‘కృష్ణా’పై మీ వాదన అంగీకరించం
తెలంగాణకు మరోసారి బోర్డు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటిని 37:63 నిష్పత్తిన పంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనను అంగీకరించేది లేదని కృష్ణా బోర్డు మరోమారు స్పష్టం చేసింది. శ్రీశైలం, సాగర్, జూరాల, తుంగభద్ర డ్యామ్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలతో మైనర్ ఇరిగేషన్ కింద ఉన్న మొత్తం కేటాయింపులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే 37:63 నిష్పత్తిన ఇరు రాష్ట్రాలకు వాటా దక్కుతుందని తెలిపింది.
ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం లభ్యతగా ఉన్న జలాల్లో 25 టీఎంసీలు తమకు కేటాయించాలని, పట్టిసీమ కింద ఏపీ చేసిన వినియోగాన్ని, మైనర్ ఇరిగేషన్ కింద తాము చేసిన నీటి వినియోగాన్ని లెక్కలోకి తీసుకున్నా తమకు అధిక వాటా దక్కుతుందని తెలంగాణ రాసిన లేఖపై బోర్డు వివరణ ఇచ్చింది.
పులిచింతలలో కనీస నీటిమట్టం ఉంచండి..
పులిచింతల ఫోర్‌షోర్ నీటిపై ఆధారపడి 8 ఎత్తిపోతల పథకాల కింద తెలంగాణ రైతులు వేసిన పంటలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు సూచించింది. ఈ మేరకు మంగళవారం ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది.