జలరవాణాకు టెండర్లు | Water transport tenders to Capital structure | Sakshi
Sakshi News home page

జలరవాణాకు టెండర్లు

Published Thu, Apr 21 2016 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

జలరవాణాకు టెండర్లు

జలరవాణాకు టెండర్లు

66 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్ పనులు
రెండు దశల్లో చేయాలని నిర్ణయం
రాజధాని నిర్మాణానికి ఉపయుక్తం

 
సాక్షి, విజయవాడ : ప్రకాశం బ్యారేజీ ఎగువన, పులిచింతల ప్రాజెక్టు దిగువన జల రవాణాకు టెండర్లు ఖరారు చేసే ప్రక్రియకు  ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) అధికారులు చర్యలు చేపట్టారు. కాకినాడ నుంచి పాండిచేరి వరకు జలరవాణాకు కావాల్సిన భూసేకరణలో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ఈ దిశగా ఈ ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణానదిలో రెండు దశల్లో డ్రెడ్జింగ్ చేసేందుకు ఇటీవల టెండర్లు పిలిచారు. మే 16లోగా టెండర్లు దాఖలు చేసుకునేందుకు గడువు ఇచ్చారు.


 ఏడాదంతా సమృద్ధిగా నీరు
 కాకినాడ నుంచి పాండిచేరి వరకు జల రవాణా చేయాలంటే కాల్వల్లోనూ నీరు ఉండాలి. పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజీ ఎగువన 365 రోజులు నీరు సమృద్ధిగా ఉండటంతో ఇక్కడ పనులు ప్రారంభిస్తున్నారు. నేవిగేషన్ పనులతో పాటు రేవులు నిర్మాణం చేపట్టి త్వరలోనే జల రవాణా ప్రారంభించాలని భావిస్తున్నారు. రాజధాని పనులు ప్రారంభమైతే జలరవాణా ఎంతోగానో ఉపయోగ పడుతుంది. రోడ్డు రవాణాతో పోల్చితే నాలుగో వంతు రేటు జల రవాణాకు ఖర్చవుతుంది. జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అక్కడ నుంచి రాజధాని ప్రాంతానికి సిమెంట్‌ను రోడ్డు మార్గంలో కాకుండా జలరవాణా ద్వారా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పర్యావరణ కాలుష్యంతోపాటు ఖర్చులు తగ్గుతాయి.

జాతీయ రహదారి ఇక్కడకు దగ్గరగా ఉండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ఇతర నిర్మాణ పరికరాలు కార్గొ బోట్ల ద్వారా తుళ్లూరు చేర్చే అవకాశం ఉంటుంది.  రాజధానిలో భారీ నిర్మాణాలు ప్రారంభమైనప్పుడు గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, పెర్రి తదితర నగర శివారు గ్రామాల నుంచి వందల సంఖ్యలో కూలీలు వెళ్లాలి. వీరిని కృష్ణానదిలో పాసింజర్ బోట్ల ద్వారా తుళ్లూరు ప్రాంతానికి చేర్చవచ్చు. దీంతో సమయం కలిసి రావడంతోపాటు జలరవాణా ద్వారా ఆదాయం సమకూరుతుంది.  
 
 
 డ్రెడ్జింగ్‌తో వచ్చే ఇసుక రాజధాని నిర్మాణానికి వినియోగం
 విజయవాడ నుంచి పులిచింతల వరకు 83 కిలోమీటర్లు కృష్ణానది విస్తరించి ఉంది. ఇందులో కొంత భాగం తెలంగాణలో ఉన్నందున విజయవాడ సమీపంలోని హరిచంద్రాపురం నుంచి ముత్యాల వరకు 66 కిలోమీటర్ల మేర జల రవాణాకు కావాల్సిన డ్రెడ్జింగ్ పనులు రెండు దశల్లో చేపట్టనున్నారు. హరిచంద్రాపురం నుంచి చామర్రు వరకు 37 కిలోమీటర్ల మేర పూడిక తీసేందుకు రూ. 35.91 కోట్లు వెచ్చించనున్నారు. చామర్రు నుంచి ముత్యాల వరకు 29 కిలోమీమీటర్ల మేర రూ. 33.85 కోట్లతో పూడిక తీయనున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్లు పిలిచారు. డ్రెడ్జింగ్‌లో వచ్చే ఇసుకను రాజధాని నిర్మాణానికి ఉపయోగిస్తారు. దీంతో కృష్ణానదిలో నీటి నిల్వ పరిమాణం పెరుగుతుంది. తక్కువ నీటిలోనూ బోట్లు ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని జలవనరుల శాఖాధికారులు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement