‘ఫైబర్‌ గ్రిడ్‌’లో పైసా వసూల్‌ | TDP government to loot Rs 765 crore in the second phase Fiber grid project | Sakshi
Sakshi News home page

‘ఫైబర్‌ గ్రిడ్‌’లో పైసా వసూల్‌

Published Sat, Nov 24 2018 4:12 AM | Last Updated on Sat, Nov 24 2018 8:22 AM

TDP government to loot Rs 765 crore in the second phase Fiber grid project - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో ప్రభుత్వ పెద్దలు పైసలు పిండుకుంటున్నారు. రూ.1,500 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టు తమ అస్మదీయ సంస్థకు తప్ప ఇతరులకు దక్కకుండా పెద్ద స్కెచ్చే వేశారు. మొత్తం ప్రాజెక్టు విలువలో సగం.. అంటే రూ.765 కోట్ల మేర కమీషన్లు కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు రెండో దశ కాంట్రాక్టును ఇతర సంస్థలు దక్కించుకోకుండా ప్రభుత్వ పెద్దలు సాగించిన కుట్రలను గమనిస్తే.. ఇంత నీచానికి ఒడిగడుతారా అని ఛీ కొట్టక తప్పదు. టెండర్‌ అర్హత నిబంధనల్లో 11 సార్లు మార్పులు చేశారు, బిడ్‌లు దాఖలు చేయడానికి ఒక్కటంటే ఒక్కరోజే గడువు ఇచ్చారు. ఇలాంటి చోద్యం ఇంకెక్కడా ఉండదని నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్రంలో 55 వేల కిలోమీటర్ల మేర వేయనున్న ఫైబర్‌ గ్రిడ్‌ రెండో దశ కాంట్రాక్టును ఏకపక్షంగా అస్మదీయ సంస్థకే కట్టబెట్టాలని ప్రభుత్వ పెద్దలు కొన్ని నెలల క్రితమే నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ప్రతిపాదించిన ఆ కాంట్రాక్టును కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ అడ్డుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మొదట షాక్‌ తగిలింది. మరోసారి టెండర్లు పిలవాల్సి వచ్చింది. ఈసారి ముఖ్యనేత సూచనలతో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ పకడ్బందీగా వ్యవహరిం చింది. కేవలం ఒక్కరోజు గడువుతో కాంట్రాక్టును ఏకపక్షంగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. 

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై అక్కసు 
ఫైబర్‌ గ్రిడ్‌ కాంట్రాక్టు కోసం తొలుత 7 సంస్థలు టెక్నికల్, ఫైనాన్షియల్‌ బిడ్‌లు దాఖలు చేశాయి. ఇండియా టెలికాం ఇండస్ట్రీస్‌(ఐటీఐ), టెలికమ్యూనికేషన్స్‌ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్‌ (టీసీఐఎల్‌) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో ఉన్నాయి. దాంతో ప్రభుత్వ పెద్దలు దొంగాట ప్రారంభించారు. ప్రాజెక్టు కాలపరిమితిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించడం ద్వారా ఇతర సంస్థలు తామంతట తామే వెనక్కి వెళ్లేలా చేయాలని భావించారు. టెండర్లు ఖరారు చేసేనాటికి టెలికాం స్టాండర్డ్‌ ఎలిజిబిలిటీ సెంటర్‌(టీఎస్‌ఈసీ) సర్టిఫికెట్‌ సమర్పించకపోతే ఎర్నెస్టు మనీ డిపాజిట్‌(ఈఎండీ) రూ.5 కోట్లు జప్తు చేస్తామన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ జోక్యం చేసుకున్న తర్వాత ఆ సంస్థల టెక్నికల్‌ బిడ్‌లను అనుమతించాల్సి వచ్చింది. కానీ, ప్రభుత్వ పెద్దలు మాత్రం తమ పంతం వీడలేదు 

‘ఒక్క రోజు’ మంత్రాంగం 
ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా టెండర్‌ అర్హత నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ వచ్చారు. ఫైబర్‌ గ్రిడ్‌ రెండో దశ టెండర్ల ప్రక్రియలో ఏకంగా 11 సవరణల ద్వారా 20 అదనపు నిబంధనలను చేర్చడం విస్మయపరుస్తోంది. ఆ సవరణలన్నీ ప్రభుత్వ పెద్దల అస్మదీయ సంస్థలకు అనుకూలంగా ఉండడం గమనార్హం. టెండర్ల దాఖలుకు గడువు తేదీ ఈ ఏడాది నవంబర్‌ 1 కాగా... చివరిదైన 11వ సవరణను పేర్కొంటూ అక్టోబరు 28న టెండర్‌ నిబంధనలను నిర్ణయించారు. ఆ రోజు ఆదివారం కావడంతో అక్టోబరు 29న అధికారికంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి సవరణను అక్టోబరు 30న విడుదల చేశారు. కానీ, సవరించిన నిబంధనలకు అనుగుణంగా బిడ్‌ల దాఖలుకు గడువును పొడిగించకపోవడం గమనార్హం. నవంబరు 1 నాటికి టెండర్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. సాంకేతికంగా మూడు రోజులు గడువు ఉన్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి ఒక్కరోజు మాత్రమే గడువు ఇచ్చారు. దాంతో సవరించిన నిబంధనల మేరకు 4 కన్సార్టియం సంస్థలు బిడ్‌లు దాఖలు చేయలేకపోయాయి. కేవలం మూడు సంస్థలే బిడ్‌లు దాఖలు చేయడం గమనార్హం. ప్రభుత్వ పెద్దలకు బాగా కావాల్సిన ఆ సంస్థలకు ముందే సమాచారం ఉన్నందున ఒక్కరోజులోనే సవరించిన నిబంధనలకు అనుగుణంగా బిడ్‌లు దాఖలు చేయగలిగాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

