ఉన్న నీటిని పంచుకోండి
ఉన్న నీటిని పంచుకోండి
Published Fri, Dec 2 2016 1:34 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎవరి వాదనకు వారే కట్టుబడి ఉండటంతో.. మధ్యేమార్గాన్ని అనుసరించాల్సిందిగా కృష్ణా బోర్డు తెలంగాణకు సూచించింది. జరిగిన నీటి వినియోగ లెక్కలను పక్కనపెట్టి ప్రస్తుత లభ్యత నీటిలోం చే ఇరు రాష్ట్రాలు నీటిని పంచుకోవాలని సూచించింది. దీనిపై గురువారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్‌కే జోషితో భేటీ అయ్యారు. ఈఎన్‌సీ మురళీధర్, నాగార్జునసాగర్ సీఈ సునీల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పస్తుతం కృష్ణా ప్రాజెక్టుల్లో 130 నుంచి 140 టీఎంసీల లభ్యత జలాలున్నాయని.. అందులోంచే ఇరు రాష్ట్రాలు పంచుకోవాలని బోర్డు సభ్య కార్యదర్శి సూచించారు. దీనిపై స్పందించిన జోషి... తెలంగాణ నీటి వినియోగ లెక్కలను మరోమారు బోర్డు సభ్య కార్యదర్శి దృష్టికి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ పట్టిసీమ కింద వాటిని 52 టీఎంసీలతో కలిపి మొత్తంగా 236 టీఎంసీల మేర వినియోగించుకుందని.. కానీ కేవలం 120 టీఎంసీల మేర వినియోగాన్నే చూపడం సరికాదన్నారు.
మైనర్ ఇరిగేషన్ తగ్గింది
తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ కింద ఏపీ చెబుతున్నట్లుగా 89.15 టీఎంసీల మేర వినియోగం లేదని.. కేవలం 68 టీఎంసీల మేర మాత్రమే ఉందని జోషి బోర్డుకు వివరించారు. అందులోనూ ఈ ఏడాది కేవలం 20 టీఎంసీల మేర మాత్రమే వినియోగం జరిగిందని తెలిపారు. దీనిపై సంయుక్త కమిటీతో విచారణ చేయించినా అభ్యంతరం లేదన్నారు. అయితే ఈ వినియోగ లెక్కలన్నీ పక్కనపెట్టి ప్రస్తుత లభ్యత నీటిని పంచుకోవాలని బోర్డు సభ్య కార్యదర్శి సూచించారు. దీనికి స్పందించిన జోషి... తక్కువలో తక్కువగా 65 టీఎంసీల మేర నీటిని కేటాయించాలని కోరినట్లు తెలిసింది.
ఇందులో 50 టీఎంసీలను రబీ అవసరాలకు వాడుకుంటామని, మరో 15 టీఎంసీలు హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు ఉపయోగపడతాయని వివరించినట్లుగా సమాచారం. రబీ అవసరాలకు తక్షణమే నీటి విడుదల జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరగా... దీనిపై ఏపీ కార్యదర్శితో మాట్లాడతానని సమీర్ ఛటర్జీ పేర్కొన్నట్లు తెలిసింది. కాగా శుక్రవారం ఏపీ జల వనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌తో బోర్డు సమా వేశం కానుంది. ఆ తర్వాత మరోమారు ఇరు రాష్ట్రాలతో కలిపి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
Advertisement
Advertisement