సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి కియా మోటార్స్ తరలిపోతుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కియా మోటార్స్ తమిళనాడుకు తరలివెళ్లే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొట్టమొదటిసారి జోక్యం చేసుకొని.. దానిని ఏపీకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు.
కియా మోటార్స్ ఏపీకి రావడంలో చంద్రబాబునాయుడు కృషి ఏమాత్రం లేదని తేల్చిచెప్పారు. కియా మోటార్స్ కు చంద్రబాబు ఎలాంటి సహకారం అందించలేదన్నారు. కియా మోటార్స్ ఎక్కడికో తరలిపోతోందని చంద్రబాబు దుష్ప్రచారం చేయడం తగదని, కియా మోటార్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఏపీలో మరో ప్లాంట్ నిర్మాణానికి కియా మోటార్ ప్రణాళికలు రచిస్తోందని వెల్లడించారు. కియా మోటార్స్‌పై పార్లమెంట్ లోపల, బయట టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ దుష్ప్రచారానికి ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు.
ఏపీ నుంచి కియా మోటార్స్ తన ప్లాంటును తరలిస్తోందంటూ కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం కియా సంస్థతో సత్సంబంధాలు కలిగి ఉందని, ఏపీలో ఆ సంస్థ భవిష్యత్తు ప్రణాళికలకు పూర్తి సహకారం అందిస్తామని విజయసాయిరెడ్డి ట్విటర్‌లో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment