ఈ నీరు.. శివారుకు చేరేనా! దాహార్తి తీరేనా?
పులిచింతలకు 2.8 టీఎంసీలు చేరిక
ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న నీటిమట్టం
కాల్వలకు కొద్దికొద్దిగా నీటి విడుదల
నాలుగు రోజుల్లో చెరువులకు తాగునీరు
శివారుకు చేరికపై అనుమానాలు
సాక్షి, విజయవాడ : కృష్ణా డెల్టాలో చెరువులు అడుగంటడంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. నాలుగు టీఎంసీలు విడుదల చేస్తామని అంగీకరించిన కృష్ణా యాజమాన్య బోర్డు ఆ మేరకు శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తోంది. ఆ నీరు ఇప్పుడిప్పుడే ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. ఇరిగేషన్ అధికారులు ఆ నీటిని కొద్దికొద్దిగా కాలువలకు వదులుతున్నారు. చెరువులకు నీరందే సరికి మరో నాలుగైదు రోజులు పడుతుందని చెబుతున్నారు. అయితే ఈ నీటిలో శివారుకు ఎంత చేరుతుందనే అనుమానాలు ఆ ప్రాంతాల్లో వ్యక్తమవుతున్నాయి. పులిచింతలలో, ప్రకాశం బ్యారేజీలో నిల్వలు పోను విడుదల చేసే నీటిలో చెత్తా చెదారం వల్ల కొంత వృథాగా పోతుందని, మరికొంత ఇంకిపోతుందని చెబుతున్నారు. మిగిలిన నీటిలో అక్రమ మళ్లింపులు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పులిచింతల వద్దకు 2.8 టీఎంసీల నీరు...
ఎగువ నుంచి విడుదల చేసిన నీరు శనివారానికి పులిచింతల వద్దకు 2.8 టీఎంసీలు చేరింది. ఇందులో 1.2 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి వదిలారు. ఇప్పటివరకు ప్రకాశం బ్యారేజీ వద్ద 8.2 అడుగుల నీరు ఉండగా, ప్రస్తుతం వస్తున్న నీటితో 10.6 అడుగులకు చేరింది. బ్యారేజీ వద్ద 12 అడుగుల మేరకు నీటిని నిల్వ చేసి మిగిలినది కాల్వల ద్వారా చెరువులకు వదిలిపెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీలో కొంత నీరు చేరడంతో కొద్దికొద్దిగా కాల్వలకు వదులుతున్నారు.
కాల్వలకు 3,212 క్యూసెక్కుల నీరు...
కృష్ణాడెల్టా పరిధిలోని కాల్వలకు 3,212 క్యూసెక్కుల నీరు వదులుతున్నామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. రైవస్ కాల్వకు 503 క్యూసెక్కులు, ఏలూరు కాల్వకు 511, బందరు కాల్వలకు 152, అవనిగడ్డ, నాగాయలంక వైపు వెళ్లే కేఈబీ కాల్వకు 500, తెనాలి వైపు వెళ్లే కేడబ్ల్యూ కాల్వకు 1,516 , గుంటూరు చానల్‌కు 30 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. కాల్వల ద్వారా వదులుతున్న నీటితో జిల్లాలోని 370 చెరువులకు, బందరు, గుడివాడ మున్సిపాలిటీలకు నీరు ఇవ్వనున్నారు. పులిచింతల నుంచి వస్తున్న నీటి నుంచే విజయవాడ కార్పొరేషన్‌తో పాటు, ఎన్‌టీటీపీఎస్ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. విడుదల చేసిన నీటిలో దాదాపు ఐదువేల క్యూసెక్కుల మేరకు కాలువల్లో పేరుకుపోయిన మురుగు, చెత్తాచెదారం పారదోలేందుకు పోతుందని అధికారులు చెబుతున్నారు. నీరంతా వృథా కాకుండా ఉండటం కోసం తొలుత బందరు కాల్వకు 500 క్యూసెక్కులు వదిలిన అధికారులు.. ప్రస్తుతం 152 క్యూసెక్కులకు తగ్గించారు.