విజయవాడ, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాన్ని అడ్డుకునేందుకు అన్ని వర్గాలూ ఆందోళనలోకి రావాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను శనివారం ఒక ప్రకటనలో కోరారు. ముఖ్యంగా సాగు, తాగు నీరు విషయంలో సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని, సమైక్యాంధ్రను కాపాడుకునేందుకు రైతులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఏపీ ఎన్‌జీవోలు హైదరాబాద్‌లో సభను విజయవంతం చేసినందుకు ఆయన వారికి అభినందనలు తెలిపారు. ఇదే తరహాలో అన్ని రంగాల వారు రోడ్డెక్కి సభల ద్వారా ఆయా రంగాలకు జరగబోయే నష్టాలను ప్రజలకు వివరించి చైతన్యపర్చాలని కోరారు. కృష్ణా డెల్టాకు ప్రథమ వినియోగ హక్కుగా జూన్‌లో కాల్వలకు నీటిని విడుదల చేసే సంప్రదాయం ఉందన్నారు.
ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్సార్ సీఎంలుగా ఉండగా నాగార్జునసాగర్‌లో ఏ నీటిమట్టం ఉన్నా జూలై ఒకటి నాటికి ముందుగా డెల్టాకు మాత్రమే నీటిని విడుదల చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు సీఎంగా ఉండగా తెలంగాణకు చెందిన కడియం శ్రీహరి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో డెల్టాకు సెప్టెంబర్ 15 వరకు నీటిని విడుదల చేయకుండా జూరాల ప్రాజెక్టు కింద ముందుగా సాగుకు నీటిని విడుదల చేశారని చెప్పారు. ఇది డెల్టా చరిత్రలో ప్రథమ వినియోగపు హక్కును కాలరాసిన మొట్టమొదటి చర్య అని తెలిపారు.
ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసిన మండవ వెంకటేశ్వరరావు, సుదర్శన్‌రెడ్డి వంటివారు కూడా ఇదే పనిచేశారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే డెల్టా శాశ్వతంగా బీడుబారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాగుకు కూడా నీరు లేక ప్రజలు మొత్తం వలసపోవల్సి వస్తుందన్నారు. ఫలితంగా జల యుద్ధాలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అందుకే అన్నివర్గాల వారూ ఆందోళనలు ఉధృతం చేయాలన్నారు.
రైతులు ఉద్యమించాలి : భాను
Published Sun, Sep 8 2013 2:13 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement