సాక్షి ప్రతినిధి, ఏలూరు :‘‘పట్టిసీమతో కృష్ణాడెల్టాకు గోదావరి జలాల తరలింపు సెప్టెంబర్ మొదటి వారంలో మొదలవుతుంది.. తాడిపూడి ఎత్తిపోతల్లో మిగులు జలాలను పోలవరం కుడి కాల్వలో పడేస్తాం.. మొత్తంగా పోలవరం కుడి కాల్వ ద్వారా 70, 80 టీఎంసీల గోదావరి నీరు కృష్ణాడెల్టాకు తీసుకువెళ్తాం.. తమ్మిలేరు, వాగులేరు, బుడమేరు, ఎర్రకాలువల నీళ్లను కూడా కృష్ణా డెల్టాకు తరలిస్తాం...’’ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చేసిన ఈ ప్రకటనలపై జిల్లా రైతాంగం ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది. ప్రభుత్వం మన జిల్లాలోని గోదావరి జలాల దారులన్నీ కృష్ణాకు అనుసంధానం చేయడం.. ఇక్కడి నీరంతా అక్కడి డెల్టాకు ఎత్తిపోయాలని లక్ష్యంగా పెట్టుకోవడంపై పశ్చిమ రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఆర్నెల్ల కిందట పట్టిసీమ పథకంతో కేవలం గోదావరి మిగులు జలాలను మాత్రమే తీసుకువెళ్తామని సీఎం చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ పథకం పూర్తయ్యే నాటికి అన్ని ఎత్తిపోతల పథకాలు, కాలువలు, వాగులు, వంకలను కుడి కాల్వకి అనుసంధానం చేస్తామని చెప్పడం పశ్చిమ రైతాంగ ప్రయోజనాలను పణంగా పెట్టడమేనని రైతు సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మధ్యలో ఉన్నా నీళ్లు లేక జిల్లాలో చాలాచోట్ల నాట్లు పడలేదు. చివరి భూములైతే బీడు వారాయి. ఈ పరిస్థితుల్లో గోదావరి జలాలన్నీ కృష్ణాడెల్టాకే ఎత్తిపోస్తే పచ్చని పశ్చిమ ఎడారిగా మారిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదని రైతు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. చెంతనే గోదావరి ఉన్నా జిల్లాలో రోజురోజుకీ తీవ్రమవుతున్న సాగునీటి ఎద్దడిని పట్టించుకోకుండా పాలకులు కృష్ణాడెల్టా జపం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
చివరి భూములకు చింతే..
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో డెల్టాలోని శివారు భూములకు సాగునీరు సకాలంలో అందక వరినాట్లు సైతం ఆలస్యమయ్యాయి. నేటికీ నరసాపురం, మొగల్తూరు మండలాల్లో రెండు వేల ఎకరాల్లో వరినాట్లు పడలేదు. భీమవరం, వీరవాసరం మండలాల పరిధిలో తగినంత వర్షాలు కురవకపోతే ఏడు వేల ఎకరాలకు సాగునీటి ఇబ్బంది తలెత్తే ప్రమాదముంది. ఆక్వా చెరువులకు డె ల్టా కాలువల నుంచి అనుకున్న స్థాయిలో నీరందని పరిస్థితి ఉంది.
మెట్ట ప్రాంతాల్లో కటకట
మెట్ట ప్రాంతంలో ఉన్న 18 మండలాల్లో ఎక్కడా 50 నుంచి 60 శాతానికి మించి వరినాట్లు పూర్తి కాలేదు. చెరువులు, జలశయాలకు నేటికీ అనుకున్న స్థాయిలో నీరు చేరలేదు. పోలవరం నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో 12,619 హెక్టార్లలో వరిసాగు చేయాల్సి ఉండగా, కేవలం 4,901హెక్టార్లలో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. గోపాలపురం, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దేవరపల్లి మండలాల పరిధిలో 6వేల హెక్టార్లలో వరిసాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు వెయ్యి ఎకరాలలో మాత్రమే నాట్లు వేశారు. ఇక చాలాచోట్ల చెరువుల ఆయకట్టు కింద వరినాట్లు నేటికీ పూర్తికాలేదు. చింతలపూడి వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో ఈ ఏడాది 16,915 హెక్టార్లలో వరిసాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షాభావం వల్ల సబ్ డివిజన్‌లో ఇంతవరకు 60 శాతం కూడా నాట్లు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న సాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలు, డెల్టా ఆధునికీకరణ పనులపై దృష్టి పెట్టకుండా గోదావరి నీళ్లన్నీ కుడికాల్వలో ఎత్తిపోయడమే పాలకులు లక్ష్యంగా పెట్టుకోవడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. మాటకు ముందు.. వెనుక పశ్చిమ రుణం తీర్చుకుంటానని చెప్పే బాబు... చివరికి ఇంతేనా జిల్లాకు ఒనగూర్చేది అని విమర్శిస్తున్నారు.
ఇక్కడి రైతుల ప్రయోజనాలను పణంగా పెడితే ఊరుకోం
కృష్ణా డెల్టాకు నీళ్లు ఇవ్వొద్దని మేం అనడం లేదు. కానీ గోదావరి జిల్లాల ైరైతుల ప్రయోజనాలను పణంగా పెడితే ఊరుకునేది లేదు. ఈ ఖరీఫ్ సీజన్‌లోనే నీళ్లందక జిల్లాలో చాలాచోట్ల నాట్లు పడలేదు. గోదావరి చెంతనే ఉన్నా సాగునీటి ఎద్దడితో రైతులు అల్లాడిపోతున్నారు. డెల్టా ఆధునికీకరణ చేపడితే లక్షలాది ఎకరాలు, చివరి భూములు సాగులోకి వస్తాయి. దానిని విస్మరించిన ప్రభుత్వం కృష్ణాడెల్టాకు నీళ్లు మళ్లించడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుంది.
- బి.బలరాం, రైతు సంఘం రాష్ర్ట అధ్యక్షుడు.
మెట్ట రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం
తాడిపూడి పథకం పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ఇక్కడి నీటిని పోలవరం కాలువ ద్వారా కృష్ణాకు మళ్లించడానికే ప్రాధ్యాన్యం ఇస్తోంది. ఏటా ఒకే పంటకు నీరందిస్తున్నప్పటికీ తాడిపూడి కాలువల్లో నీరు పారడం ద్వారా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. తద్వారా మెట్ట ప్రాంతంలోని రైతులకు పరోక్షంగా రెండో పంటకు ఉపకరిస్తుంది.
- తానేటి వనిత, వైఎస్సాఆర్ సీపీ రాష్ట్ర కార్యద ర్శి, కొవ్వూరు.
నీళ్లన్నీ కృష్ణార్పణం!
Published Mon, Aug 17 2015 2:44 AM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM
Advertisement