నాగార్జున సాగర్
సాక్షి, హైదరాబాద్ : కొన్నిరోజులుగా కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు.. రాష్ట్ర రైతాంగంలో ఆశలు రేపుతున్నాయి. నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం నమోదవుతున్న ప్రవాహాలు ఖరీఫ్ సాగుకు ఊపిరిపోశాయి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటం, ఇకపై వచ్చే నీరంతా దిగువ సాగర్‌కు రానుండటం ఆయకట్టు రైతాంగాన్ని ఆనందంలో ముంచెత్తు తోంది. ఈ నేపథ్యంలో సాగర్ ఎడమ కాల్వ కింద 6.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు నీటి పారుదల శాఖ సిద్ధమైంది. ఈ ఆయకట్టుకు నీటి విడుదలపై సోమవారం మిర్యాలగూడలో షెడ్యూల్ ప్రకటించనుంది. మొత్తంగా ఏడు తడుల్లో నీరిచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది.
సాగర్‌కు 2.34 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
సాగర్ ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గత ఇరవై రోజులుగా స్థిరంగా వస్తున్న ప్రవాహాలతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి 1.28 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 1.35 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వస్తోంది. దీంతో జూరాలకు 1.39 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం నమోదుకాగా, 1.47 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రవాహాలకు తోడు తుంగభద్ర నుంచి 1.06 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తుండటంతో శ్రీశైలానికి 2.64 లక్షల క్యూసెక్కుల మేర
ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 215.8 టీఎంసీల నిల్వకు గానూ 198.36 టీఎంసీల లభ్యత ఉంది. భారీ ప్రవాహాల నేపథ్యంలో ఇక్కడి నుంచి 2.64 లక్షల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో సాగర్‌లోకి ప్రస్తుతం 2.34 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, 312.05 టీఎంసీలకు గానూ 187.83 టీఎంసీల నిల్వలున్నాయి. మరో 125 టీఎంసీలు వస్తే ప్రాజెక్టు నిండుతుంది.
నేడు షెడ్యూల్ ప్రకటన
జూన్, జూలైలో ప్రవాహాలు లేని కారణంగా ఖరీఫ్‌లో నాగార్జునసాగర్ కింది ఆయకట్టుకు నీటి విడుదలపై ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుత నిల్వ, వస్తున్న ప్రవాహాలను దృష్టిలో పెట్టుకొని నీటి పారుదల శాఖ వచ్చే నవంబర్ వరకు ప్రాజెక్టు కింద అవసరాలపై అంచనా లెక్కలను సిద్ధం చేసింది. మొత్తంగా 6.25 లక్షల ఎకరాలకు నీరివ్వాలనే సంకల్పంతో ఉంది. దీనికి ఇప్పటికే విడుదల చేసిన 12 టీఎంసీలకు తోడు మరో 33 టీఎంసీలు వినియోగించనుంది. ఇప్పటికే 33 టీఎంసీలు కోరుతూ కృష్ణా బోర్డుకు ఇండెంట్ సమర్పించింది. ఒక్కో టీఎంసీ నీటితో 15 నుంచి 16 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉందని, ఈ లెక్కన 33 వేల టీఎంసీలు సరిపోతాయని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా 7 తడుల్లో నవంబర్ చివరి వరకు నీటిని ఇచ్చేలా సిద్ధం చేసిన షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించనున్నారు. 22వ తేదీ నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. ఎస్‌ఎల్‌బీసీ కింద చెరువులను నింపేందుకు 12 టీఎంసీలు, హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు 7.50 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరుతోంది.
45 టీఎంసీలు దాటాలి..
తెలంగాణతోపాటు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం 1,072 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 33.13 టీఎంసీలు ఉంది. ఆదివారం మధ్యాహ్నం 12,550 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. అయితే ప్రాజెక్టు నిల్వలు 45 టీఎంసీలకు చేరితే గానీ ఆయకట్టుకు నీటి విడుదలపై స్పష్టత రాదని నీటి పారుదల వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్లంపల్లికి 24 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండటం, ప్రాజెక్టు ఇప్పటికే నిండటంతో 32 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. కడెంలోకి 2,582 క్యూసెక్కులు, ఎల్‌ఎండీలోకి 527 క్యూసెక్కుల వరద వస్తోంది.
ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ప్రవాహాలు ఇలా..
ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ (టీఎంసీల్లో) ప్రస్తుత నిల్వ ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో) ఔట్‌ఫ్లో
ఆల్మట్టి 129.72 124.38 1,21,670 1,28,770
నారాయణపూర్ 37.64 35.70 1,30,000 1,35,000
జూరాల 9.66 9.65 1,39,000 1,47,559
శ్రీశైలం 215.81 198.36 2,64,665 2,64,665
సాగర్ 312.05 187.83 2,34,240 8,788
కడెం 7.6 6.01 2,587 5,721
లోయర్ మానేరు 24.07 3.51 527 99
నిజాంసాగర్ 17.80 2.26 0 0
సింగూరు 29.91 7.61 170 170
ఎల్లంపల్లి 20.17 19.09 24,684 32,406
ఎస్సారెస్పీ 90.31 33.13 12,550 380
Comments
Please login to add a commentAdd a comment