శుక్రవారం జలసౌధలో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల, జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఆయకట్టు రైతాంగానికి శుభవార్త. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఈనెల 22న ఎడమ కాల్వ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాల ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్ రెడ్డి, ఎంపీలు గుత్తాసుఖేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తుంగభద్ర, ఆల్మట్టి వరద ప్రవాహంవివరాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా బేసిన్ పరిధిలో ఏయే ప్రాజెక్టుల్లోకి, చెరువుల్లో కి నీరు వచ్చి చేరుతోందో ఆరా తీశారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతున్న క్రమాన్ని తెలుసుకున్నారు.
భవిష్యత్ తాగు నీటి అవసరాల మేరకు కొంతమేర నిల్వ చేసి.. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని ఎడమ కాలువ రైతాంగానికి నష్టం కలుగకుండా ఉం డేందుకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. వరద నీటిని అంచనా వేస్తూ రైతుల ప్రయోజనాలు కాపాడేలా ఈనెల 22 నుంచి ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే ఏఎంఆర్పీ కాలువ, నాగార్జున సాగర్ లో లెవెల్ కెనాల్ పరిధిలోని చెరువులను తాగునీటి అవసరాల నిమిత్తం నింపాలని మంత్రులు ఆదేశించారు. రైతులకు నీటిని విడుదల చేసే షెడ్యూల్‌ను జిల్లా కలెక్టర్లు, ఇంజనీర్లు, రైతు సమితి నేతలతో చర్చించి విడుదల చేయాలని హరీశ్ ఆదేశించారు. రైతులు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని తమ పంటలకు వినియోగించుకోవాలని సూచించారు.
నీటి విడుదల షెడ్యూల్ వివరించాలి
డీప్యూటీ ఈఈలు స్థానికంగా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి నీటిని విడుదల చేసే షెడ్యూల్‌ను వివరించాలని హరీశ్ రావు ఆదేశించారు. నీటిని విడుదల చేసే ముందు ఇంజనీర్లు తప్పనిసరిగా కాలువలను పరిశీలించాలన్నారు. నీటి విడుదలకు ముందు కాలువల తూముల గేట్లు సరిగా ఉన్నవి లేనిదీ చూసుకోవాలని, లీకేజీలు లేకుండా చూడాలని ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులతో సాగు నీటి శాఖ అధికారులు సర్కిల్, డివిజనల్ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. వారబందీ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు కాలువల మీదే ఆధారపడకుండా, భూగర్భ జలాలను వినియోగించుకోవాలని సూచించారు.
2.94 లక్షల ఎకరాలకు నీరు
రాష్ట్రంలోని 28 మీడియం ప్రాజెక్టుల నుంచి 2.94 లక్షల ఎకరాలకు సాగు నీటిని ఈ ఖరీఫ్ సీజన్‌కు అందించవచ్చని సమీక్షలో నిర్ణయించారు. ఇందులో గోదావరి బేసిన్ ప్రాజెక్టులు 21 ఉండగా, వాటి కింద 1.92 లక్షల ఎకరాల ఆయకట్టు, కృష్ణా బేసిన్ పరిధిలో ఏడు ప్రాజెక్టులు ఉండగా వాటి పరిధిలో 1.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలని ఇంజనీర్లను హరీశ్‌రావు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment