బ్యారేజీకి దిగువ కాసుల వేట
ఇసుక రీచ్‌ల వేలం నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దిగువ రీచ్‌ల కోసం వ్యాపారులు, టీడీపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రీచ్‌ల సమీప గ్రామస్తులను కలసి వివరాలు సేకరించారు. రవాణా, కార్మికుల సమస్యలు ఏమైనా ఉన్నాయా వంటి విషయాలపై ఆరా తీశారు.
గుంటూరు : రాష్ట్ర గనుల శాఖ మంత్రి పీతల సుజాత ఆదేశాల మేరకు బుధవారం జిల్లాలోని 11 ఇసుక రీచ్‌లకు తొలిదశలో నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు జరిగాయి. అయితే అనివార్య కారణాల వల్ల నోటిఫికేషన్ విడుదల ఒక రోజు ఆలస్యమవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ 11 రీచ్‌ల్లో బ్యారేజీకి దిగువ భాగంలోని వల్లభాపురం, గుండిమెడ, జువ్వలపాలెం, పోతార్లంక రీచ్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక్కడ నాణ్యమైన ఇసుక లభ్యం కావడంతోపాటు రీచ్‌లోకి నేరుగా లారీలు వెళ్లడానికి రహదారి సౌకర్యం ఉంది. దీంతో వ్యాపారులు ఈ రీచ్‌లపై దృష్టి కేంద్రీకరించారు. భవన నిర్మాణాల్లో ప్లాస్టింగ్‌కు ఈ ఇసుకను ఎక్కువగా వినియోగిస్తారు. హైదరాబాద్‌తోపాటు భవన నిర్మాణాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ఈ ఇసుకకు డిమాండ్ ఉంది.
ఖర్చు తక్కువ..లాభాలు ఎక్కువ...
వేలంలో ఎక్కువ మొత్తాన్ని కేటాయించినా తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఇసుక అమ్మ డానికి అవకాశాలు ఉండడంతో వ్యాపారులు వీటిపైనే ఆసక్తి చూపుతున్నారు. బుధ వారం కొంత మంది వ్యాపారులు, టీడీపీ నేతల అనుచరులు ఈ రీచ్‌లకు సమీపంలోని గ్రామాల్లో కొందరు వ్యక్తులను కలసి వివరాలు సేకరించారు. రవాణా, ఇతర కార్మికుల సమస్యలేమైనా ఉన్నాయా వంటి వివరాలు తెలుసుకున్నారు.
ఈ రీచ్‌లకు యంత్రపరికరాలు అవసరం
ఇదిలాఉంటే, ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగంలోని ఏడు రీచ్‌ల నిర్వహణకు వేలంపాటదారులు యంత్ర పరికరాలను సమకూర్చుకోవాల్సి ఉంది. ముఖ్యంగా నది అడుగు భాగం నుంచి ఇసుక తీయడానికి మరపడవులు, ఆయిల్ ఇంజన్లు, నాటు పడవల అవసరం ఉంది. ఈ సరంజామా ఉన్నవారే ఇక్కడి రీచ్‌లను సులభంగా నిర్వహించగలగుతారు. వీటి కొనుగోలుకు లక్షల్లో పెట్టుబడి కావాలి. దీనికితోడు నది నీటిలోంచి తీసే ఇసుక లో కొంత మట్టి కలిసే అవకాశం ఉండడంతో కొనుగోలుదారులు ఈ ఇసుక పట్ల అంత ఆసక్తి చూపరు. దీంతో ఈ రీచ్‌లకు అనుకున్న స్థాయిలో డిమాండ్ ఉండదని వ్యాపారులు భావిస్తున్నారు.
అనుభవం ఉన్న వ్యక్తులతో భాగస్వామ్యం
గతంలో ఈ రీచ్‌ల నిర్వహణలో అనుభవం కలిగిన వ్యక్తులు, వారి వద్ద అందుబాటులో ఉన్న సరంజామాను పరిశీలించి వారిని భాగస్వాములుగా చేసుకునేందుకు వ్యాపారులు, టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇసుకను నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి నది పక్కనే అనువైన స్టాక్ పాయింట్లు ఉండాలి. కార్మికులు అందుబాటులో ఉండాలి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొందరు వ్యాపారులు ఈ రీచ్‌ల నిర్వహణలో అనుభవం ఉన్న వ్యక్తులతో బుధవారం సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో సరంజామా, కార్మికులు అందుబాటులో ఉన్న వ్యాపారులు కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెడుతున్న టీడీపీ నేతల నుంచి ఎక్కువ వాటానే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గురువారం నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఈ రంగంలో అనుభవం కలిగిన వ్యాపారులంతా సమావేశాలు, సంప్రదింపుల్లో మునిగితేలుతున్నారు.