయిదాకు అంగీకరించిన కృష్ణా బోర్డు ‘సాక్షి’ ప్రత్యేకం హైదరాబాద్ కృష్ణా జలాల పంపిణీ వివాద పరిష్కారం, వాస్తవ నీటి లెక్కలను తేల్చేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. కృష్ణాలో వాస్తవ కేటాయింపులు, వినియోగం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టం, కొత్త ప్రాజెక్టులకు వరద నీటి మళ్లింపు తదితర అంశాలను బోర్డుకు ముఖ్యమంత్రే వివరించనున్నారు. ఈ బోర్డు సమావేశం శుక్రవారం (8వ తేదీన) ఢిల్లీలో జరగాల్సి ఉన్న దృష్ట్యా... తాను హాజరయ్యేందుకు వీలుగా మరో రోజుకు సమావేశాన్ని వాయిదా వేయించాలని సాగునీటి పారుదల అధికారులకు కేసీఆర్ సూచించారు. దీనిపై వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సమావేశాన్ని వాయిదా వేయాలని బోర్డును కోరగా.. వారు అంగీకరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కృష్ణాబోర్డు భేటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే స్వయంగా హాజరవుతారా? అన్న అంశం ఆసక్తి రేపుతోంది. ఆ నీటిని పాలమూరుకు మళ్లిద్దాం.. కృష్ణా బేసిన్లో చేపట్టాలని భావిస్తున్న పాల మూరు, నక్కలగండి ప్రాజెక్టులపై మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. అనుమతులు లేకుండానే పాలమూరు ఎత్తిపోతలను చేపడుతున్నారంటూ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసేందుకు ఏపీ సిద్ధమవుతోందని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దానిపై స్పందించిన సీఎం.. పాలమూరు ఎత్తిపోతల పథకం వాస్తవానికి కొత్తది కాదని, గతంలో నీటి కేటాయింపులు కలిగిన భీమా ప్రాజెక్టేనని... హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడే గుల్బర్గా, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 4.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు 100 టీఎంసీల సామర్థ్యంతో ఆ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని పేర్కొన్నట్లు తెలిసింది. దీనికి గతంలోనే అనుమతులు ఉన్నందున కొత్తగా అనుమతులు అవసరం లేదని అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే వివాదం సృష్టించే ఉద్దేశంతో ఏపీ ఉందని అధికారులు సీఎంతో చెప్పినట్లు తెలిసింది. ఇక శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో పూడిక అంశాన్ని సీఎం ప్రస్తావించినట్లుగా విశ్వసనీయ సమాచారం. ‘‘సాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 408 టీఎంసీలు అయితే అదిప్పుడు పూడిక కారణంగా 312 టీఎంసీలకు తగ్గింది. శ్రీశైలంలో కూడా 312 టీఎంసీల సామర్థ్యం 215 టీఎంసీలకు తగ్గింది. బిందలో మట్టిపోస్తే నీరంతా బయటకు పోయినట్లు, ప్రాజెక్టుల నీరంతా వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఒకవేళ పాలమూరుకు ఏపీ అభ్యంతరం చెబితే.. ఆ రెండు ప్రాజెక్టుల్లో పూడికతో తగ్గే నీటిని పాలమూరుకు మళ్లిద్దామని బోర్డుకు ప్రాతిపాదిద్దాం. దీన్నెవరైనా కాదంటారా? అవసరమైతే బోర్డు ముందుకు నేనే వస్తా. బోర్డు సమావేశాన్ని మరో రోజుకు వాయిదా వేయించండి. అన్ని విషయాలు నేను వారి దృష్టికి తీసుకెళాతా..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బోర్డు అనుమతివ్వాలా..? సీఎం సూచన మేరకు అధికారులు వెంటనే సమావేశాన్ని వాయిదా వేయాలని కృష్ణా బోర్డును కోరినట్లు తెలిసింది. బోర్డు కూడా దీనికి అంగీకరిస్తూ సమావేశాన్ని వాయిదా వేసింది. అయితే తదుపరి సమావేశంపై మాత్రం స్పష్టత రాలేదు. అయితే బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి ఏ హోదాలో హాజరవుతారు, దానికి ముందుగానే బోర్డు అనుమతి తీసుకోవాలా? అన్నది చర్చనీయాంశంగా మారింది. జూలైలో తెలంగాణ హరిత హారం... జూలైలో తెలంగాణ హరిత హారం కార్యక్రమం ప్రారంభిస్తామని, అందులో భాగంగా నగరంలో 3 కోట్ల మొక్కలు నాటాల్సి ఉందని సీఎం చెప్పారు. దీనికోసం కూడా బస్తీల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ కార్యక్రమం అమలుకు సంబంధించి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అస్కి డెరైక్టర్ జనరల్ రవికాంత్ ఘనవ్యర్థాల నిర్వహణపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉపముఖ్యమంత్రులు మహమూద్‌అలీ, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.