- వెంటనే విడుదల చేసే చర్యలు తీసుకోవాలని తెలంగాణకు బోర్డు లేఖ
- హైదరాబాద్ తాగునీటికి తెలంగాణ 2 టీఎంసీలు వాడుకుందని వెల్లడి
- జూరాల నీటి విడుదలతో శ్రీశైలంలోకి చేరుతున్న నీరు
సాక్షి, హైదరాబాద్
నాగార్జునసాగర్ కుడి కాల్వ కింద ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే 4 టీఎంసీల నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణకు సూచించింది. గుంటూరు, ప్రకాశం జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి దృష్ట్యా సాగునకూలంగా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఈ మేరకు సోమవారం బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నెల 20న జరిగిన త్రిసభ్య కమిటీ భేటీలోని కొన్ని అంశాలను లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 3, బీమా, నెట్టంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల ట్రయల్ రన్ నిర్వహణకు 4 టీఎంసీలు కలిపి మొత్తంగా ఏడు టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించగా, తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్ కుడి కాలువకు 8, ఎడమ కాలువకు 4, పుష్కరాలకు 4 టీఎంసీలు కలిపి మొత్తంగా 16 టీఎంసీలు తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ కోరింది.
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఆ మేరకు నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ తేల్చిచెప్పారు. అయితే గుంటూరు, ప్రకాశం జిల్లాలో రక్షిత మంచి నీటిని సరఫరా చేసే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, తాగునీటికి తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, ఈ దృష్ట్యా తమకు 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందిస్తూ, ఏపీ అవసరాలను పేర్కొంటూ సోమవారం బోర్డు సభ్య కార్యదర్శి తెలంగాణకు లేఖ రాశారు. కుడి కాల్వకు 4 టీఎంసీలు విడుదల చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏఎంఆర్‌పీ నుంచి 2 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకున్న అంశాలను అందులో ప్రస్తావించారు.
శ్రీశైలంలో పెరిగిన మట్టం..
కాగా ఎగువ జూరాలకు వస్తున్న ప్రవాభాలతో ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యానికి చేరడంతో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తోంది. దీంతో జూరాల దిగువ శ్రీశైలానికి నీరు వచ్చి చేరుతోంది. సోమవారం సైతం శ్రీశైలానికి 31,692 క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగాయి. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.81 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 28.29టీఎంసీలకు నీటి లభ్యత ఉంది. ఈ వారంలోనే శ్రీశైలానికి సుమారు 6 టీఎంసీల నీరు వచ్చి చేరడంతో మట్టం కొంచెం పెరిగింది.
శ్రీశైలం జలాశయంలో 788.4 అడుగుల్లో 23.72 .. నాగార్జునసాగర్‌లో 503.8 అడుగుల్లో 121.38 టీఎంసీలు నిల్వ ఉన్నాయని వివరించారు. నీటి నిల్వలు కనిష్ఠ స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు జలాలను విడుదల చేయలేమని తేల్చిచెప్పారు. ఇరు రాష్ట్రాల కార్యదర్శులతో చర్చించి నీటి విడుదలపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.