హైదరాబాద్: కృష్ణా డెల్టాకు మరో వారం రోజులపాటు మూడున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డు మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ విడుదల చేయాలని కోరిన 10 టీఎంసీల నీటిలో తొలివిడతగా మూడున్నర టీఎం సీలు విడుదల చేశారు. అయితే ఈ నీరు సరిపోదని, ఎక్కువ నీరు ఆవిరి రూపంలో, ఎండిపోయిన నదీ ప్రవాహంలో ఇంకిపోవడం వల్ల వృథా అయిందని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు లేఖ రాసింది. దీంతో మరో మూడున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం మరో వారం రోజులపాటు రోజుకు 6వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు విడుదల చేస్తారు. ఈ మేరకు బోర్టు సభ్య కార్యదర్శి ఆర్.కె.గుప్తా..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు లేఖ రాశారు. అయితే కృష్ణాబోర్డు నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నీటి విడుదల పొడిగింపునకు సంబంధించి కనీసం తమతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర జల సంఘం చైర్మన్, కృష్ణాబోర్డు తాత్కాలిక అధ్యక్షుడు ఏబీ పాండ్యాకు ఫోన్ చేసి నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలు పట్టించుకోకుండా నీటిని విడుదల చేయడమేమిటని ప్రశ్నించారు. ఇలా చేయడం సరికాదని పేర్కొన్నారు. కాగా, కృష్ణాబోర్డు ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ లేఖ రాయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
మరో వారంపాటు కృష్ణా డెల్టాకు నీటి విడుదల
Published Wed, Jul 2 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM
Advertisement
Advertisement