పోలవరం, రాజధాని నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపాం | Vijayasai Reddy comments about Capital Structure and Polavaram | Sakshi

అవినీతి జరిగిందనే ఆపాం

Aug 5 2019 4:23 AM | Updated on Aug 5 2019 9:07 AM

Vijayasai Reddy comments about Capital Structure and Polavaram - Sakshi

విశాఖలో మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి. చిత్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, విశాఖపట్నం: అవినీతి జరిగిందనే పోలవరం, రాజధాని నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేశామని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. అభివృద్ధి ఆగిపోయిందని ప్రతిపక్షం వాదించడంలో అర్థం లేదని చెప్పారు. విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ప్రాజెక్టుల్లో 150 శాతం వరకు అంచనాలు పెంచి టెండర్లు వేయించి చంద్రబాబు లబ్ధి పొందారన్నారు.

ఈ తప్పులను సరిదిద్దుతున్నామని, తర్వాత అభివృద్ధి పనులు కొనసాగుతాయన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక లోటు మిగిల్చిందని ధ్వజమెత్తారు. దీన్ని అధిగమించి బడ్జెట్‌లో అన్ని వర్గాల వారి సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిధులు కేటాయించారని గుర్తు చేశారు. అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు, జీవీఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వస్తుందన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. నగరంలో ఉన్న వార్డులను పునఃపరిశీలిస్తామన్నారు. మొదట జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రానున్నాయని, తర్వాత కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు, అనంతరం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పారు. 

పార్టీ ప్రయోజనాలే ముఖ్యం
పార్టీలో మనస్పర్థల కారణంగానే శ్రీకాకుళం జిల్లాలో రెండు, విశాఖ జిల్లాలో నాలుగు స్థానాలు ఓడిపోయామని విజయసాయిరెడ్డి అన్నారు. ఈసారి అటువంటి తప్పులు పునరావృతం కాకూడదని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని వివరించారు. పార్టీ గెలుపునకు అవసరమైనవారు ఏ పార్టీ నుంచి వచ్చినా తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో సమన్వయకర్తలు వద్దని చెప్పినా పార్టీ కోసం తప్పదని స్పష్టం చేశారు. పార్టీలోకి వచ్చే ఇతర పార్టీ నేతల గురించి విచారణ చేపట్టాకే పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఈ నెల 10న ప్రారంభిస్తున్నామన్నారు. పార్టీలో ఏవైనా అసంతృప్తి ఉన్నా.. సమస్యలున్నా ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.

పోస్టల్‌ ద్వారా కూడా సమస్యలు, ఫిర్యాదులు పంపవచ్చన్నారు. కాగా.. విశాఖ మాజీ డిప్యూటీ మేయర్‌ దాడి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లతోపాటు వివిధ పార్టీల నేతలు విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నా«థ్, గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌ రాజ్, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement