Samir Chatterjee
-
‘కృష్ణా’పై మీ వాదన అంగీకరించం
తెలంగాణకు మరోసారి బోర్డు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటిని 37:63 నిష్పత్తిన పంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనను అంగీకరించేది లేదని కృష్ణా బోర్డు మరోమారు స్పష్టం చేసింది. శ్రీశైలం, సాగర్, జూరాల, తుంగభద్ర డ్యామ్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలతో మైనర్ ఇరిగేషన్ కింద ఉన్న మొత్తం కేటాయింపులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే 37:63 నిష్పత్తిన ఇరు రాష్ట్రాలకు వాటా దక్కుతుందని తెలిపింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం లభ్యతగా ఉన్న జలాల్లో 25 టీఎంసీలు తమకు కేటాయించాలని, పట్టిసీమ కింద ఏపీ చేసిన వినియోగాన్ని, మైనర్ ఇరిగేషన్ కింద తాము చేసిన నీటి వినియోగాన్ని లెక్కలోకి తీసుకున్నా తమకు అధిక వాటా దక్కుతుందని తెలంగాణ రాసిన లేఖపై బోర్డు వివరణ ఇచ్చింది. పులిచింతలలో కనీస నీటిమట్టం ఉంచండి.. పులిచింతల ఫోర్‌షోర్ నీటిపై ఆధారపడి 8 ఎత్తిపోతల పథకాల కింద తెలంగాణ రైతులు వేసిన పంటలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు సూచించింది. ఈ మేరకు మంగళవారం ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. -
ఉన్న నీటిని పంచుకోండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎవరి వాదనకు వారే కట్టుబడి ఉండటంతో.. మధ్యేమార్గాన్ని అనుసరించాల్సిందిగా కృష్ణా బోర్డు తెలంగాణకు సూచించింది. జరిగిన నీటి వినియోగ లెక్కలను పక్కనపెట్టి ప్రస్తుత లభ్యత నీటిలోం చే ఇరు రాష్ట్రాలు నీటిని పంచుకోవాలని సూచించింది. దీనిపై గురువారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్కే జోషితో భేటీ అయ్యారు. ఈఎన్సీ మురళీధర్, నాగార్జునసాగర్ సీఈ సునీల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పస్తుతం కృష్ణా ప్రాజెక్టుల్లో 130 నుంచి 140 టీఎంసీల లభ్యత జలాలున్నాయని.. అందులోంచే ఇరు రాష్ట్రాలు పంచుకోవాలని బోర్డు సభ్య కార్యదర్శి సూచించారు. దీనిపై స్పందించిన జోషి... తెలంగాణ నీటి వినియోగ లెక్కలను మరోమారు బోర్డు సభ్య కార్యదర్శి దృష్టికి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ పట్టిసీమ కింద వాటిని 52 టీఎంసీలతో కలిపి మొత్తంగా 236 టీఎంసీల మేర వినియోగించుకుందని.. కానీ కేవలం 120 టీఎంసీల మేర వినియోగాన్నే చూపడం సరికాదన్నారు. మైనర్ ఇరిగేషన్ తగ్గింది తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ కింద ఏపీ చెబుతున్నట్లుగా 89.15 టీఎంసీల మేర వినియోగం లేదని.. కేవలం 68 టీఎంసీల మేర మాత్రమే ఉందని జోషి బోర్డుకు వివరించారు. అందులోనూ ఈ ఏడాది కేవలం 20 టీఎంసీల మేర మాత్రమే వినియోగం జరిగిందని తెలిపారు. దీనిపై సంయుక్త కమిటీతో విచారణ చేయించినా అభ్యంతరం లేదన్నారు. అయితే ఈ వినియోగ లెక్కలన్నీ పక్కనపెట్టి ప్రస్తుత లభ్యత నీటిని పంచుకోవాలని బోర్డు సభ్య కార్యదర్శి సూచించారు. దీనికి స్పందించిన జోషి... తక్కువలో తక్కువగా 65 టీఎంసీల మేర నీటిని కేటాయించాలని కోరినట్లు తెలిసింది. ఇందులో 50 టీఎంసీలను రబీ అవసరాలకు వాడుకుంటామని, మరో 15 టీఎంసీలు హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు ఉపయోగపడతాయని వివరించినట్లుగా సమాచారం. రబీ అవసరాలకు తక్షణమే నీటి విడుదల జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరగా... దీనిపై ఏపీ కార్యదర్శితో మాట్లాడతానని సమీర్ ఛటర్జీ పేర్కొన్నట్లు తెలిసింది. కాగా శుక్రవారం ఏపీ జల వనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌తో బోర్డు సమా వేశం కానుంది. ఆ తర్వాత మరోమారు ఇరు రాష్ట్రాలతో కలిపి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. -
సాగర్ కుడి కాల్వకు 4 టీఎంసీల నీరు
- వెంటనే విడుదల చేసే చర్యలు తీసుకోవాలని తెలంగాణకు బోర్డు లేఖ - హైదరాబాద్ తాగునీటికి తెలంగాణ 2 టీఎంసీలు వాడుకుందని వెల్లడి - జూరాల నీటి విడుదలతో శ్రీశైలంలోకి చేరుతున్న నీరు సాక్షి, హైదరాబాద్ నాగార్జునసాగర్ కుడి కాల్వ కింద ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే 4 టీఎంసీల నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణకు సూచించింది. గుంటూరు, ప్రకాశం జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి దృష్ట్యా సాగునకూలంగా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు సోమవారం బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నెల 20న జరిగిన త్రిసభ్య కమిటీ భేటీలోని కొన్ని అంశాలను లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 3, బీమా, నెట్టంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల ట్రయల్ రన్ నిర్వహణకు 4 టీఎంసీలు కలిపి మొత్తంగా ఏడు టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించగా, తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్ కుడి కాలువకు 8, ఎడమ కాలువకు 4, పుష్కరాలకు 4 టీఎంసీలు కలిపి మొత్తంగా 16 టీఎంసీలు తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ కోరింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఆ మేరకు నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ తేల్చిచెప్పారు. అయితే గుంటూరు, ప్రకాశం జిల్లాలో రక్షిత మంచి నీటిని సరఫరా చేసే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, తాగునీటికి తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, ఈ దృష్ట్యా తమకు 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందిస్తూ, ఏపీ అవసరాలను పేర్కొంటూ సోమవారం బోర్డు సభ్య కార్యదర్శి తెలంగాణకు లేఖ రాశారు. కుడి కాల్వకు 4 టీఎంసీలు విడుదల చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏఎంఆర్పీ నుంచి 2 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకున్న అంశాలను అందులో ప్రస్తావించారు. శ్రీశైలంలో పెరిగిన మట్టం.. కాగా ఎగువ జూరాలకు వస్తున్న ప్రవాభాలతో ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యానికి చేరడంతో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తోంది. దీంతో జూరాల దిగువ శ్రీశైలానికి నీరు వచ్చి చేరుతోంది. సోమవారం సైతం శ్రీశైలానికి 31,692 క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగాయి. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.81 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 28.29టీఎంసీలకు నీటి లభ్యత ఉంది. ఈ వారంలోనే శ్రీశైలానికి సుమారు 6 టీఎంసీల నీరు వచ్చి చేరడంతో మట్టం కొంచెం పెరిగింది. శ్రీశైలం జలాశయంలో 788.4 అడుగుల్లో 23.72 .. నాగార్జునసాగర్‌లో 503.8 అడుగుల్లో 121.38 టీఎంసీలు నిల్వ ఉన్నాయని వివరించారు. నీటి నిల్వలు కనిష్ఠ స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు జలాలను విడుదల చేయలేమని తేల్చిచెప్పారు. ఇరు రాష్ట్రాల కార్యదర్శులతో చర్చించి నీటి విడుదలపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.