రెండు డమ్మీ... అస్మదీయ సంస్థకే టెండర్‌! 
టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని చెప్పేందుకు మూడు కన్సార్టియం సంస్థలను అనుమతించారు. కానీ, వాటిలో రెండు సంస్థలు నామమాత్రంగానే పోటీలో ఉన్నాయి. వాటిలో ఓ సంస్థకు రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భారీ కాంట్రాక్టులు కట్టబెట్టారు. మరో సంస్థకు కూడా పలు సాఫ్ట్‌వేర్‌ కాంట్రాక్టులు ఇచ్చారు. ముఖ్యనేత బినామీ సంస్థకు మార్గం సుగమం చేస్తూ ఆ రెండు సంస్థలు ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్‌లో ఎక్కువ ధర కోట్‌ చేసినట్లు తెలుస్తోంది. దాంతో ముఖ్యనేత బినామీగా ఉంటూ ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో చక్రం తిప్పుతున్న ఓ కీలక వ్యక్తి ఆధీనంలోని సంస్థకే ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్‌ కట్టబెట్టడానికి రంగం సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. రూ.1,500 కోట్ల కాంట్రాక్టును మూడు ప్యాకేజీలుగా విభజించి, ఆ సంస్థకు దారాదత్తం చేసేందుకు పన్నిన కుట్ర దాదాపు విజయవంతమైంది. కాగా, ప్రభుత్వ పెద్దల కుతంత్రంపై టెలికమ్యూనికేషన్స్‌ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్‌(టీసీఐఎల్‌) కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 

టెండర్‌ నిబంధనల సవరణలో మతలబు 
ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్‌లో పాల్గొనేందుకు బిడ్‌ దాఖలు చేసే సంస్థలు భారతదేశంలో 24/7 సేవలు అందించే సొంత సర్వీసింగ్‌ సెంటర్, టోల్‌ఫ్రీ సెంటర్‌ ఉండాలి. 100 మంది సొంత సాంకేతిక నిపుణులతో ఈ సెంటర్‌ ఉండాలని నిబంధన విధించారు. కానీ, తరువాత ఆ అర్హత నిబంధనల్లో మార్పులు చేశారు. దీనిప్రకారం.. కనీసం 100 మందితో  24/7 సేవలందించే సర్వీసింగ్‌ సెంటర్, టోల్‌ఫ్రీ సెంటర్‌ ఉండాలి. దాంతోపాటు సొంత రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(ఆర్‌అండ్‌డీ) సెంటర్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఉండాలని షరతు విధించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌అండ్‌డీ సెంటర్‌లు ఉండవు. తద్వారా ఆ సంస్థలను పోటీ నుంచి తప్పించడానికే నిబంధనలను మార్చినట్లు స్పష్టమవుతోంది.

టెండర్‌ దక్కించుకునే సంస్థలు ఏర్పాటు చేయాల్సిన రూటర్ల సామర్థ్యాన్ని కూడా అమాంతంగా పెంచేశారు. మొదట టెండర్లలో రూటర్లు 20 లక్షల ఎంఏసీ  సామర్థ్యంతో 20 లక్షల ఐపీవీ4 యూనికాస్ట్‌ రౌట్లు, 10 లక్షల ఐపీవీ 6 రౌట్లు, 16 వేల మల్టీకాస్ట్‌ రౌట్లు కలిగి ఉండాలని చెప్పారు. కానీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తప్పించేందుకు రూటర్ల సామర్థ్యాన్ని పెంచేశారు. రూటర్లు 40 లక్షల ఎంఏసీ సామర్థ్యంతోపాటు 30 లక్షల ఐపీవీ 4 యూనికాస్ట్‌ రౌట్లు, 15 లక్షల ఐపీవీ 6 రౌట్లు, 50 వేల మల్టీకాస్ట్‌ రౌట్లు కలిగి ఉండాలని నిబంధన విధించడం గమనార్హం. అంతేకాదు రూటర్‌ ఎస్‌ఆర్, ఎస్‌ఆర్‌–టీఈ, ఎస్‌ఆర్‌వీ 6, టిల్ఫా, బీజీపీఎల్‌ఎస్‌ ఉపకరణాలకు అనుగుణంగా ఉండాలని కొత్త నిబంధన విధించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement