2 టీఎంసీలు తెలంగాణకు, 4.5 టీఎంసీలు ఏపీకి
ఆమోదం తెలిపిన కృష్ణా బోర్డు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 6.5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అంగీకరించింది. ఇందులో 2 టీఎంసీల నీటిని తెలంగాణ, మరో 4.5 టీఎంసీలను ఏపీ తమ తాగునీటి అవసరాలకు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని బుధవారం ఇరు రాష్ట్రాల అధికారులకు లేఖల ద్వారా తెలియజేసింది. రాష్ట్ర తాగునీటి అవసరాల దృష్ట్యా జూన్ వరకు 10 టీఎంసీలు అవసరమని తెలంగాణ కృష్ణా బోర్డుకు విజ్ఞప్తి చేసింది.
ఇందులో 4 టీఎంసీలు సాగర్ ఎడమ కాల్వకు, 1.5 టీఎంసీ ఏఎంఆర్‌పీకి, 4.5 టీఎంసీలు హైదరాబాద్ తాగు నీటికి కావాలని కోరింది. కాగా ఏపీ సైతం 10 టీఎంసీలు అవసరమని, అందులో 2టీఎంసీలు కృష్ణా డెల్టాకు, 6 టీఎంసీలు సాగర్ కుడి కాల్వకు, 2 టీఎంసీలు ఎడమ కాల్వకు ఇవ్వాలని కోరింది. ఈ విజ్ఞప్తిని పరిశీలించేందుకు బోర్డు తాత్కాలిక చైర్మన్ రామ్‌శరణ్, సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తాలు కేంద్ర జల సంఘం కార్యాలయంలో ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వరావులతో సమావేశమయ్యారు.
ఇప్పటివరకు ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి పరిమాణం, ప్రస్తుతం శ్రీశైలంలో లభ్యత నీటిపైనా చర్చించారు. మొత్తంగా 821.6 అడుగుల వద్ద 42.02 టీఎంసీల నీరు ఉందని, ఇందులో 790 అడుగుల వరకు 17 టీఎంసీలు వినియోగార్హమైన నీరుందని తేల్చారు. ఈ నీటిని ఇప్పటికిప్పుడు రెండు రాష్ట్రాలు కోరిన మేరకు ఇవ్వడం కుదర దని, ప్రస్తుత నెల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏపీకి 4.5 టీఎంసీలు, తెలంగాణకు 2 టీఎంసీలు విడుదలకు ఆమోదిస్తామని బోర్డు స్పష్టం చేసింది. తర్వాత మరోమారు సమావేశమై అవసరాలు, పంపిణీపై చర్చిద్దామని తెలిపింది. దీనికి ఇరు రాష్ట్రాలు సమ్మతి తెలుపడంతో 6.5 టీఎంసీల నీటి విడుదలకు ఆమోదిస్తూ, ఆర్‌కే గుప్తా ఇరు రాష్ట్రాలకు లేఖలు పంపారు.
శ్రీశైలం నుంచి 6.5 టీఎంసీల నీరు
Published Thu, Mar 3 2016 3:25 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
Advertisement
Advertisement