prakasam byareji
-
‘కృష్ణా’పై మీ వాదన అంగీకరించం
తెలంగాణకు మరోసారి బోర్డు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటిని 37:63 నిష్పత్తిన పంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనను అంగీకరించేది లేదని కృష్ణా బోర్డు మరోమారు స్పష్టం చేసింది. శ్రీశైలం, సాగర్, జూరాల, తుంగభద్ర డ్యామ్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలతో మైనర్ ఇరిగేషన్ కింద ఉన్న మొత్తం కేటాయింపులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే 37:63 నిష్పత్తిన ఇరు రాష్ట్రాలకు వాటా దక్కుతుందని తెలిపింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం లభ్యతగా ఉన్న జలాల్లో 25 టీఎంసీలు తమకు కేటాయించాలని, పట్టిసీమ కింద ఏపీ చేసిన వినియోగాన్ని, మైనర్ ఇరిగేషన్ కింద తాము చేసిన నీటి వినియోగాన్ని లెక్కలోకి తీసుకున్నా తమకు అధిక వాటా దక్కుతుందని తెలంగాణ రాసిన లేఖపై బోర్డు వివరణ ఇచ్చింది. పులిచింతలలో కనీస నీటిమట్టం ఉంచండి.. పులిచింతల ఫోర్‌షోర్ నీటిపై ఆధారపడి 8 ఎత్తిపోతల పథకాల కింద తెలంగాణ రైతులు వేసిన పంటలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు సూచించింది. ఈ మేరకు మంగళవారం ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. -
జలరవాణాకు టెండర్లు
► 66 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్ పనులు ► రెండు దశల్లో చేయాలని నిర్ణయం ► రాజధాని నిర్మాణానికి ఉపయుక్తం సాక్షి, విజయవాడ : ప్రకాశం బ్యారేజీ ఎగువన, పులిచింతల ప్రాజెక్టు దిగువన జల రవాణాకు టెండర్లు ఖరారు చేసే ప్రక్రియకు ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) అధికారులు చర్యలు చేపట్టారు. కాకినాడ నుంచి పాండిచేరి వరకు జలరవాణాకు కావాల్సిన భూసేకరణలో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ఈ దిశగా ఈ ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణానదిలో రెండు దశల్లో డ్రెడ్జింగ్ చేసేందుకు ఇటీవల టెండర్లు పిలిచారు. మే 16లోగా టెండర్లు దాఖలు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. ఏడాదంతా సమృద్ధిగా నీరు కాకినాడ నుంచి పాండిచేరి వరకు జల రవాణా చేయాలంటే కాల్వల్లోనూ నీరు ఉండాలి. పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజీ ఎగువన 365 రోజులు నీరు సమృద్ధిగా ఉండటంతో ఇక్కడ పనులు ప్రారంభిస్తున్నారు. నేవిగేషన్ పనులతో పాటు రేవులు నిర్మాణం చేపట్టి త్వరలోనే జల రవాణా ప్రారంభించాలని భావిస్తున్నారు. రాజధాని పనులు ప్రారంభమైతే జలరవాణా ఎంతోగానో ఉపయోగ పడుతుంది. రోడ్డు రవాణాతో పోల్చితే నాలుగో వంతు రేటు జల రవాణాకు ఖర్చవుతుంది. జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అక్కడ నుంచి రాజధాని ప్రాంతానికి సిమెంట్‌ను రోడ్డు మార్గంలో కాకుండా జలరవాణా ద్వారా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పర్యావరణ కాలుష్యంతోపాటు ఖర్చులు తగ్గుతాయి. జాతీయ రహదారి ఇక్కడకు దగ్గరగా ఉండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ఇతర నిర్మాణ పరికరాలు కార్గొ బోట్ల ద్వారా తుళ్లూరు చేర్చే అవకాశం ఉంటుంది. రాజధానిలో భారీ నిర్మాణాలు ప్రారంభమైనప్పుడు గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, పెర్రి తదితర నగర శివారు గ్రామాల నుంచి వందల సంఖ్యలో కూలీలు వెళ్లాలి. వీరిని కృష్ణానదిలో పాసింజర్ బోట్ల ద్వారా తుళ్లూరు ప్రాంతానికి చేర్చవచ్చు. దీంతో సమయం కలిసి రావడంతోపాటు జలరవాణా ద్వారా ఆదాయం సమకూరుతుంది. డ్రెడ్జింగ్‌తో వచ్చే ఇసుక రాజధాని నిర్మాణానికి వినియోగం విజయవాడ నుంచి పులిచింతల వరకు 83 కిలోమీటర్లు కృష్ణానది విస్తరించి ఉంది. ఇందులో కొంత భాగం తెలంగాణలో ఉన్నందున విజయవాడ సమీపంలోని హరిచంద్రాపురం నుంచి ముత్యాల వరకు 66 కిలోమీటర్ల మేర జల రవాణాకు కావాల్సిన డ్రెడ్జింగ్ పనులు రెండు దశల్లో చేపట్టనున్నారు. హరిచంద్రాపురం నుంచి చామర్రు వరకు 37 కిలోమీటర్ల మేర పూడిక తీసేందుకు రూ. 35.91 కోట్లు వెచ్చించనున్నారు. చామర్రు నుంచి ముత్యాల వరకు 29 కిలోమీమీటర్ల మేర రూ. 33.85 కోట్లతో పూడిక తీయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్లు పిలిచారు. డ్రెడ్జింగ్‌లో వచ్చే ఇసుకను రాజధాని నిర్మాణానికి ఉపయోగిస్తారు. దీంతో కృష్ణానదిలో నీటి నిల్వ పరిమాణం పెరుగుతుంది. తక్కువ నీటిలోనూ బోట్లు ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని జలవనరుల శాఖాధికారులు చెబుతున్నారు. -
ఈ నీళ్లు ఏ మూలకు?
సాగర్ నుంచి ఇప్పటివరకు 3.68 టీఎంసీలు విడుదల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెరువులను చేరని తాగునీరు సాక్షి, విజయవాడ బ్యూరో :కృష్ణా, గుంటూరు జిల్లాలకు తాగునీటి సరఫరా చేసే విషయంలో జలవనరులు, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తాగు నీటి కోసం కృష్ణాడెల్టాకు కేటాయించిన 4 టీఎంసీలు ప్రజల అవసరాలకు సరిపోవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్న నీరు కాల్వల్లో ప్రవహిస్తుందేగానీ, చెరువులకు చేరడం లేదు. కాల్వల విడుదల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అతి తక్కువ పరిమాణంలో నీటిని వదలడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. నేడో రేపో సాగర్ నుంచి నీటి విడుదల నిలిపి వేయనున్నప్పటికీ, ఇంకా 10 శాతం చెరువులు కూడా నిండలేదు. తాగునీటి అవసరాలకు 4 టీఎంసీలు కృష్ణాడెల్టా పరిధిలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న 480 మంచినీటి చెరువులను నింపితే గానీ మార్చి నుంచి ఎదురయ్యే తాగునీటి ఎద్దడి పరిష్కారం కాదు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 4 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం కృష్ణాడెల్టాకు మళ్లించాల్సి ఉంది. ఇందులో భాగంగా గత శుక్రవారం నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటి విడుదల జరుగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 10 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఇక్కడి నుంచి కృష్ణా తూర్పు, పశ్చిమ కాల్వలకు 4,981 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గుంటూరు చానల్‌కు మరో 43 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచి అటు తూర్పు, ఇటు పశ్చిమ డెల్టా కాల్వలకు నీటి విడుదల జరుగుతున్నా తాగునీటి చెరువులు 10 శాతం కూడా నిండలేదు. తూర్పు, పశ్చిమ వైపు ఉన్న రెండు ప్రధాన కాల్వలకూ కనీసం 8 వేల క్యూసెక్కులు వదిలితేనే కాల్వ దిగువ వరకు వేగంగా ప్రవహించే వీలుంటుంది. 5 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న రైవస్, ఏలూరు కాల్వలకు 1000, 500 క్యూసెక్కుల చొప్నున విడుదల చేయడంతో మూడు రోజులుగా నీళ్లు ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. ఇంకా రెండ్రోజులైతేనే చెరువులను చేరతాయి. పులిచింతలలో 1.20 టీఎంసీలు... నాగార్జునసాగర్ నుంచి విడుదల చేస్తున్న తాగునీటిలో 1.20 టీఎంసీలను పులిచింతల రిజర్వాయర్‌లో నిల్వ చేస్తున్నారు. మిగతా నీటిని మాత్రమే కిందకు విడుదల చేస్తున్నారు. ఈ నీటినే బ్యారేజీ అధికారులు రెండు జిల్లాల తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, పెదకాకాని మండలాల్లోని 100కు పైగా చెరువులకు తాగునీటి అవసరం ఉంది. కేటాయించిన 4 టీఎంసీల్లో ఇప్పటి వరకు 3.68 టీఎంసీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా 0.32 టీఎంసీలు మాత్రమే విడుదల చేయాల్సి ఉంది. ఉన్న నీరు సరిపోకపోతే పులిచింతల నీటిని వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. నీటిని కేవలం తాగు అవసరాలకే ఉపయోగించుకోవాలని, పంటల సాగు, చేపల చెరువుల కోసం వాడకూడదని విజయవాడ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ వైఎస్ సుధాకర్‌రావు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఈ నీరు.. శివారుకు చేరేనా! దాహార్తి తీరేనా?
పులిచింతలకు 2.8 టీఎంసీలు చేరిక ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న నీటిమట్టం కాల్వలకు కొద్దికొద్దిగా నీటి విడుదల నాలుగు రోజుల్లో చెరువులకు తాగునీరు శివారుకు చేరికపై అనుమానాలు సాక్షి, విజయవాడ : కృష్ణా డెల్టాలో చెరువులు అడుగంటడంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. నాలుగు టీఎంసీలు విడుదల చేస్తామని అంగీకరించిన కృష్ణా యాజమాన్య బోర్డు ఆ మేరకు శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తోంది. ఆ నీరు ఇప్పుడిప్పుడే ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. ఇరిగేషన్ అధికారులు ఆ నీటిని కొద్దికొద్దిగా కాలువలకు వదులుతున్నారు. చెరువులకు నీరందే సరికి మరో నాలుగైదు రోజులు పడుతుందని చెబుతున్నారు. అయితే ఈ నీటిలో శివారుకు ఎంత చేరుతుందనే అనుమానాలు ఆ ప్రాంతాల్లో వ్యక్తమవుతున్నాయి. పులిచింతలలో, ప్రకాశం బ్యారేజీలో నిల్వలు పోను విడుదల చేసే నీటిలో చెత్తా చెదారం వల్ల కొంత వృథాగా పోతుందని, మరికొంత ఇంకిపోతుందని చెబుతున్నారు. మిగిలిన నీటిలో అక్రమ మళ్లింపులు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులిచింతల వద్దకు 2.8 టీఎంసీల నీరు... ఎగువ నుంచి విడుదల చేసిన నీరు శనివారానికి పులిచింతల వద్దకు 2.8 టీఎంసీలు చేరింది. ఇందులో 1.2 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి వదిలారు. ఇప్పటివరకు ప్రకాశం బ్యారేజీ వద్ద 8.2 అడుగుల నీరు ఉండగా, ప్రస్తుతం వస్తున్న నీటితో 10.6 అడుగులకు చేరింది. బ్యారేజీ వద్ద 12 అడుగుల మేరకు నీటిని నిల్వ చేసి మిగిలినది కాల్వల ద్వారా చెరువులకు వదిలిపెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీలో కొంత నీరు చేరడంతో కొద్దికొద్దిగా కాల్వలకు వదులుతున్నారు. కాల్వలకు 3,212 క్యూసెక్కుల నీరు... కృష్ణాడెల్టా పరిధిలోని కాల్వలకు 3,212 క్యూసెక్కుల నీరు వదులుతున్నామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. రైవస్ కాల్వకు 503 క్యూసెక్కులు, ఏలూరు కాల్వకు 511, బందరు కాల్వలకు 152, అవనిగడ్డ, నాగాయలంక వైపు వెళ్లే కేఈబీ కాల్వకు 500, తెనాలి వైపు వెళ్లే కేడబ్ల్యూ కాల్వకు 1,516 , గుంటూరు చానల్‌కు 30 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. కాల్వల ద్వారా వదులుతున్న నీటితో జిల్లాలోని 370 చెరువులకు, బందరు, గుడివాడ మున్సిపాలిటీలకు నీరు ఇవ్వనున్నారు. పులిచింతల నుంచి వస్తున్న నీటి నుంచే విజయవాడ కార్పొరేషన్‌తో పాటు, ఎన్టీటీపీఎస్ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. విడుదల చేసిన నీటిలో దాదాపు ఐదువేల క్యూసెక్కుల మేరకు కాలువల్లో పేరుకుపోయిన మురుగు, చెత్తాచెదారం పారదోలేందుకు పోతుందని అధికారులు చెబుతున్నారు. నీరంతా వృథా కాకుండా ఉండటం కోసం తొలుత బందరు కాల్వకు 500 క్యూసెక్కులు వదిలిన అధికారులు.. ప్రస్తుతం 152 క్యూసెక్కులకు తగ్గించారు. -
బ్యారేజీకి దిగువ కాసుల వేట
ఇసుక రీచ్‌ల వేలం నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దిగువ రీచ్‌ల కోసం వ్యాపారులు, టీడీపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రీచ్‌ల సమీప గ్రామస్తులను కలసి వివరాలు సేకరించారు. రవాణా, కార్మికుల సమస్యలు ఏమైనా ఉన్నాయా వంటి విషయాలపై ఆరా తీశారు. గుంటూరు : రాష్ట్ర గనుల శాఖ మంత్రి పీతల సుజాత ఆదేశాల మేరకు బుధవారం జిల్లాలోని 11 ఇసుక రీచ్‌లకు తొలిదశలో నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు జరిగాయి. అయితే అనివార్య కారణాల వల్ల నోటిఫికేషన్ విడుదల ఒక రోజు ఆలస్యమవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ 11 రీచ్‌ల్లో బ్యారేజీకి దిగువ భాగంలోని వల్లభాపురం, గుండిమెడ, జువ్వలపాలెం, పోతార్లంక రీచ్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక్కడ నాణ్యమైన ఇసుక లభ్యం కావడంతోపాటు రీచ్‌లోకి నేరుగా లారీలు వెళ్లడానికి రహదారి సౌకర్యం ఉంది. దీంతో వ్యాపారులు ఈ రీచ్‌లపై దృష్టి కేంద్రీకరించారు. భవన నిర్మాణాల్లో ప్లాస్టింగ్‌కు ఈ ఇసుకను ఎక్కువగా వినియోగిస్తారు. హైదరాబాద్‌తోపాటు భవన నిర్మాణాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ఈ ఇసుకకు డిమాండ్ ఉంది. ఖర్చు తక్కువ..లాభాలు ఎక్కువ... వేలంలో ఎక్కువ మొత్తాన్ని కేటాయించినా తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఇసుక అమ్మ డానికి అవకాశాలు ఉండడంతో వ్యాపారులు వీటిపైనే ఆసక్తి చూపుతున్నారు. బుధ వారం కొంత మంది వ్యాపారులు, టీడీపీ నేతల అనుచరులు ఈ రీచ్‌లకు సమీపంలోని గ్రామాల్లో కొందరు వ్యక్తులను కలసి వివరాలు సేకరించారు. రవాణా, ఇతర కార్మికుల సమస్యలేమైనా ఉన్నాయా వంటి వివరాలు తెలుసుకున్నారు. ఈ రీచ్‌లకు యంత్రపరికరాలు అవసరం ఇదిలాఉంటే, ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగంలోని ఏడు రీచ్‌ల నిర్వహణకు వేలంపాటదారులు యంత్ర పరికరాలను సమకూర్చుకోవాల్సి ఉంది. ముఖ్యంగా నది అడుగు భాగం నుంచి ఇసుక తీయడానికి మరపడవులు, ఆయిల్ ఇంజన్లు, నాటు పడవల అవసరం ఉంది. ఈ సరంజామా ఉన్నవారే ఇక్కడి రీచ్‌లను సులభంగా నిర్వహించగలగుతారు. వీటి కొనుగోలుకు లక్షల్లో పెట్టుబడి కావాలి. దీనికితోడు నది నీటిలోంచి తీసే ఇసుక లో కొంత మట్టి కలిసే అవకాశం ఉండడంతో కొనుగోలుదారులు ఈ ఇసుక పట్ల అంత ఆసక్తి చూపరు. దీంతో ఈ రీచ్‌లకు అనుకున్న స్థాయిలో డిమాండ్ ఉండదని వ్యాపారులు భావిస్తున్నారు. అనుభవం ఉన్న వ్యక్తులతో భాగస్వామ్యం గతంలో ఈ రీచ్‌ల నిర్వహణలో అనుభవం కలిగిన వ్యక్తులు, వారి వద్ద అందుబాటులో ఉన్న సరంజామాను పరిశీలించి వారిని భాగస్వాములుగా చేసుకునేందుకు వ్యాపారులు, టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇసుకను నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి నది పక్కనే అనువైన స్టాక్ పాయింట్లు ఉండాలి. కార్మికులు అందుబాటులో ఉండాలి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొందరు వ్యాపారులు ఈ రీచ్‌ల నిర్వహణలో అనుభవం ఉన్న వ్యక్తులతో బుధవారం సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో సరంజామా, కార్మికులు అందుబాటులో ఉన్న వ్యాపారులు కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెడుతున్న టీడీపీ నేతల నుంచి ఎక్కువ వాటానే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గురువారం నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఈ రంగంలో అనుభవం కలిగిన వ్యాపారులంతా సమావేశాలు, సంప్రదింపుల్లో మునిగితేలుతున్నారు.